తలసరి ఆదాయాన్ని తలదన్నేలా పాలమూరు జిల్లా దూసుకెళ్తున్నది. తెలంగాణ అభివృద్ధి ప్రణాళికా సంఘం 2020-21 ఏడాదికిగానూ ప్రకటించిన జాబితాలో జిల్లాకు ఐదో స్థానం దక్కింది. రూ.2.23 లక్షల ఆదాయం సమకూరింది. చుట్టుపక్కల జిల్లాలతో పోలిస్తే గణనీయంగా రాబడి పెరిగి రారాజులా నిలిచింది. ముందు వరుసలో హైదరాబాద్, రంగారెడ్డి, మేడ్చల్, మెదక్ ఉన్నాయి. నాగర్‌కర్నూల్ జిల్లా రూ.1.63 లక్షలు(21వ స్థానం), వనపర్తి జిల్లా రూ.1.51 లక్షలు(27వ స్థానం), జోగుళాంబ గద్వాల జిల్లా రూ.1.50 లక్షలు(28వ స్థానం), నారాయణపేట జిల్లా రూ.1.43 లక్షల (30వ స్థానం) ఆదాయంతో పోటీ పడుతున్నాయి. ఇప్పటికే పర్యాటకంగా ఎంతో అభివృద్ధి సాధించడం.. సాగునీరు సమృద్ధిగా లభిస్తుండ డంతో భూముల ధరలకు రెక్కలు వచ్చి ‘రియల్’ వ్యాపారం జోరందుకున్నది. దీనికి తోడు త్వరలో ఐటీ పార్కులో బ్యాటరీ కంపెనీ రాబోతుండగా.. హన్వాడ సమీపంలో త్వరలో ఫుడ్ పార్కు ఏర్పాటు కానుండగా మరింత పురోభివృద్ధి సాధించనున్నది.
మహబూబ్‌నగర్, డిసెంబర్ 17 (నమస్తే తెలంగాణ ప్రతినిధి) : రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించిన తలసరి ఆదాయం జాబితాలో మహబూబ్‌నగర్ జిల్లాకు ఐదో స్థానం దక్కింది. హైదరాబాద్ చుట్టుపక్కల ఉన్న జిల్లాలతో పోలిస్తే తలసరి ఆదాయం గణనీయంగా పెరిగినట్లు ఈ నివేదిక వెల్లడిస్తున్నది. తెలంగాణ అభివృద్ధి ప్రణాళిక సంఘం 2020-21లో 33 జిల్లాల తలసరి ఆదాయాలను లెక్కించింది. కొత్త జిల్లాలు ఏర్పాడ్డాక మహబూబ్‌నగర్‌లో వేగంగా జరుగుతున్న అభివృద్ధికి ఈ నివేదిక అద్దం పడుతున్నది. పారిశ్రామిక, వ్యవసాయ, రియల్ రంగాల్లో దూసుకుపోతున్నది.
రాష్ట్ర ప్రభుత్వ సంక్షేమ పథకాలు కూడా తోడవడంతో అభివృద్ధి పరుగు లు పెడుతున్నది. మహబూబ్‌నగర్ జిల్లా కేంద్రం నుంచి హైదరాబాద్‌కు గంటన్నరలో చేరుకోవచ్చు. శంషాబాద్ విమానాశ్రయం కూడా 75 కిలోమీటర్ల లోపే ఉన్నది. సుమారు 100 కిలోమీటర్ల మేర బెంగళూరు-హైదరాబాద్ ప్రధాన జాతీయ రహదారి 44 ఉండడం కూడా కలిసొచ్చే అం శం. అంతేకాకుండా 2017లో దివిటిపల్లి వద్ద ఐటీ పార్కుకు శంకుస్థాప న చేశారు. ఇప్పటికే జడ్చర్ల సమీపంలోని పోలెపల్లి సెజ్‌లో అనేక ఫార్మా, ఇతర రంగాల కంపెనీలు భారీ ఎత్తున వెలిశాయి. వ్యవసాయ రంగానికి ప్రభుత్వం ఇస్తున్న సహాయ సహకారాలతో ఈఏడాది సాగు విస్తీర్ణం గణనీయంగా పెరిగింది. సుమారు 16 లక్షల ఎకరాలు సాగులోకి వచ్చాయి. ఈ రెండు రంగాలకు రియల్ ఎస్టేట్ కూడా తోడైంది. దీంతో తలసరి ఆదాయంలో భారీ వృద్ధి వచ్చింది. హైదరాబాద్, రంగారెడ్డి, మేడ్చల్, మెదక్ జిల్లాలతో పాలమూరు జిల్లా తలసరి ఆదాయంలో పోటీ పడుతున్నది.
