అచ్చంపేట, మార్చి 9 : దోమలపెంట ఎస్ఎల్బీసీ టన్నెల్లో జరిగిన ప్రమాద ఘటనలో చిక్కుకున్న ఎనిమిది మంది కార్మికుల్లో ఆదివారం ఒకరి మృతదేహం లభ్యమైంది. టన్నెల్ లోపల టీబీఎం మిషన్ ముందుభాగంలో జీరో పాయింట్ వద్ద డీ-2 ప్రదేశంలో టీబీఎం మిషన్ పక్కనే మట్టిలో కూరుకుపోయి పూర్తిగా కుళ్లిపోయి నుజ్జునుజ్జుగా మృతదేహం మారిందని అధికారులు చెబుతున్నారు. శనివారం రాత్రి షిప్టులో రెస్యూ ఆపరేషన్ కోసం టన్నెల్లోకి వెళ్లిన బృందం మృతదేహాన్ని గుర్తించారు.
మృతదేహం చేతికి ఉన్న గడియారం గుర్తుపట్టి రాబిన్ కంపెనీకి చెందిన టీబీఎం మిషన్ ఆపరేటర్ గురుప్రిత్సింగ్గా అధికారులు నిర్ధారించారు. సా యంత్రం టన్నెల్ నుంచి బయటకు తీసీన మృతదేహాన్ని అంబులెన్స్‌లోకి ఎక్కించారు. అక్కడి నుంచి అంబులెన్స్‌లో నేరుగా నాగర్‌కర్నూల్ దవాఖానకు తరలించారు. పోస్టుమార్గం అనంతరం గురుప్రీత్‌సింగ్ కుటుంబసభ్యులను పిలిపించి మృతదేహాన్ని గుర్తుపట్టి అప్పగించనున్నారు. కుటుంబ సభ్యులు గుర్తుపట్టకుండా అనుమానంగా ఉంటే ఫొరెన్సిక్ టెస్టుకు పంపించనున్నారు.
పోలీసుల పంచనామా ఇతర అనేక ఫార్మాల్టీలు పూర్తయితే సోమవారం కుటుంబ సభ్యులు ఒప్పుకుంటే మృతదేహన్ని పంజాబ్‌కు తరలించనున్నారు. గురుప్రీత్‌సింగ్ సొంత గ్రామానికి వెళ్లాలంటే ఇక్కడి నుంచి దాదాపు 3వేల కిలోమీటర్లు వరకు వెళ్లాల్సి ఉంటుంది. 12 సంస్థలకు చెందిన రెస్క్యూ బృందా లు 16రోజులుగా కష్టపడి గురుప్రిత్సింగ్ మృతదేహాన్ని బయటకు అతికష్టం మీద బయటకు తీశారు. అయితే టన్నెల్ లోపల టీబీయం మిషన్ ముందుభాగం నుంచి కొంత దూరం వరకు మృతదేహాలు కొట్టుకొచ్చినట్లు రెస్క్యూ బృందాలు తెలిపాయి. క్యాడవర్ డాగ్స్ గుర్తించిన డీ-2 ప్రదేశంలో శవం లభ్యంకావడంతో మిగిలిన మృతదేహాలు కూడా అక్కడే ఉండొచ్చని సహాయక చర్యలు చేపడుతున్నారు.
టన్నెల్లో ఒకరి మృతదేహం బయటపడడంతో అధికారులు రిస్యూ ఆపరేషన్ వేగవంతం చేశారు. రాష్ట్ర విపత్తు నిర్వహణ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి అరవింద్‌కుమార్ నేతృత్వంలో రక్షణ, సహాయక చర్యలు కొనసాగుతున్నాయి. రాష్ట్ర, కేంద్ర విపత్తు ని ర్వహణ సంస్థ లు, ఎన్జీఆర్ఐ, డాగ్స్వాడ్ అన్ని బృందా లు ప్రమాద సంఘటనలో జాడ తెలియకుండాపోయిన మిగిలిన కార్మికులు, ఇంజినీర్ల కోసం అహర్నిశలు అవిశ్రాం త కృషి చేస్తున్నాయి.
