భూత్పూర్, మార్చి 27: మండలంలో ఇటీవల కురిసిన గాలి, పడగండ్ల వానకు వరి పంట తీవ్రంగా నష్టపోయి రైతులు ఆందోళనలో ఉన్నారు. ప్రభుత్వం రైతులకు సరైన విద్యుత్తు సరఫరా చేయకున్నా, భూగర్భ జలాలు అడుగంటిన రైతులు ఎంతో కష్టపడి పంటలను పండించుకుంటున్నారు. ప్రకృతి రైతుల పట్ల కన్నెర్ర చూసి నోటికాడికి వచ్చే సమయంలో వడగండ్ల వాన రావడంతో మండల వ్యాప్తంగా దాదాపు 2000 ఎకరాలలో పంట నష్టం జరిగింది.
మండలంలోని మద్దిగట్ల గ్రామంలో నరసింహారెడ్డి సాగుచేసిన 13 ఎకరాల వరి పంట తీవ్రంగా నష్టపోయింది. ఆయన 4 లక్షల వరకు పెట్టుబడి పెట్టినట్లు తెలిపారు. ప్రభుత్వం వ్యవసాయ అధికారులతో క్షేత్రస్థాయిలో పంటలను పరిశీలించి నష్టపరిహారాన్ని పెద్ద మొత్తంలో ఇవ్వాలని రైతులు ఆశిస్తున్నారు. వ్యవసాయ అధికారులు పంటలను పరిశీలించడానికి కంటి తుడుపుగా పరిశీలించి రాసుకొని వెళ్లారు. ప్రకృతి వైపరీత్యాల కింద పంట నష్ట పరిహారాన్ని పరిగణించి రైతులకు ఇవ్వాలని రైతులు అధికారులను, ప్రభుత్వాన్ని కోరుతున్నారు. వరి ధాన్యం రాలిన తర్వాత పొలం వద్దకు పోవాలంటే మనసు ఒప్పుకోవడం లేదని రైతులు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. పంట చేతికి వచ్చే సమయంలో ఒక్కసారిగా నేలరాలిపోవడంతో రైతులకు ఆత్మహత్యలే శరణ్యంగా కనిపిస్తున్నట్లు పలువురు రైతులు అభిప్రాయాలను వ్యక్తం చేశారు.