అచ్చంపేట, మార్చి 27: దోమలపెంట ఎస్ఎల్బీసీ టన్నెల్ ప్రమాదంలో మిగిలిన ఆరుగురి మృతదేహాల వెలికితీతకు రెస్క్యూ ఆపరేషన్ కొనసాగుతున్నది. క్యాడవర్ డాగ్స్ మృతదేహాల ఆచూకిని గుర్తించడానికి మరోసారి లోపలికి వెళ్లాయి. రెస్క్యూ ఆపరేషన్ 34 వ రోజుకు చేరుకున్నాయి. ఎస్ఎల్బీసీ టన్నెల్ ప్రమాదం నేపథ్యంలో సహాయక చర్యలను వేగవంతం చేసేందుకు రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేక అధికారి శివశంకర్ లోతేటిని నియమించింది. ఆయన ఇక్కడనే ఉంటూ సహాయక చర్యలను పర్యవేక్షిస్తున్నారు. గురువారం ఉదయం 10 గంటలకు ఆయన సహాయక బృందాల ఉన్నతాధికారులతో సమీక్ష నిర్వహించి పలు సూచనలు, సలహాలు అందజేశారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ 34 రోజులుగా కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల సహాయక బృందాలు నిరంతరాయంగా కృషి చేస్తున్నాయని, రోజుకు మూడు షిఫ్టులుగా 600 మంది సిబ్బంది సహాయక చర్యల్లో పాల్గొంటున్నారని వెల్లడించారు. సహాయక బృందాల మధ్య సమన్వయంతో టన్నెల్లో ఉన్న మట్టి, టీబీఎం భాగాలు, ఊట నీటిని తొలగిస్తూ సహాయ చర్యలు కొనసాగుతున్నాయని తెలిపారు. వెలువడిన వ్యర్థ పదార్థాలను లోకో ట్రైన్ ద్వారా తరలించడంతో పాటు, అధిక సామర్థ్యం గల పంపుల ద్వారా నీటిని బయటకు పంపిస్తున్నట్లు వివరించారు. సహాయక సిబ్బందికి అవసరమైన ఆహారం, వసతి, ఆరోగ్య సదుపాయాలపై నిరంతర పర్యవేక్షణ కొనసాగుతుందని పేర్కొన్నారు.
చిక్కుకున్న వారి ఆచూకీ తెలుసుకునేందుకు కేరళకు చెందిన ప్రత్యేక శిక్షణ పొందిన క్యాడవర్ డాగ్స్‌ను గురువారం ఉదయం 11 గంటలకు టన్నెల్లోకి పంపినట్లు శివశంకర్ వెల్లడించారు. ఈ సమీక్ష సమావేశంలో ఆర్మీ అధికారి వికాస్ సింగ్, మేజర్ డాక్టర్ విజయ్ కుమార్, సింగరేణి మైన్స్ రెస్క్యూ జనరల్ మేనేజర్ బైద్య, కల్వకుర్తి ఆర్డీవో శ్రీనివాసులు, ఎన్డీఆర్ఎఫ్ అసిస్టెంట్ కమాండెంట్ కిరణ్ కుమార్, ఎస్డీఆర్ఎఫ్ అధికారి గిరిధర్ రెడ్డి, దక్షిణ మధ్య రైల్వే అధికారి ఎన్.చంద్ర, హైడ్రా అధికారులు, జేపీ కంపెనీ ప్రతినిధులు, ర్యాట్ హోల్ మైనర్స్ ప్రతినిధి ఫిరోజ్ ఖురేషి, క్యాడవర్ డాగ్ ప్రతినిధి బృందం తదితరులు పాల్గొన్నారు.