మక్తల్ టౌన్, జూలై 20 : ఆహారధాన్యాల ఉత్పత్తితో స్వయం సమృద్ధి సాధించినప్పటికీ విచక్షణా రహితంగా రసాయన ఎరువుల వాడకంతో భూసారం తగ్గుతున్నది. దీంతో నేల భౌతిక లక్షణాలు దెబ్బతిని, నీటిని నిల్వ చేసే గుణాన్ని క్రమంగా కోల్పోతున్నది. సూక్ష్మపోషకాలు తగ్గడం వల్ల భూమిలో ఉత్పాదకత తగ్గి, సాగుకు ఖర్చు పెరుగుతున్నది. ఈక్రమంలో నేల సహజతత్వాన్ని కాపాడుతూ, అధిక దిగుబడులు సాధించేందుకు పచ్చిరొట్ట ఎరువు ఎంతో మేలు చేస్తున్నది. వరి సాగు చేస్తున్న రైతులందరూ రెండు నెలల ముందే మడిలో పచ్చిరొట్ట విత్తనాలను చల్లి, అవి పెరిగాక, అదే పొలంలో కలియ దున్నాలి. జీలుగ, జనుము, పిల్లిపెసర, అలిసంద, పెసర, పచ్చిరొట్ట ఎరువులుగా ఉపయోగ పడుతాయి. పచ్చిరొట్ట ఆకులను బయట నుంచి సేకరించి, పొలంలో కలియ దున్ని, బాగా కుళ్లనివ్వాలి. ఆ తరువాత సాగు చేయాలి. వేప, గలేరైసిడియా, జిల్లేడు, కానుగ, నేలతంగేడు చెట్లను పొలం గట్లు, బావుల వద్ద నాటితే ఒక్కో చెట్టు ఏడాదిలో రెండుసార్లు, 100 నుంచి 120 కిలోల పచ్చిరొట్టనిస్తాయి.
లక్షణాలు..
త్వరగా ఎదిగి ఎక్కువ ఆకులు, పచ్చికాండాన్ని ఇవ్వగలిగే సామర్థ్యాన్ని కలిగి ఉండాలి. మొక్క భాగాలు మృదువుగా, పెళుసుగా, రసపూరితంగా ఉండి, త్వరగా కుళ్లే స్వభావం ఉండాలి. అన్ని రకాల నేలలు, వాతావరణ పరిస్థితులు, నీటి ఎద్దడిని, తట్టుకునే శక్తిని కలిగి, పప్పు జాతికి చెందిన మొక్కలై ఉండాలి. విత్తనం రైతులకు మార్కెట్లో తక్కువ ధరకు లభ్యమయ్యేదిగా చూసుకోవాలి. పచ్చిరొట్ట పంటలు విత్తే సమయంలో జాగ్రత్తలు పాటిస్తూ మే, జూన్ లేదా తొలకరి వర్షాలు మొదలైనప్పుడు పొలంలో విత్తనాలు చల్లాలి. సాధారణ దిగుబడి రావడానికి 45 రోజుల సమయం పడుతుంది. పూతదశలో కలియ దున్నడం వలన భూమికి ఎక్కువ సత్తువ చేకూరుతుంది. రోటోవేటర్, పవర్ టిల్లర్ సహాయంతో పచ్చరొట్టను కలియ దున్నుకోవచ్చు. నత్రజని వృథా కాకుండా ఉండటానికి, కనీసం 15 నుంచి 22 సెం.మీ.ల లోతులో కలియదున్నాలి. మురుగునీరు బయటకు పోయే సౌకర్యంలేని పొలాల్లో పచ్చిరొట్ట కుళ్లుతున్నపుడు, మధ్యలో తయారయ్యే కొన్ని వాయువులు, అప్పుడే నాటిన వరి మొక్కలకు హాని కలిగిస్తాయి. పచ్చిరొట్టను కలియదున్నిన రెండు వారాల తరువాతే నాట్లు వేయాలి.
పచ్చిరొట్టతో ప్రయోజనాలు..
