శాంతినగర్: తీసుకున్న అప్పు ఈఎంఐ చెల్లించాలని ఫైనాన్స్ కంపెనీ యాజమాన్యం అడిగినందుకు రుణ గ్రహీత పెట్రోల్ పోసుకుని నిప్పంటించుకుని ఆత్మహత్యాయత్నానికి పాల్పడిన ఘటన జోగుళాంబ-గద్వాల్ జిల్లా వడ్డేపల్లి మండలంలో చోటు చేసుకున్నది. క్యాటూర్ వాసి నర్సింహ అనే వ్యక్తి ఫైవ్‌స్టార్ ఫైనాన్స్ కంపెనీకి తన ఇంటిని మార్టగేజ్ చేసి రెండేండ్ల క్రితం రూ.4 లక్షల రుణం తీసుకున్నాడని స్థానిక ఎస్ఐ నాగశేఖర్ రెడ్డి చెప్పారు. ప్రతి నెలా ఈఎంఐ చెల్లించినా.. రెండు నెలల ఈఎంఐ పెండింగ్ అయింది. ఆ పెండింగ్ ఈఎంఐ చెల్లించాలని ఫైనాన్స్ కంపెనీ ప్రతినిధులు అడిగారు. దీంతో సోమవారం శాంతినగర్‌లోని ఫైనాన్స్ కార్యాలయానికి వచ్చి మేనేజర్, సిబ్బందిని దుర్భాషలాడుతూ తన ఒంటిపై పెట్రోల్ పోసుకున్నాడు. ఫైనాన్స్ కంపెనీ సిబ్బంది అతడ్ని నివారించి పోలీస్ స్టేషన్లో సమాచారం ఇచ్చారు.
మంగళవారం ఫైవ్ స్టార్ ఫైనాన్స్ కంపెనీ మేనేజర్ సతీశ్, ఉద్యోగి శ్రీరాములు కంపెనీ పని మీద బయటకు వెళుతుండగా, మరో బైక్‌పై వారిని నర్సింహ వెంబడించాడు. సాయిబాబా దేవాలయం వద్ద వారిని అడ్డుకుని, వారి ముందే ఒంటిపై పెట్రోల్ పోసుకున్నాడు. అతడ్ని నిలువరించేందుకు ప్రయత్నించినా వినకుండా వెంట తెచ్చుకున్న అగ్గిపెట్టెతో నిప్పంటించుకున్నాడు. అంతటితో ఆగక ఫైనాన్స్ కంపెనీ మేనేజర్, ఉద్యోగిని పట్టుకునేందుకు దగ్గరకు రావడంతో వారు తప్పించుకుని పారిపోయారు. బాధితుడు ఒంటిపై గాయాలతో పక్కనే ఉన్న గడ్డిలో పొర్లాడుతూ కేకలు వేశారు. స్థానికులు పోలీసుల సాయంతో ఆయన్ను చికిత్స కోసం కర్నూల్ దవాఖానకు తరలించారు. ఎస్ఐ నాగశేఖర్ రెడ్డి కేసు నమోదు చేసుకున్నారు. ఏఎస్ఐ భాషా.. దవాఖానకు వెళ్లి బాధితుడి వాంగ్మూలం నమోదు చేశారు.