వనపర్తి, ఫిబ్రవరి 3 (నమస్తే తెలంగాణ) : జిల్లాలో వరి ధాన్యం కొనుగోళ్లు ముగిసి నా.. డబ్బులు రాకా అన్నదాతలు నానా అవస్థలు పడుతున్నారు. ధాన్యం విక్రయాల తర్వాత వెంటనే డబ్బులు జమ అవుతాయని చెప్పడమేకానీ, అమలు కావడం లేదు. దీంతో రోజు ల తరబడి రైతులు కంట్లో ఒత్తులు వేసుకుని డబ్బుల కోసం ఎదురుచూస్తున్నారు. జిల్లాలో రూ.2,24,093 టన్నుల ధాన్యాన్ని ఐకేపీ, పీఏసీసీఎస్, మెప్మా ద్వారా కొనుగోలు చేశా రు. రైతుల ఖాతాల్లో వేగంగా డబ్బులు జమ చేస్తామన్న ప్రభుత్వం అందుకు తగ్గ చర్యలు తీసుకోవడం లేదు.
సన్న వడ్లకు క్వింటాకు రూ.500 బోనస్ ప్రకటించిన ప్రభుత్వం వాటిని పంపిణీ చేయడంలో మీనమేషాలు లెక్కిస్తుంది. ఇప్పటి వరకు జిల్లాలో సుమారు 25వేల మంది రైతులు సన్న రకం వడ్లను ప్రభుత్వానికి విక్రయించారు. ఈ రైతుల నుంచి దాదాపు లక్షా 36,203 మెట్రిక్ టన్నుల సన్న వడ్లను కొనుగోలు చేశారు. అయితే, వీరిలో ఇంకా చాలామంది రైతులకు బోనస్ డబ్బులు రాలే దు. దాదాపు రూ.32కోట్లు బోనస్ అందుకోవాల్సిన రైతులున్నారు.
ప్రారంభంలో కొంత బోనస్ డబ్బులు ఇచ్చినట్లు చేసినా.. క్రమంగా ఆలస్యం చేస్తూ పెండింగ్ పెడుతూ వస్తున్నారు. 40రోజులకు పైబడి వరిధాన్యం అమ్ముకున్న రైతులు ఎప్పుడు బోనస్ పడుతుందంటూ అధికారుల చుట్టూ ప్రదక్షిణలు చేస్తున్నారు. జిల్లాలో 14వేల మంది రైతులు బోన స్ డబ్బుల కోసం ఎదురుచూస్తున్నట్లు లెక్కలు చెబుతున్నాయి. ప్రభుత్వం నుంచి ఉలు కు..పలుకు లేకపోవడంతో రైతులు నిరాశకు లోనవుతున్నారు. అధికారులను వాకబు చేసి నా సరైన సమాధానాలు రావడం లేదని రైతు లు బావురుమంటున్నారు.
వానకాలంలో వరి ధాన్యం అమ్ముకున్న రైతులు ఒక్కొక్కరు ఒక్కో కష్టాన్ని.. నష్టాన్ని ఎదుర్కొన్నారు. పదేండ్ల నుంచి వరిధాన్యం బీఆర్ఎస్ ప్రభుత్వమే కొనుగోలు చేసి సాఫీగా నడిపించింది. అయితే, ఈ ఏడాది పడినంత ఇబ్బంది ఎప్పుడు చూడలేదని రైతులు చెబుతున్నారు. ఆఖరికి కరోనా సమయంలో కూ డా ఇలాంటి పరిస్థితిని చూడలేదన్న అభిప్రా యం వ్యక్తం చేస్తున్నారు. విక్రయాలు చేయ డం ఆలస్యం చేశారు. తూకం వేసిన అనంతరం లారీలు లేవని వారం రోజులు బ్రేక్, మిల్లులకు తరలించిన తర్వాత ధాన్యం సరిగా లేదని మరో 10 రోజులు నిలిపివేశారు. చివరకు అన్ని అయినా డబ్బులు ఇవ్వడంలో నరకం చూశామని రైతులు లబోదిబోమంటున్నారు.