కలెక్టర్ బదావత్ సంతోష్, ఎస్పీ వైభవ్ గైక్వాడ్ రఘునాథ్, ఎస్ఎల్బీసీ టన్నెల్ నిర్మాణ సంస్థ జయప్రకాశ్ కంపెనీ ప్రతినిధి ప్రవీణ్‌సింగ్ టన్నెల్ వద్ద పరిస్థితులపై సమీక్షించారు. కేరళ నుంచి వచ్చిన బెల్జియం నెలోనాయిస్ జాతికి చెందిన రెండు డాగ్స్ మాయ, మర్చీలను టన్నెల్లోకి పం పించారు. కుక్కలతోపాటు 157మంది కార్మికులు, సాంకేతిక నిపుణులు రెస్క్యూ ఆపరేషన్‌కు వెళ్లాయి. ప్రమాద స్థలం వద్ద నీరు, బురదలను దాటుకొని ముందుకు వెళ్లేందుకు దుంగల ను సైతం ఏర్పాటు చేశారు.
జీరో పాయింట్ వద్ద 50మీటర్లు ప్రమాద ఘంటికలు కావడంతో అక్కడికి వెళ్లేందుకు రెస్యూ సిబ్బంది ప్రాణాలకే ముప్పు ఉందని భావిస్తున్నారు. అక్కడ పరిస్థితి బాగాలేదు. ఒకవేళ మృతదేహాలు ప్రమాదకర ప్రదేశాల్లో ఉండి ఉంటే అక్కడ మృతదేహాలు వెలికితీయడం సాధ్యం కాకపోవచ్చు. సింగరేణి సంస్థ జనరల్ మేనేజర్ బైద్య మాట్లాడుతూ టన్నెల్ లోపల కష్టపడి గురుప్రిత్సింగ్ మృతదేహాన్ని వెలికితీశామన్నారు. ఎన్డీఆర్ఎఫ్, రైల్యే, ఇతర బృందాల సహకారంతో ముందుకెళ్తున్నామని తెలిపారు. డాగ్స్ చూపించిన మరో ప్రదేశంలో తవ్వకా లు జరపడానికి ఇబ్బందిగా ఉందన్నారు. నీళ్లు భారీ గా ఊబికి వస్తుండడంతో డాగ్స్ గుర్తించేందుకు అ నుకూలించడం లేదన్నారు. మృతదేహం లభించిన ప్రదేశం నుంచి కొంతదూరం వర కు తవ్వకాలు జరుపుతున్నామన్నారు. మిగిలిన మృతదేహాలు కూడా లభిస్తాయని ,12గంటలు శ్రమించి టీబీఎం మిషన్ కట్ చేసి బాడీని బయటకు తీశామని అన్నారు.
ఎస్ఎల్బీసీ టన్నెల్ ప్రమాదంలో మృతి చెందిన టీబీఎం మిషన్ ఆపరేటర్ గురుప్రీత్సింగ్కు సింగరేణి రెస్యూ సిబ్బంది నివాళులర్పించారు. గురుప్రీత్‌సింగ్ మృతదేహం కనిపించినప్పటి నుంచి బయటకు తీసేందుకు దాదాపు 12గంటల పాటు శ్రమించి మృతదేహాన్ని బయటకు తీశారు. మృతదేహం బురద, టీబీఎం మిషన్ మధ్యలో చిక్కుకొని నుజ్జునుజ్జుగా మారడంతో తీయడానికి ఇబ్బంది పడ్డారు. మృతదేహం బయటకు తీసిన తర్వాత టన్నెల్‌లోనే ప్యాకింగ్ చేశారు. లోకోట్రైన్ ద్వారా బయటకు తీసుకొచ్చారు. మృతదేహాన్ని అంబులెన్స్‌లో ఎక్కించేటప్పుడు సింగరేణి కార్మికులు జోహర్ గురుప్రీత్‌సింగ్ అంటూ నినాదాలు చేస్తూ నివాళులర్పించారు.