గద్వాల, మే 4 : జిల్లాలో వరిధాన్యం కొనుగోళ్లు నత్తనడక కొనసాగుతున్నాయి. దీంతో రైతులు అవస్థలు పడుతున్నారు. కొనుగోలు కేంద్రాలకు ధాన్యం తీసుకొచ్చి 20రోజులైనా ధాన్యం తూకం వేసేవారు లేకపోవడంతో ధాన్యం అమ్ముకోవడానికి రైతులు అష్టకష్టాలు పడుతున్నారు. దళారులకు రైతులు తక్కువ ధరకు తమ ధాన్యం అమ్ముకోకుండా ఉండాలనే ఉద్దేశంతో ప్రభు త్వం కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేస్తే నిర్వహణ లోపం,అధికారుల నిర్లక్ష్యం కారణంగా కొనుగోళ్లు ముందుకు సాగడం లేదు.
ఆరుగాలం పంట పం డించి రైతన్న కొనుగోలు కేంద్రాలకు ధాన్యం తీసుకొస్తే కేంద్రాల్లో అమ్ముకోవడానికి రైతులు నానా అవస్థలు పడుతున్నారు. ప్రభుత్వం రైతు భరోసా పూర్తిస్థాయిలో ఇవ్వకపోవడంతో రైతులు పెట్టుబడి సాయం కోసం ఆసాముల దగ్గర అప్పులు తీసుకున్నారు. పంట చేతికి వచ్చిన తర్వాత అమ్మి ఇస్తామని ఆసాములకు రైతులు చెబుతూ వచ్చారు. అయితే పంట చేతికి వచ్చి కొనుగోలు కేంద్రాలకు తీసుకొచ్చినా కొనుగోళ్లు ఆలస్యం కావడంతో రైతులను ఆసాములు అప్పులు కట్టాలని ఒత్తిడి తెస్తుండడంతో రైతులకు ఏమి చేయాలో పాలుపోవడం లేదు. కాంగ్రెస్ పాలనలో రైతుల పరిస్థితి ఆగమ్య గోచరంగా తయారైంది. ఓ వైపు మక్క రైతుల అవస్థలు, మరోవైపు వరి ధాన్యం అమ్ముకోవడానికి అన్నదాతలు అష్టకష్టాలు పడుతున్నారు. అయినా ప్రభుత్వంలో కానీ అధికారుల్లో మాత్రం ఏ మాత్రం చలనం లేదు.
జిల్లాలో 76 కొనుగోలు కేంద్రాల ఏర్పాటు..
జోగుళాంబ గద్వాల జిల్లాలో యాసంగి సీజన్లో రైతులు 74,162 ఎకరాల్లో వరి పంటను సాగు చేశారు. అయితే సరాసరి లక్ష మెట్రిక్ టన్నుల ధాన్యం కొనుగోలు చేయాలనేది ప్రభుత్వ లక్ష్యం. అయితే కొనుగోళ్లు ప్రారంభమై 20రోజులు అవుతున్నా ఇప్పటివరకు 297 మంది రైతుల నుంచి 2,353 మెట్రిక్ టన్నుల ధాన్యం మాత్రమే కొనుగోలు చేశారు. రైతులకు సంబంధించి ధాన్యం కొనుగోలు వివరాలను అధికారులు ఇప్పటివరకు 1,733 మెట్రిక్ టన్నుల వివరాలు ఏపీఎంఎస్‌లో నమోదు చేశారు. మిగతా రైతుల వివరాలు ఆన్లైన్లో నమోదు చేయాల్సి ఉంది.

కొనుగోళ్ల ఆలస్యంతో..
రైతులు తాము పండించిన వరి ధాన్యాన్ని కొనుగోలు కేంద్రాలకు తీసుకొచ్చి 20రోజులు అవుతున్నా కొనుగోళ్లు ఆలస్యం కావడంతో రైతులు మిగత పనులు వదులు కొని తమ పంట ఉత్పత్తుల వద్ద కాపలా ఉండాల్సిన పరిస్థితి నెలకొన్నది. కొనుగోళ్లు ఆలస్యమయ్యే కొద్ది రైతులపై ఆసాముల ఒత్తిడి పెరుగుతుండడంతో కొంత మంది రైతులు సమీపంలోని రాయచూర్‌కు తమ ధాన్యం తీసుకెళ్లి విక్రయిస్తున్నారు. దీనికి తోడు 2024-2025 యాసంగికి సంబంధించి రైతులకు చెల్లించాల్సిన బోనస్ సుమారు రూ.40కోట్లు ప్రభుత్వం చెల్లించకపోవడంతో కొంత మంది రైతులు కొనుగోలు కేంద్రాలకు ధాన్యం తీసుకరావడానికి ఆసక్తి చూపడం లేదు. కొనుగోలు కేంద్రాల వద్ద రైతులకు సౌకర్యాలు కల్పించాలని ప్రభుత్వం ఆదేశించినప్పటికీ ఆ దిశగా అధికారులు చర్యలు తీసుకోక పోవడంతో రైతులు సమీపంలో ఉన్న చెట్ల కింద సేద తీరుతున్నారు. కొనుగోలు కేంద్రాలకు తెచ్చిన ధాన్యం వెంటనే కొనుగోలు చేసే విధంగా చర్యలు తీసుకొని కొనుగోలు కేంద్రాల వద్ద రైతులకు సౌకర్యాలు కల్పించాలని రైతులు అధికారులను కోరుతున్నారు.
20 రోజులైనా కొనేవారు లేరు..
నేను 20 ఎకరాల్లో వరి పంట సాగు చేశా. కొనుగోలు కేంద్రానికి తీసుకొస్తే మద్దతు ధర వస్తుందని ధాన్యం కొనుగోలు కేంద్రానికి తీసుకొచ్చా. ధాన్యం తీసుకొచ్చి 20రోజులు అవుతున్నా ఎవరూ కొనే దిక్కు లేదు. టోకెన్లు ఇస్తామని చెబుతున్నారు. టోకెన్ల ద్వారా పోతే మరో 20రోజులైనా ధాన్యం కొనే పరిస్థితి ఇక్కడ కనిపించడం లేదు. పంట సాగు కోసం ఆసాముల నుంచి అప్పుతీసుకున్నా. ప్రస్తుతం అప్పులు చెల్లించాలని ఆసాములు ఒత్తిడి తెస్తున్నారు. ఇక్కడేమో ధాన్యం కొనుగోలు చేయడం లేదు. తమ పరిస్థితి ఎవరికి చెప్పుకోవాలో తెలియడం లేదు. ధాన్యం అమ్ముకోవడానికి కొనుగోలు కేంద్రాల వద్ద కాపలా ఉంటున్నాం. త్వర గా ధాన్యం కొనుగోలు చేస్తే వ్యవసాయ పనులు చేసుకోవడానికి అవకాశం ఉంటుంది. త్వరగా ధాన్యం కొ నుగోలు చేయాలి.
-ఈదన్న, రైతు, చెనుగోనిపల్లి