బోనస్‌తోపాటు అసలు డబ్బులను కూడా చివరి దశలో పెండింగ్ పెట్టి రైతులను ఇబ్బందులకు గురి చేశారు. దీనికి సంబంధించి తక్‌పట్టీలు రాకపోవడం.. మిల్లర్లు సహకరించకపోవడంతో రైతులకు వెంటనే అందాల్సిన డబ్బులు కూడా చేరలేదు. 20రోజుల కిందట ధాన్యం అమ్ముకున్న రైతులకు ఇప్పటి వరకు అసలు డబ్బులు పడలేదంటే అర్థమవుతుంది. ట్రక్ సీట్స్ త్వరగా ఇవ్వక పోవడం.. మిల్లర్స్ అకనాలెడ్జ్మెంట్ అందక పోవడం, ట్యాబ్ ఎంట్రీలు ఆలస్యం చేయడంలాంటి సమస్యలతో రైతులు ఇబ్బందులు పడ్డారు. బోనస్ డబ్బుల ఇబ్బందులతోపాటు నార్మల్‌గా ఇచ్చే డబ్బులు సైతం ఆలస్యంగా రైతుల ఖాతాల్లో వేయడంతో అనేక అవస్థలను ఎదుర్కొన్నారు.
జిల్లాలో 4లక్షల మెట్రిక్ టన్నుల వరి ధాన్యం లక్ష్యం పెట్టుకున్న జిల్లా పౌరసరఫరాల శాఖ అనుకున్న మేర లక్ష్యాన్ని అందుకోలేక పోయింది. ఇందుకోసం ప్రభుత్వం 263 కొ నుగోలు సెంటర్లను ఏర్పాటు చేసింది. సెంటర్ల ద్వారా సగం ధాన్యం కూడా కొనుగోళ్లు చేయలేకపోయారన్న విమర్శలు వెలువడుతున్నాయి. ప్రభుత్వ సెంటర్ల ద్వారా మొ త్తం 2లక్షల 24వేల మెట్రిక్ టన్నుల ధాన్యం మాత్రమే కొనుగోలు చేశారు. ప్రారంభంలో సెంటర్లు మొదలు కాక రైతులు తీవ్రంగా ఇబ్బందిపడ్డా రు.
మద్దతు ధరకు సమానంగా ప్రైవేట్‌లో కూడా వానకాలం సీజన్లో వ్యాపారులు కొ న్నారు. జిల్లాలోని రైస్ మిల్లులన్నీ డిఫాల్టర్‌గా ఉండడంతో ప్రారంభంలో ఒకరిద్దరికి మినహా అర్హత రాలేదు. దీంతో ప్రభుత్వానికి.. మిల్లర్లకు మధ్య పొసగక సెంటర్ల ప్రారంభం ఆలస్యమైంది. ఇలా ఇదే అదనులో ప్రైవేట్ వ్యాపారులు రంగంలోకి దిగి భారీగానే కొనుగోలు చేయడంతో ప్రభుత్వ కొనుగోళ్లు లక్ష్యంలో సగానికి పడిపోయాయి. ఇలా సగం ధాన్యం కొంటేనే సర్కారు డబ్బుల వ్యవహారం ఇలా ఉంది. మొత్తం కొనుగోళ్లు చేస్తే ఇంకెలా ఉంటుందోనన్న సందేహాలు వ్యక్తమయ్యాయి.
నేను సన్న వడ్లు అమ్ముకుని నెల రోజులైంది. ఇంతవరకు బోనస్ రాలేదు. వడ్లు కొన్న కేంద్రం వాళ్లను అడిగితే వస్తాయి.. మా చేతుల్లో ఏమీ లేదంటున్నరు. సర్కార్ వేసినప్పుడే డబ్బులు వస్తాయని చెబుతున్నారు. ఒక్క ఊళ్లోనే కొందరికి డబ్బులు రావడం.. మాలాంటి వాళ్లకు ఇంకా రాకపోవడానికి కారణం కూడా చెప్పడం లేదు. 65 క్విం టాళ్లు అమ్ముకున్న. బోనస్ వస్తే అప్పులైనా కట్టుకుందామంటే ఆలస్యమవుతూనే ఉంది.
