హన్వాడ, నవంబర్ 19 : కొనుగోలు ప్రారంభించి 15 రోజులైనా వడ్లను ఎందుకు కొనడం లేదని అన్నదాతలు ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇప్పటికైనా స్పందించి వెంటనే కొనుగోళ్లు ప్రారంభించాలని డిమాండ్ చేశారు. మంగళవారం మండల కేంద్రంలోని రైతు సేవా సహకార సంఘం బ్యాంక్ ఆవరణలో ఏర్పాటు చేసిన ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని తాసీల్దార్ కిష్టానాయక్తోపాటు వ్యవసాయ శాఖ అధికారులు పరిశీలించేందుకు వచ్చా రు. దీంతో అక్కడున్న రైతులు ఒక్కసారిగా వారిని చుట్టుముట్టారు. కొనుగోళ్లల్లో ఎందు కు జాప్యం వహిస్తున్నారని నిలదీశారు.
వడ్ల తేమ శాతం 14 లేదా 16 శాతం వస్తేనే కొనుగోలు చేస్తామని అధికారులు చెప్పడంతో ఒక్కసారిగా రైతులు తిరగబడ్డారు. కష్టపడి పండిస్తే ఇట్ల చేస్తారా..? అంతశాతం వస్తే తాము తీవ్రంగా నష్టపోతామని, 17 శాతం వరకే కొనుగోలు చేయాలి.. లేకుంటే ఆందోళన తప్పదని హెచ్చరించారు. దీంతో తాసీల్దార్ కిష్టానాయక్ స్పందించి జిల్లా అధికారులకు ఫోన్ చేసి విషయం తెలిపారు. రైతులు నష్టపోకుండా 17 శాతం ఉన్నవాటిని కూడా కొనుగోలు చేయాలని ఆదేశాలు జారీ చేశా రు. దీంతో రైతులకు తూకం టోకెన్లు ఇవ్వడంతో శాంతించారు.