కొల్లాపూర్, ఏప్రిల్ 30 : ‘తెలుగుజాతికి వెలుగు నింపేందుకు నాడు పంట పొలాలను త్యాగం చేశారు. తరాల నుంచి వస్తున్న అస్థిత్వాన్ని సమాజహి తం కోసం వదులుకున్నారు. తోటి వారి భవిష్య త్ కోసం కట్టుబట్టలతో జ్ఞాపకాలను మూటకట్టుకొని కోటి ఆశలతో.. ప్రభుత్వ సూచనతో సర్వస్వాన్ని సోమశిల వాసులు త్యాగం చేశారు. మళ్లా నేడు కాంగ్రె స్ ప్రభుత్వ విధానాలతో గ్రామ భవిష్యత్ ప్రశ్నార్థకంలో పడింది. కేసీఆర్ ప్రభుత్వంలో టూరిజం అభివృద్ధితో ఇప్పుడిప్పుడే భవిష్యత్‌పై ఆశలు పెంచుకుంటున్న ఇక్కడి ప్రజలు రేవంత్ సర్కారు మీమాంసలో పడేసింది. నాటి సమైక్య పాలకులు సోమశిల ప్రజలను ముంచితే.. కాంగ్రెస్ పాలకులు నోటికాడి కూడును లా క్కునే పరిస్థితులు కనిపిస్తున్నాయి. దీంతో ప్ర స్తుతం ఎప్పుడు ఏం జరుగుతుందో? అన్న భయం స్థానికుల్లో నెలకొన్నది’.
శ్రీశైలం ప్రాజెక్టు నిర్మాణానికి పూర్వం సోమశిల గ్రామం పాడిపంటలతో నిత్యం ఆధ్మాతిక శోభతో కళకళలాడేది. తెలుగుజాతికి విద్యుత్ వెలుగులతోపాటు సాగు, తాగు నీరు అందించేందుకు చేపట్టిన ఈ ప్రాజెక్టు నిర్మాణానికి సోమశిల గ్రామా న్ని త్యాగం చేయాలని నాటి ప్రభుత్వం విజ్ఞప్తి చేయగానే మరుక్షణం ఆలోచించకుండా స్థానికులు ఒప్పుకొన్నారు. అయితే ముంపుకంటే ముందే ప్రస్తుతం సోమశిల ఉన్న చోటులో 70 ఎకరాలను సాగు చేసుకున్నట్లు గ్రామస్తులు తెలిపారు. భూములు త్యాగం చేసినా తమకు ప్రభుత్వ ఉద్యోగ అవకాశాలతోపాటు సాగు భూమి ఇస్తామని నాటి సమైక్య ప్రభుత్వాలు హామీ ఇచ్చి మోసం చేశావని గుర్తు చేసుకుంటున్నారు. ఎన్నో కష్టాలతో కాలం వెల్లదీస్తున్న తమ గ్రామానికి తెలంగాణ రాష్ట్రంలో గుర్తింపు రావడంతోపాటు నాటి టూరిజం శాఖ మంత్రి శ్రీనివాస్‌గౌడ్ సారథ్యంలో ఉపాధి లభించిందని స్థానికులు పేర్కొంటున్నారు. ఈ మధ్య కాలంలో కాంగ్రెస్ ప్రభుత్వ నిర్ణయాలతో గ్రామ భవిష్యత్ మళ్లీ ప్రశ్నార్థకంలో పడుతోందని ఆందోళన సోమశిల వాసులు వ్యక్తం చేస్తున్నారు.
శ్రీశైలం నీటి ముంపులో సర్వం కోల్పోయి.. నది ఒడ్డున బతుకు జీవుడా? అని వచ్చిన సోమశిల గ్రామస్తులకు నేడు మళ్లీ కష్టం వచ్చింది. టూరిజం అభివృద్ధితో సోమశిల గ్రామస్తులు కష్టాలు తీరినట్లు అని భావిస్తున్న తరణంలో కాంగ్రెస్ విధానాలతో కలవరపాటు మొదలైనట్లు స్థానికులు పేర్కొంటున్నారు. గ్రామంలోని 1800 జనాభా ప్రత్యక్షంగా, పరోక్షంగా టూరిజంపై ఆధారపడి జీవిస్తున్నాయి. ఉపాధి పుష్కలంగా ఉన్న తరుణంలో ఇటీవల సోమశిలలో హెలీప్యాడ్ శాశ్వత నిర్మాణం కోసం ఎకరా 8 గుంటల భూమి సేకరణతో వివాదం మొదలైంది. ఈ ఘటన చివరకు రైతులను అరెస్టు చేసే వరకు వెళ్లింది. అంతేకాదు బీఆర్ఎస్తో పాటు ఇతర పార్టీలు, ప్రజా సంఘాల ఆందోళనతో ఉద్రిక్త పరిస్థితులకు దారి తీసింది. ఈ పరిస్థితులలో సోమశిల మొత్తం ప్రభుత్వ భూమి పరిధిలోకి వస్తుందని, పరోక్షంగా గ్రామస్తులకు కూడా హక్కులు లేవని అధికారులు తెలిపినట్లు తెలిసింది. ఈ విషయంలో ప్రతిపక్ష పార్టీల ఆరోపణలతో సోమశిల వాసుల్లో ఆందోళన నెలకొన్నది. మళ్లీ గ్రామాన్ని ఖాళీ చేసే పరిస్థితి వస్తుందేమోనన్న జంకు మొదలైంది.
