మహబూబ్ నగర్ కలెక్టరేట్, ఏప్రిల్ 10: కాంగ్రెస్ ప్రభుత్వం తన మేనిఫెస్టోలో యూనివర్సిటీల్లో పనిచేస్తున్న ఒప్పంద అధ్యాపకులను పర్మినెంట్ చేస్తామని ఇచ్చిన హామీ మేరకు అందరిని రెగ్యూలరైజ్ చేయాలని పాలమూరు యూనివర్సిటీ కాంట్రాక్ట్ అధ్యాపకుల సంఘం (PATU) నాయకులు డిమాండ్ చేశారు. ఆల్ యూనివర్సిటీస్ కాంట్రాక్ట్ టీచర్స్ జేఎసీ నాయకుల పిలుపు మేరకు గురువారం విధులు బహిష్కరించి పరిపాలన భవనం ఎదుట నిరసన తెలిపారు. అనంతరం పాలమూరు యూనివర్సిటీ ముఖద్వారం ఎదుట ధర్నా చేపట్టారు. ఈ సందర్భంగా పీయూటీఏ నాయకులు ఏర్పాటు చేసిన కార్యక్రమాల్లో మాట్లాడారు.
రాష్ట్రంలోని 12 విశ్వవిద్యాలయాల్లో పనిచేస్తున్న 1270 మంది ఒప్పంద అధ్యాపకులను బేషరతుగా పర్మినెంట్ చేయాలని, జీవో 21 వెంటనే రద్దు చేసి తమకు న్యాయం చేయాలని డిమాండ్ చేశారు. రాష్ట్ర ప్రభుత్వం విశ్వవిద్యాలయ అసిస్టెంట్ ప్రొఫెసర్ల కోసం జీవో నంబర్ 21 తీసుకువచ్చి కాంట్రాక్ట్ అధ్యాపకుల పొట్ట కొట్టడం సరికాదన్నారు. గత ఎన్నికల్లో కాంగ్రెస్ ప్రభుత్వం విశ్వవిద్యాలయాల్లో పనిచేస్తున్న కాంట్రాక్ట్ అధ్యాపకులను రెగ్యులరైజ్ చేయాలని.. లేని పక్షంలో ఉద్యోగ భద్రత కల్పించాలని డిమాండ్ చేసిందని గుర్తు చేశారు. అధికారంలోకి వచ్చి సంవత్సరం దాటినప్పటికీ. యూనివర్సిటీ కాంట్రాక్ట్ అధ్యాపకుల పట్ల చిన్నచూపు చూడటం తగదన్నారు. అనేక సంవత్సరాలుగా యూనివర్సిటీలలో విశ్వవిద్యాలయ అభివృద్ధి కోసం పనిచేస్తున్న కాంట్రాక్ట్ ప్రొఫెసర్లు తమ న్యాయమైన డిమాండ్‌ను అమలు చేయమని కోరడమే ప్రజాపాలనలో నేరంగా మారుతుందా అని ప్రశ్నించారు. న్యాయమైన డిమాండ్లు నెరవేర్చాలని కోరుతుంటే అధ్యాపకులను అక్రమంగా అరెస్టు చేసి పోలీస్ స్టేషన్లకు తరలించడం ఎంతవరకు సమంజసం అని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఎన్నో ఏండ్లుగా యూనివర్సిటీలను నమ్ముకుని పనిచేస్తున్నామని జూనియర్ డిగ్రీ లెక్షరర్లను క్రమబద్ధీకరించినట్లే యూనివర్సిటీ ఒప్పంద అధ్యాపకులను క్రమబద్ధీకరించాలని డిమాండ్ చేశారు.
యూనివర్సిటీ ఒప్పంద అధ్యాపకుల న్యాయమైన డిమాండ్ లను పరిష్కరించాలని ఒప్పంద అధ్యాపకులను క్రమబద్ధీకరించిన తర్వాతే మిగిలిన పోస్టులకు నోటిఫికేషన్‌కి వెళ్లి రిక్రూట్ చేసుకోవాలన్నారు. అరెస్టులతో మా ఆశయాలను అణచివేయలేరని హెచ్చరించారు. రాష్ట్ర ప్రభుత్వం తమ సమస్యలను పరిష్కరించే దిశగా తగు చర్యలు చేపట్టాలని లేదంటే ఆందోళన కార్యక్రమాలు ఉధృతం చేస్తామని హెచ్చరించారు. ఈ కార్యక్రమాల్లో పీయూ ఆధ్యాపకులు డాక్టర్ శకుంటి రవికుమార్ డాక్టర్ భూమయ్య డాక్టర్ జ్ఞానేశ్వర్ సురేష్ గురు స్వామి, శైలస్ రామ్మోహన్ శ్రీధర్ రెడ్డి పర్వతాలు రవీందర్ గౌడ్, కర్ణాకర్ శివకుమార్ సింగ్ స్వాతి ఆయేషా సుదర్శన్ రెడ్డి, విశ్వనాధ్, బషీరాబాద్, మృదుల, సరిత, శారద, సిద్ధరామ గౌడ్ సోమేశ్వర్ రవికాంత్ విజయభాస్కర్, వెంకటేష్, ఆంజనేయులు, సురేష్ తదితరులు పాల్గొన్నారు.