గద్వాల, డిసెంబర్ 8 : జోగుళాంబ గద్వాల జిల్లాలో పాలన గతి తప్పింది.. ప్రజలను రక్షించాల్సి న పాలకులు, అధికారులు ఒక్కటయ్యారు.. అందినకాడికి దోచుకుతింటున్నారు.. ఇక్కడ పేరుకే జిల్లా అధికారులు, కానీ ఏ శాఖలో కూడా పాలనపై పట్టు లేదని తెలుస్తున్నది.. వారికి పాలనపై కంటే పైసలపైనే మక్కువ ఎక్కువ ఉన్నట్లు అర్థమవుతున్నది. ఏది అనుకుంటే అది నిమిషాల్లో జరిగిపోతుంది.. కాగా, సామాన్యుడికి ఏ శాఖలోనైనా సాయం అం దని ద్రాక్షగా మిగిలిపోయింది.
న్యాయం చేయాలం టూ సమస్యలపై వచ్చిన బాధితులు జిల్లా కార్యాలయాల చుట్ట్టూ కాళ్లరిగేలా తిరిగినా పరిష్కారం కా వడం లేదు.. అదే పైరవీకారులకు పైసలిస్తే పది ని మిషాల్లో పనిచేసి పెడుతున్నారు.. ఒకప్పుడు విద్వద్గద్వాలగా పేరుపొందగా.. ప్రస్తుతం పాలనలో గతి తప్పి అవినీతి గద్వాలగా మారిపోయింది.. ఏ శాఖలో చూసినా ఏమున్నది గర్వకారణం, అంతా అవినీతిమయం అన్న చందగా పాలన కొనసాగుతున్నది.. ఇది ఇలాగే కొనసాగితే ఇటు పాలకులు, అటు అధికారులు ప్రజల ఆగ్రహానికి గురైనా ఆశ్చర్యపోవాల్సిన అవసరం లేదు.. గతి తప్పిన గద్వాల పాలనపై జిల్లా బాస్‌లు ప్రత్యేక దృష్టి పెడితే తప్పా పాలన గాడిలో పడే అవకాశం లేదు.
వాస్తవంగా ఎవరైనా తప్పులు చేస్తే కోర్టు శిక్షిస్తుందనేది ప్రజల నమ్మకం. అయితే న్యాయం చేసే వారే తప్పు చేస్తే ఎవరు శిక్షిస్తారనేది ప్రశ్నగానే మిగులుతున్నది. అధికా రం చేతిలో ఉందని ప్రజాధనాన్ని పంచుకుతిన్నారు. ఈ విషయం అధికారులకు తెలిసినా ఏమీ పట్టన ట్లు వ్యవహరిస్తున్నారు. కోర్టు రికార్డులు తారుమారు చేసి రూ.3.08 కోట్లు కాజేశారు. ఈ ఘటన గద్వాల ప్రిన్సిపల్ సీనియర్ సివిల్ జడ్జి కోర్టులో చోటుచేసుకున్నది. కోర్టులో సీనియర్ సూపరింటెండెంట్‌గా విధులు నిర్వర్తిస్తున్న సత్యనారాయణ భూపరిహారానికి సంబంధించిన సొమ్ము కోర్టు రికార్డుల (లెడ్జర్ 37, 38, 39)ను తారుమారు చేసి వివిధ తేదీల్లో 2016-2021 మధ్య రూ.3,08,33,160ను అక్రమ మా ర్గంలో స్వాహా చేశారు. ఇలా డబ్బులు కొట్టేసే క్రమంలో కొంత డబ్బులను భార్య పేరట రికార్డులు సృష్టించి చెక్కులను తయారు చేసి డబ్బులు కాజేశారు.
ప్రభుత్వ శాఖల్లో ఉద్యోగాల పేరుతో నిరుద్యోగులను బురిడీ కొ ట్టిస్తున్నా.. ఇటు సంబంధిత శాఖ అధికారులు కానీ.. చట్టాన్ని రక్షించాల్సిన వారు గానీ ఏ విధమైన చర్యలు తీసుకోవడం లేదు. దీంతో నిరుద్యోగులను కొంతమంది ఉద్యోగాల పేరిట వలలో వేసుకుంటున్నారు. రెండు నెలల కిందట కలెక్టరేట్లో డేటా ఆపరేటర్ పోస్టులు ఇప్పిస్తానని చెప్పి నిరుద్యోగులను మోసం చేసిన ఘటన మరువకముందే తాజాగా మరో వ్యక్తి ఆరోగ్యశాఖలో ఉద్యోగాలు ఇప్పిస్తానంటూ నిరుద్యోగులను నిలువునా ముంచారు.