పచ్చరొట్ట పైరు నేలలో కుళ్లే సమయంలో జరిగే రసాయన ప్రక్రియల వల్ల భూమిలోని పోషక పదార్థాలు మొక్కలకు సులభంగా లభ్యమవుతాయి. పచ్చిరొట్ట పైరు సాగుతో నేల భౌతిక లక్షణాలు వృద్ధిచెందడమే కాకుండా నత్రజని ఎరువుల వాడకాన్ని, 25 నుంచి 35 శాతం వరకు తగ్గించుకోవచ్చు. నేల నీటినిల్వ సామర్థ్యం వృద్ధిచెంది నేలకోతను అరికడుతుంది. పచ్చరొట్ట ఎరువులు నేలలో మేలు చేసే సూక్ష్మజీవులను వృద్ధి చేస్తూ మొక్కలకు రోగనిరోధక శక్తిని పెంపొందిస్తుంది. అదేవిధంగా నేల ద్వారా సంక్రమించే తెగుళ్లను సైతం అరికడుతుంది. భూమి గుళ్ల బారి, పంటమొక్కల వేర్లకు అవసరమయ్యే గాలి, నీరు పుష్కలంగా అందుతాయి. దీర్ఘకాలిక పంటలు, పండ్ల తోటల్లో పచ్చిరొట్ట పైరును సాగుచేసి పూతదశలో కలియదున్నడం వల్ల నేల సారవంతమవుతుంది. ముఖ్యంగా వరి వేసే ప్రాంతాల్లో, పచ్చరొట్ట పైరును సాగుచేయడం వల్ల బియ్యంలో విటమిన్లు, మాంసకృత్తుల శాతం పెరుగుతుందని వ్యవసాయాధికారులు చెబుతున్నారు. అదేవిధంగా వరి పంటలో 15 నుంచి 25 శాతం దిగుబడి పెరుగుతుందని రుజువైందన్నారు. రైతులు సరైన పచ్చిరొట్ట పైర్లను, మార్కెట్ లభ్యత, వాతావరణ పరిస్థితులకు అనుగుణంగా ఎంపిక చేసుకుని, సాగు చేయడం శ్రేయస్కరమని రైతులకు సూచిస్తున్నారు.
సాంధ్రత పెరుగుతుంది..
ప్రతి ఏడాది వరి సాగుకు ముందు ‘మే’లో ఆరెకరాల పొలంలో పచ్చరొట్ట విత్తనాలను చల్లుతా. జూలై చివరి వారంలో కలియ దున్ని, వరి సాగు చేస్తున్నా. పచ్చిరొట్టను ముందుగా సాగు చేయటం వల్ల వరి పంటకు సత్తువనిస్తుంది. రసాయనిక ఎరువుల వాడకం కూడా తగ్గుతుంది. పచ్చిరొట్టతో పంట దిగుబడి సైతం అనుకున్న స్థాయిలో వస్తుంది.
– బసిరెడ్డి, రైతు, మక్తల్
25వేల ఎకరాలకు మించి సాగు..
యాసంగి సీజన్లో వరి సాగు చేస్తున్న రైతులు జిల్లాలో 25వేల ఎకరాలకు పైగా పచ్చిరొట్ట పైరును సాగు చేశారు. ప్రభుత్వం రైతుకు 65శాతం రాయితీతో జీలుగ విత్తనాలను అందించింది. పంట సాగుకు ముందు పచ్చిరొట్ట విత్తి కలియ దున్నడం వల్ల రసాయనిక ఎరువుల వాడకాన్ని తగ్గించవచ్చు. భూమిలో సహజ సిద్ధమైన జీవ ఎరువుల వృద్ధి జరుగుతుంది. రైతులు పచ్చిరొట్టను కలియ దున్ని, వరి నాట్లు వేయడం వల్ల పంట దిగుబడి సైతం పెరుగుతుంది.
– జాన్ సుధాకర్, జిల్లా వ్యవసాయాధికారి, నారాయణపేట