కరువు కాటకాలు, వలసలకు నిలయమైన మహబూబ్‌నగర్ జిల్లా ఇ ప్పుడు అన్ని రంగాల్లో దూసుకుపోతున్నది. కొత్త జిల్లాలు ఏర్పడిన తరువాత మహబూబ్‌నగర్ జిల్లాలోని మూడు నియోజకవర్గాలు అభివృద్ధిలో పోటీ పడుతున్నాయి. ఇక్కడి ఎమ్మెల్యేలు సీఎం కేసీఆర్‌కు సన్నిహితులు కావడంతోపాటు పాలమూరు-రంగారెడ్డి ఎత్తిపోతల కూడా తోడవ్వడంతో సాగు, తాగునీటికి ఢోకా లేదు. వరుసగా కురుస్తున్న వర్షాలతో జలసిరులు కురిపిస్తున్నాయి. ఫలితంగా వలస జిల్లాకే వలసలు వచ్చే పరిస్థితికి చేరుకున్నది.
రైతులు అన్ని రకాల పంటలను సాగు చేస్తుండడంతో హైదరాబాద్‌తో సహా ఇతర ప్రాంతాలకు వ్యవసాయ ఉత్పత్తులు ఎగుమతి చేసే స్థాయికి ఎదిగారు. ఇందులో కూరగాయలు, పండ్లు, పూలు, పత్తి, వేరుశనగ ఉత్పత్తులు ప్రధానమైనవి. గిట్టుబా టు ధర కూడా లభిస్తుండడంతోపాటు రైతుబం ధు, ఉచితవిద్యుత్, రైతుబీమా పథకాలు రైతు ల్లో ధీమా నింపుతున్నాయి. ఫలితంగా వ్య వసాయదారుల ఆదాయం రెట్టింపైందని నివేదికలు వెల్లడిస్తున్నాయి.
మహబూబ్‌నగర్ జిల్లా పారిశ్రామిక రంగంలో దూసుకుపోతున్నది. మహబూబ్‌నగర్, జడ్చర్ల, దేవరకద్ర నియోజకవర్గాలు జాతీయ రహదారిని ఆనుకొని ఉండడం, విమానాశ్రాయానికి సమీపంలో ఉండడంతో పారిశ్రామిక వేత్తలు ఇక్కడికి రావడానికి ఆసక్తి చూపుతున్నారు. ప్రభుత్వం కూడా పరిశ్రమలకు అవసరమైన తాగునీరు, విద్యుత్‌ను అందించేందుకు సు ముఖంగా ఉండడంతో కంపెనీలు క్యూ కడుతున్నా యి. జిల్లా కేంద్రానికి సమీపంలో దివిటిపల్లి వద్ద రూ. 9,500 కోట్లతో అమెరాన్ బ్యాటరీ కంపెనీ ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి కేటీఆర్‌తో ఎంవోయూ కుదుర్చుకున్నది.