అయినా అతడిపై అధికారులు ఎలాంటి చర్యలు తీసుకోలేదు. జిల్లా ఆరోగ్యశాఖలో గద్వాల మండలానికి చెందిన వ్యక్తి ఆ శాఖలో కారు డ్రైవర్‌గా విధు లు నిర్వర్తించాడు. పల్లె దవాఖాన విభాగంలో సూపర్వైజర్ పోస్టులకు త్వరలో కాంట్రాక్ట్ పద్ధతిన అర్హులను ఎంపిక చేస్తారని, తనకు అధికారులతో ఏర్పడిన పరిచయాలతో ఉద్యోగాలిప్పిస్తానని చెప్పి కొందరితో డబ్బులు తీసుకున్నాడు. ఎంతకీ ఉద్యోగాలు ఇప్పించకపోవడంతో అతడిపై పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు.
కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన నాటి నుంచి గద్వాల రెవెన్యూ శాఖలో పైసలిస్తే ఫైల్ చకచక కదిలిపోతున్నాయనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. గతంలో గద్వాల రెవెన్యూ అధికారిగా పనిచేసిన వ్యక్తి ఎన్నికల సమయంలో వివిధ విభాగాలకు చెందిన వారికి బిల్లులు చెల్లించకుండా సుమారు రూ.30లక్షల మేర కాజేసినట్లు ప్రచారం జరుగుతున్నది. ఎన్నికల డబ్బులకు ఆడిట్ లేకపోవడంతో కలెక్టరేట్లోని ఓ ఉద్యోగితో కలిసి ఈ వ్యవహారం చక్కబెట్టినట్లు తెలిసింది. గద్వాల ఆర్డీవో కార్యాలయంలో ఓఆర్సీల దందా కొనసాగుతుందనేది బహిరంగ రహస్యం.
డిమాండ్ ను బట్టి రూ.10వేల నుంచి లక్ష వరకు వసూలు చేస్తున్నారనే ఆరోపణలు బలంగా వినిపిస్తున్నాయి. నాలుగు నెలల కాలంలో 800 ఎకరాలకు సంబంధించి 300కు పైగా ఓఆర్సీలు ఇచ్చారంటే ఇక్కడ దందా ఎలా కొనసాగుతుందో చెప్పవచ్చు. ఉదాహరణకు గద్వాల శివారు సర్వే నెంబర్ 879లో ఉన్న భూమిపై కోర్టు కేసు ఉంది. అ యితే దీనిని ఇక్కడి రెవెన్యూశాఖలో పనిచేసే అధికారి నాలా కన్వర్షన్ చేసి అనుమతులు ఇచ్చారని బాధితులు ఆరోపిస్తున్నారు.
కోర్టు లో ఉన్న భూమికి నాలా కన్వర్షన్ ఎలా చేశారని అడిగితే సమాధా నం చెప్పకుండా దాట వేస్తున్నారు. ఇటిక్యాల మండలం పెద్దదిన్నె లక్ష్మీ వేంకటేశ్వరస్వామి ఆలయానికి 541 ఎకరాల భూమి ఉం డ గా కొంత భాగానికి ఓఆర్సీ ఇచ్చారు. అలాగే నెట్టెంపాడ్ ప్రాజెక్టు కింద చిన్నోనిపల్లి ముంపు గ్రామం కాగా దాని పరిధిలో ఉన్న సు మారు 244ఎకరాల ప్రభుత్వ భూమిపై పరిహారం కాజేసేందుకు ఇక్కడి పాలకులు ప్రయత్నిస్తున్నారని గ్రామస్తులతోపాటు బీఆర్ఎస్ నేతలు ఆరోపణలు చేస్తున్నారు.
ఈ భూ వ్యవహారాలు చక్క బెట్టేందుకు ఇక్కడి పాలకులు తమకు అనుకూలమైనా ఓ అధికారికి ఇక్కడ పోస్టింగ్ ఇప్పించుకున్నట్లు బయట ప్రచారం జరగుతున్నది. ఫేక్ వీలునామాతో 11ఎకరాల 20గుంటలు ఇక్కడి రెవెన్యూ అధికారులు ఇతరుల పేర్లపై బదలాయించారు. గద్వాల మండల శివారులో సర్వే నెంబర్ 895.900లో 11 ఎకరాల 20 గుంటల పొలం ఉన్నది. ఈ సర్వేనెంబర్గుండా రింగ్‌రోడ్డు పోయింది. కొ న్నేండ్ల నుంచి ఈ సర్వే నెంబర్లు నన్నెసాబ్, మహ్మద్, సుభాన్ కబ్జాలో ఉన్నారు. ప్రస్తుతం దానిని వారు సాగు చేస్తున్నారు. ఫేక్ వీలునామా సృష్టించి మొత్తం పొలాన్ని కాజేశారని బాధితులు ఆరోపిస్తున్నారు. దీనికి సంబంధించి సివిల్ కోర్టులో కేసు పెండింగ్ లో ఉన్నప్పటికీ ఏకపక్షంగా ఆ గస్టులో ఇతరులకు ఈ భూమి ని బదలాయించారు.