శ్రీశైలం నీటి ముంపు కంటే ముందు నుంచి అంటే దాదాపు 70 ఎకరాలలో ప్రస్తుత సోమశిలలో భూమిని సాగు చేసుకున్నట్లు స్థానికులు చెబుతున్నారు. గ్రామ నిర్మాణం చేసుకున్న తర్వాత గ్రామస్తులు దాదాపు 51 ఎకరాలను సాగు చేసుకున్నట్లు పేర్కొంటున్నారు. శ్రీశైలం నీటి ముంపు మొదలు మొన్నటి భారీ వరదల వరకు సోమశిల వాసులు అనేక సమస్యలతో ఇబ్బంది పడినట్లు గ్రామ పెద్దలు తెలిపారు. కేసీఆర్ ప్రభుత్వంలో చాలా సమస్యలకు పరిష్కారం దొరకడంతోపాటు జీవన స్థితి మెరుగైనట్లు తెలిపారు. బీఆర్ఎస్ ప్రభుత్వం కంటే ముందు గ్రామం 54, 80 సర్వే నెంబర్లలో ఉందని ఫారెస్టు, రెవెన్యూ అధికారులు ఇబ్బంది పెట్టినట్లు తెలిపారు. బీఆర్ఎస్ మాజీ ఎమ్మెల్యే బీరం హర్షవర్ధన్‌రెడ్డి, బీసీ కమిషన్ వైస్ చైర్మన్ ఆచారి సారథ్యంలో సోమశిల గ్రామస్తుల దీర్ఘకాలిక భూ వివాదానికి ఫుల్స్టాప్ పడింది. 54 సర్వే నెంబర్ నుంచి 117.18 ఎకరాల భూమికి పట్టాలు ఇచ్చేందుకు మార్గదర్శకాలను కూడా బీఆర్ఎస్ ప్రభుత్వం సిద్ధం చేసినట్లు రైతులు తెలిపారు. అయితే పట్టాలు వచ్చే సమయంలో ప్రభుత్వం మారి కాంగ్రెస్ అధికారంలోకి రావడంతో మళ్లీ సోమశిల గ్రామ భవిష్యత్ ప్రశ్నార్థకంగా మారిందని వాపోతున్నారు.
ఒకప్పుడు వేలలో కూడా ధర పలకని సోమశిల భూమికి బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో టూరిజం ఊతంతో భూముల ధరలకు రెక్కలు వచ్చాయి. ఎకరం భూమి రూ.కోట్లు పలకడంతో ఆర్థిక, ఆరోగ్య సమస్యలు ఉన్నవారు తమ అధీనంలో ఉన్న భూములను అమ్ముకున్నట్లు తెలుస్తోంది. ఇప్పటికే చాలా వరకు భూములు చేతులు మారాయని సమాచారం. ఇలాంటి తరుణంలో ప్రభుత్వ భూమిని ఎవరూ విక్రయించరాదు.. కొనుగోలు చేయరాదు.. అంటూ లీకులు ఇవ్వడంతో రూ.కోట్లు వెచ్చించి కొనుగోలు చేసిన కస్టమర్లు గుండెలు బాదుకుంటున్నారు. కొనుగోలు చేసిన వారిలో బిగ్ షాట్స్‌తోపాటు ఉపాధి, భవిష్యత్ కోసం తమ ఆస్తులను విక్రయించి సోమశిలలో స్థలాలను కొనుగోలు చేసిన వారు కూడా ఉన్నారు. కొనుగోలు చేసిన స్థలాలను ప్రభుత్వం ఎక్కడ స్వాధీనం చేసుకుంటోదనని ఆందోళనలో కొన్న వారు ఉంటే.. ప్రభుత్వం సోమశిల గ్రామాన్ని ఖాళీ చేయించే పరిస్థితిని తీసుకొని వస్తోందని స్థానికులు ఆందోళన చెందుతున్నారు.
ప్రభుత్వం చేపట్టిన హెలీప్యాడ్ నిర్మాణ ప్రదేశం సమీపంలోనే మా భూమి ఉన్నది. ఇక్కడ నిర్మాణంతో మా భూమిపై హక్కు కోల్పోయే స్థితి వస్తుందోమని భయంగా ఉన్నది. ఇప్పటికే శ్రీశైలం ప్రాజెక్టు కోసం సర్వం త్యాగం చేశాం. ఇప్పుడు పర్యాటక అభివృద్ధితో మా జీవన స్థితి మెరుగైంది. అభివృద్ధి పేరుతో మాకు ఉన్న కొంత భూమిని తీసుకుంటే మేం ఎలా బతకాలి? ప్రభుత్వం పునరాలోచన చేయాలి.
– రంగస్వామి, సోమశిల, నాగర్‌కర్నూల్ జిల్లా
తరాలుగా ఇబ్బంది పడుతున్నాం. పర్యాటక అభివృద్ధితో కొంత గ్రామానికి ఊపిరి వచ్చింది. ఇప్పుడు తప్పుడు నిర్ణయాలతో ఉన్న కాస్త ఊపిరి తీయొద్దు. కాంగ్రెస్ ప్రభుత్వ నిర్ణయాలతో గ్రామ భవిష్యత్ ప్రశ్నార్థంలోకి నెట్టేయబడుతోంది. ప్రభుత్వానికి చిత్తశుద్ధి ఉంటే 117.18 ఎకరాలకు పట్టాలు ఇవ్వాలి. ప్రభుత్వం ప్రతిసారి 54, 80 సర్వే నెంబర్ల పేరుతో గ్రామస్తులను భయపెట్టకుండా శాశ్వత పరిష్కారం చూపాలి.
– కేతూరి నారాయణ, మాజీ ఉప సర్పంచ్