ఇంకా ఎన్ని రోజులు ఎదురుచూడాలో తెలియడం లేదు. రైతులకు ఈ పరీక్షలు ఎందుకు పెడుతున్నట్లు తెలుస్తలేదు. ఏ పని చూసినా సగం..సగం. చెప్పేదెందుకు చేయకుండా ఉండేదెందుకు. ఇలా అవస్థలు పెట్టడం సరికాదు. రైతులను మోసం చేసినట్లే. ప్రభుత్వం చేస్తున్న పనికి అప్పుల వాళ్లకు చెప్పలేక మొఖం చాటేస్తున్నం. ఏదో ఒకటి చెప్పండి. మా గోస మేం పడతాం. – రాములు, రైతు, కేతేపల్లి, పాన్‌గల్ మండలం
గద్వాల అర్బన్, ఫిబ్రవరి 3 : రాష్ట్ర ప్ర భుత్వం సన్నరకం ధాన్యానికి బోనస్ చెల్లిస్తామని చెప్పడంతో జిల్లాలో పెద్ద మొత్తం లో రైతులు తమ ధన్యాన్ని కొనుగోలు సెం టర్లలో విక్రయించారు. జిల్లాలో దాదాపు కొనుగోలు సెంటర్ల నుంచి 70వేల క్విం టాళ్ల ధాన్యాన్ని సేకరించి మిల్లులకు సరఫ రా చేసింది. ఇందుకు సంబంధించిన ధా న్యం డబ్బులను ప్రభుత్వం నిర్ణయించిన మద్దతు ధర రూ.2,320ను ధాన్యం కొనుగోలు చేసిన వారంరోజుల వ్యవధిలో రైతు ల ఖాతాల్లో జమ చేశారు.
అనంతరం ఎన్నికల సమయం లో రైతులు పండించిన సన్నరకం వడ్లకు చెల్లిస్తామన్న రూ.500బోనస్ పైసల కోసం చుక్కలు చూపిస్తున్నారు. ధాన్యం వేసిన రెండు,మూడు రోజుల్లో అస లు డబ్బులు, బోనస్ పైసలు కూడా వెంట నే పడుతాయని అధికారులు రైతులకు చెప్పడంతో ధాన్యాన్ని కొనుగోలు సెంటర్లలోనే విక్రయించారు. ఇంతవరకు బాగానే ఉన్నా అసలు డబ్బులు పడ్డాయి.. కానీ బోనస్ పైసలే.. నేటికీ సక్రమంగా పడడం లేదని రైతులు ఆవేదన వ్యక్తం చేశారు.
దా దాపు ధాన్యం అమ్మి రెండు, మూడు నెల లు గడుస్తున్నా నేటికీ బోనస్ పైసలు వేయకపోవడం ఏంటని అధికారులను ప్రశ్నిస్తున్నట్లు సమాచారం. ఈ క్రమంలో అధికారుల లెక్కల ప్రకారం ఈ సంవత్సరం కొనుగోలు సెంటర్లకు ధాన్యం వేసిన మొత్తం రైతులకు రూ.33కోట్లు చెల్లించాల్సి ఉంది. ఇందులో ఇప్పటి వరకు రూ.13కోట్లు రైతు ల ఖాతా లో జమ అయినట్లు తెలిసింది. ఇంకా రూ. 20 కోట్ల బోనస్ డబ్బులు రైతు ల ఖాతాలో జమ కాలేదు. బోనస్ పడకపోవడంతో రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నా రు. బయట మార్కెట్లో రూ. 2,800 ధరలు పలికాయని, బయట మార్కెట్లో ఇప్పటికే డబ్బులు వచ్చేవంటున్నారు.