ఇంకా అనేక కంపెనీలు ఈ ప్రాంతంలో పెట్టుబడి పెట్టేందుకు సుముఖంగా ఉన్నాయి. పోలెపల్లి సెజ్‌లో ఫార్మా కంపెనీలు ఇప్పటికే తమ కార్యకలాపాలు ప్రారంభించాయి. తాజాగా తమ కంపెనీలను విస్తరిస్తున్నాయి. మరికొన్ని కంపెనీలు పెట్టుబడులు పెడుతున్నాయి. దీంతో రియల్ఎస్టేట్ రంగం కూ డా దూసుకుపోతున్నది. రంగారెడ్డి జిల్లాను ఆనుకొని రీజినల్ రింగ్‌రోడ్ వస్తుండడంతో రియల్ఎస్టేట్ మరింత పుంజుకున్నది. దీని చుట్టుపక్కల భూముల ధరలకు రెక్కలొచ్చాయి. భారీగా వెంచర్లు, విల్లాలు, ఇంటిగ్రేటేడ్ కమ్యునిటీ వెంచర్లు వెలుస్తున్నాయి. భారీగా లావాదేవీలు నడుస్తుండడంతో పాలమూరు జిల్లా తలసరి ఆదాయం గణనీయంగా పెరిగింది.
తెలంగాణ అభివృద్ధి ప్రణాళికా సం ఘం వెల్లడించిన నివేదికలో మహబూబ్‌నగర్ జిల్లా తలసరి ఆదాయం లో టాప్-5లో నిలిచింది. రూ.2.23 లక్షల ఆదాయంతో దూసుకుపోతున్న ది. హైదరాబాద్, రంగారెడ్డి, మెదక్, మేడ్చల్-మల్కాజ్గిరి జిల్లాల తర్వా త మహబూబ్‌నగర్ చోటు దక్కించుకున్నది. కరీంనగర్, నిజామాబాద్, వరంగల్ జిల్లాలను వెనక్కి నెట్టేసింది. నాగర్‌కర్నూల్ జిల్లా రూ.1.63లక్షలు, వనపర్తి జిల్లా రూ.1.51లక్షలు, జోగుళాంబ గద్వాల రూ.1.50 ల క్షలు, నారాయణపేట రూ.1.43 ల క్షల్లో ఉన్నది. నాగర్‌కర్నూల్ జిల్లా రా ష్ట్రంలో 21, వనపర్తి 27, గద్వాల 28, నారాయణపేట జిల్లా 30వ స్థా నంలో ఉన్నాయి.
ఉమ్మడి రాష్ట్రంలో ఎన్నో దశాబ్దాలుగా నలిగిపోయిన తెలంగాణకు విముక్తి కల్పించి ప్రత్యేక రాష్ట్రంగా ఏర్పాటు చేసుకున్నాం. స్వరాష్ర్టాన్ని బాగు చేసుకోవాలనే తపనతో సీఎం కేసీఆర్ అనేక సంక్షేమ కార్యక్రమాలు చేపట్టారు. నేరుగా అందుతున్న సంక్షేమ ఫలాలతో మహబూబ్‌నగర్ జిల్లాలో వ్యవసాయం పండుగలా మారింది. పనుల కోసం వలసవెళ్లిన వాళ్లంతా తిరిగొస్తున్నారు. పాలమూరుకే వలస వచ్చే పరిస్థితికి చేరుకున్నాం. పారిశ్రామికం, వ్యవసాయం, రియల్ఎస్టేట్ పరంగా ఎంతో అభివృద్ధి సాధించాం అనడానికి తలసరి ఆదాయమే నిదర్శనం. రాష్ట్రంలో ఐదో స్థానానికి చేరుకున్న పాలమూరు జిల్లా భవిష్యత్‌లో మొదటి స్థానానికి ఎగబాకినా ఆశ్యర్యపడాల్సిన అవసరం లేదు. ఇదంతా సీఎం కేసీఆర్ విజన్ వల్లే సాధ్యమైంది.
– డా.వి.శ్రీనివాస్‌గౌడ్, ఎక్సైజ్, క్రీడా శాఖ మంత్రి