పాలమూరు ప్రాజెక్టు వద్ద జల సంబురం నెలకొన్నది. నార్లాపూర్ వద్ద మొదటి లిఫ్ట్ నుంచి కృష్ణమ్మ ఉబికివచ్చింది. ఈనెల 16న సీఎం కేసీఆర్ వెట్న్‌న్రు ప్రారంభించగా.. బుధవారం మొదటి పంప్‌ను ఇరిగేషన్ ఇంజినీర్లు ఆన్ చేసి నీటి ఎత్తిపోతను షురూ చేశారు. దీంతో హెడ్ రెగ్యులేటరీ నుంచి టన్నెల్.. సర్జ్‌పూల్, పంప్‌హౌస్ మీదుగా బాహుబలికి మించిన మోటర్ల (145 మెగావాట్ల సామర్థ్యం) ద్వారా డెలివరీ సిస్టర్న్ నుంచి గంగమ్మ పరవళ్లు తొక్కుతూ రిజర్వాయర్‌లోకి చేరింది. 2 టీఎంసీల నీటిని నిల్వ ఉంచేలా చర్యలు తీసుకుంటున్నట్లు అధికారులు తెలిపారు. నీటి విడుదలతో అధికారులు ఆనందం వ్యక్తం చేస్తుండగా.. కర్షకులు హర్షం వ్యక్తం చేస్తున్నారు.
– కొల్లాపూర్ రూరల్, సెప్టెంబర్ 27
కొల్లాపూర్ రూరల్, సెప్టెంబర్ 27 : పాలమూరు ప్రాజెక్టు మొదటి లిఫ్ట్‌లోని మోటర్‌ను అధికారులు బుధవారం రన్ చేశారు. ఈనెల 16న పాలమూరు-రంగారెడ్డి ఎత్తిపోతల వద్ద వెట్న్‌న్రు ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రారంభించి ప్రాజెక్టును జాతికి అంకితం చేశారు. నాలుగు గంటలపాటు బాహుబలికి మించి 145 మెగావాట్ల సామర్థ్యం ఉన్న మోటర్తో నీటిని ఎత్తిపోశారు. దీంతో అంజనగిరి రిజర్వాయర్‌లో .02 టీఎంసీలు తరలించారు. తర్వాత నీటి తోడివేతను ఆఫ్ చేయగా.. తిరిగి సాయంత్రం 5 గంటలకు ఇరిగేషన్ అధికారులు ప్రారంభించారు. దీంతో కృష్ణమ్మ పరవళ్లు తొక్కుతూ డెలివరీ సిస్టర్న్ నుంచి ఉబికివచ్చింది.
శ్రీశైలం బ్యాక్ వాటర్ జీరో పాయింట్ నుంచి కాల్వ మీదుగా హెడ్‌రెగ్యులేటరీ.. ఇన్‌టేక్ వెల్.. టన్నెళ్ల మీదుగా జలాలు పరుగులు పెట్టాయి. అక్కడి నుంచి సర్జ్‌పూల్ మీదుగా పంప్‌హౌస్ నుంచి కృష్ణమ్మ పాలనురగలతో బయటికొచ్చింది. డెలివరీ సిస్టర్న్ జలాలతో నిండుగా కనిపించింది. అంజనగిరి రిజర్వాయర్ సామర్థ్యం 1/3 ప్రకారం 2 టీఎంసీల నీటిని నిల్వ చేయనున్నట్లు పీఆర్ఎల్ఐ ఈఈ శ్రీనివాస్‌రెడ్డి తెలిపారు. ఎన్నో అడ్డంకులను దాటుకొని ఈ ఎత్తిపోతల ప్రారంభం కావడంతో రైతులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. ప్రపంచంలోనే అతిపెద్ద మోటర్లతో రైతుల కోసం సాగు నీటిని లిఫ్ట్ చేయడం చరిత్రలో మైలురాయిగా మిగిలి ఉంటుందని హర్షం తెలిపారు. నల్లమల తీరంలో అందాలు ఓవైపు.. మరోవైపు కృష్ణా నీటి పంపింగ్ పర్యాటక కేంద్రాంగా మారనున్నది. సందర్శకులు, రైతుల సందర్శన తాకిడి పెరిగే అవకాశం ఉన్నది. ఇతర జిల్లాల నుంచి రైతులు స్వచ్ఛందంగా తరలివచ్చి పీఆర్ఎల్ఐ మొదటి లిఫ్ట్‌ను సందర్శిస్తున్నారు. అత్యాధునిక సాంకేతిక పరిజ్ఞానంతో నిర్మించిన ప్రాజెక్టు సాహో అంటున్నారు.