మక్తల్, మే 10: యాసంగి సీజన్లో రైతులు పండించిన చివరిగింజ వరకు ప్రభుత్వమే కొనుగోలు చేస్తుందని గొప్పలు చెప్పుకుంటున్న కాంగ్రెస్ ప్రభుత్వం.. పంటకోసి 45రోజులుగా వడ్ల రాశులు కల్లాల్లో మగ్గుతున్నా.. మక్తల్ మండలం ముష్టిపల్లి ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘం సిబ్బంది ధాన్యం కొనుగోలు చేయక రైతులు నానా అవస్థలు పడుతున్నారు. కొనుగోలు కేంద్రాలకు ధాన్యం తీసుకొస్తే క్వింటాకు రూ.2,320తోపాటు రూ.500 బోనస్ ఇస్తుందని అధికారులు గొప్పలు చెప్పుకుంటున్నారు తప్పా..
సరైన సమయంలో వడ్లను కొనుగోలు చేసి రైతులకు ఇబ్బందుల్లేకుండా చేయడంలో పూర్తిగా విఫలమైందని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. మక్తల్ మండలం ముష్టిపల్లిలో 15రోజుల కిందట మహిళా సమాఖ్య ద్వారా కొనుగోలు కేంద్రాన్ని ప్రారంభించగా.. గ్రామంలోని కాంగ్రెస్ పార్టీ నాయకులు తమ పార్టీకి చెందిన వారిని కా కుండా బీఆర్ఎస్ నాయకులతో కొబ్బరికాయ ఏ వి ధంగా కొట్టిస్తారనే నేపంతో ఎమ్మెల్యే వాకిటి శ్రీహరికి దృష్టికి తీసుకెళ్లి ముష్టిపల్లిలో కొనుగోలు కేంద్రాన్ని మూసివేయించారు.
అయితే ముష్టిపల్లిలో భారీగా యాసంగిలో ధాన్యం రావడంతో కొనుగోలు కేంద్రం ఎత్తివేయడంతో ఇబ్బందులు తలెత్తుతున్నాయని రైతులు కలెక్టర్ దృష్టికి తీసుకెళ్లారు. రైతుల విన్నపాలను విన్న కలెక్టర్ పీఏసీసీఎస్ ఆధ్వర్యంలో గ్రామంలో కొనుగోలు కేంద్రాన్ని ఏర్పాటు చేయాలని ఆదేశాలు జారీ చేయగా.. పీఏసీసీఎస్ అధికారులు ముష్టిపల్లిలో కొనుగోలు కేంద్రాన్ని ప్రారంభించారు. కానీ నేటివరకు రైతుల నుంచి ఒకగింజ కూడా కొనుగోలు చేయలేదని రైతులు వాపోతున్నారు.
పంట కోసి 45రోజులైనప్పటికీ కనీసం పీఏసీసీఎస్ అధికారులు రైతుల వరికల్లాలవైపు కన్నెత్తి చూడలేదంటే అతిశయోక్తి లేదు. వాతావరణంలో వచ్చే మార్పులతో వర్షానికి వడ్లు తడిసి ముద్దవుతాయని భయాందోళనకు గురికావాల్సిన పరిస్థితి తలెత్తిందని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. పలుమార్లు ఖాళీ సంచుల కోసం కార్యాలయం చుట్టూ తిరిగి విసిగి వేసారారు. ధాన్యాన్ని తరలించేందుకు గ్రామానికి లారీలు పంపించాలని రోజూ కార్యాలయం చుట్టూ తిరిగినా ఫలితంలేకుండా పోయిందని తమ గోడును వెల్లబోస్తున్నారు.
పీఏసీసీఎస్ అధికారుల నిర్లక్ష్య వైఖరితో రోజులు గడుస్తున్నాయి తప్పా.. కల్లాల్లో ధాన్యం తీ సుకెళ్లేందుకు ఆలస్యం అవుతుందని గ్రహించిన ముష్టిపల్లికి చెందిన రైతు రాఘవేందర్‌రెడ్డి పీఏసీసీఎస్ అధికారులకు సమాచారం ఇచ్చి జోగుళాంబ గద్వాల జిల్లా నుంచి సొంతఖర్చుతో మూడు లారీలను తెప్పించి దాదాపు 1500 సం చుల వడ్లను శనివారం జోగుళాంబ గద్వాల జిల్లాలోని శివశక్తి ఇండస్ట్రీస్ రైస్‌మిల్లుకు తీసుకెళ్లా రు. గ్రామంలో ఇంకా వేలకుపైగా సంచుల ధాన్యం కల్లా ల్లో ఉన్నప్పటికీ కొనుగోలు చేసి తరలించడంలో అధికారులు పూర్తిస్థాయిలో నిర్లక్ష్యం వహించడంతో తీవ్ర ఇబ్బందులు ఎదురోవాల్సిన పరిస్థితులు తలెత్తుతున్నాయని రైతులు వాపోతున్నారు.
పడిగాపులతో విసుగుచెందా..
45 రోజులుగా ఎదురు చూపులు
యాసంగిలో పండించిన వడ్లను ప్రభుత్వం ఏర్పాటు చేసిన కొనుగోలు కేంద్రంలో అమ్ముకునేందుకు ఎన్నో ఇబ్బందులు ఎదురోవాల్సి వచ్చింది. పంటకోసి 40రోజులవుతున్నా పీఏసీసీఎస్ అధికారులు ధాన్యాన్ని కొనుగోలు చేసి, తరలించకపోవడంతో వర్షానికి తడుస్తుందనే భయంతో గద్వాల నుంచి మూడు లారీలు అద్దెకు తీసుకొచ్చి అధికారుల సూచన మేరకు తరలించాం. గతంలో ఎన్నడూ ఈ విధంగా కొనుగోలు కేంద్రాలకు ధాన్యాన్ని అమ్మినప్పుడు ఇన్ని ఇబ్బందులు ఎదురోలేదు. ప్రస్తుత యాసంగి సీజన్లో పంట కోసినప్పటి నుంచి నేటివరకు నానా యాతన పడ్డాం. సొంత ఖర్చులతో కొనుగోలు కేంద్రానికి ధాన్యం అప్పజెప్పి, దగ్గరుండి తరలించాల్సిన పరిస్థితి తలెత్తింది.
– రాఘవేందర్ రెడ్డి, రైతు, ముష్టిపల్లి