పాలమూరు-రంగారెడ్డి ఎత్తిపోతల పనులు ఇక వడివడిగా జరగనున్నాయి. ప్రతిపక్ష నాయకులు అడుగడుగునా కోర్టు కేసులతో అడ్డు తగలడంతో పనులు మందకొడిగా కొనసాగుతూ వచ్చాయి. కాగా, పర్యావరణ అనుమతులు లేకుండా ప్రాజెక్టు నిర్మిస్తున్నారంటూ విపక్షాల నేతలు గ్రీన్‌ట్రిబ్యునల్‌ను ఆశ్రయించారు. దీంతో రాష్ట్ర ప్రభుత్వానికి జరిమానా విధిస్తూ ఆదేశాలు ఇవ్వగా.. సర్కారు సుప్రీం కోర్టును ఆశ్రయించింది. ఈ కేసుపై ఇటీవల ఊరట లభించింది. తాగునీటి కోసం ఏడు టీఎంసీలను వినియోగించుకోవచ్చని తీర్పునిచ్చింది. ఈ క్రమంలో పీఆర్ఎల్ఐకి కేంద్రం పర్యావరణ అనుమతులిస్తూ గురువారం ఉత్తర్వులు జారీ చేసింది. దీంతో మంత్రులు నిరంజన్‌రెడ్డి, శ్రీనివాస్‌గౌడ్, ఉమ్మడి జిల్లా ఎమ్మెల్యేలు హర్షం వ్యక్తం చేస్తున్నారు. పర్యావరణ అనుమతులు కూడా రావడంతో ‘పాలమూరు’ ప్రాజెక్టుకు ఇక అన్ని అడ్డంకులు తొలగాయి. దీంతో పనుల్లో మరింత వేగం పెరగనున్నది. కాగా నార్లాపూర్, ఏదుల, వట్టెం, రిజర్వాయర్ల వద్ద మోటర్లు, విద్యుత్ డ్రైరన్ నిర్వహించేందుకు అధికారులు కసరత్తు చేస్తున్నారు.
మహబూబ్‌నగర్, ఆగస్టు 10 ( నమస్తే తెలంగాణ ప్రతినిధి) : పాలమూరు ఎత్తిపోతలకు పర్యావరణ అనుమతులను కేంద్రం మంజూరు చేసింది. పర్యాటక అనుమతులు లేకుండా నిర్మిస్తున్నారని గ్రీన్ ట్రిబ్యునల్‌ను కొందరు ఆశ్రయించారు. దీంతో రాష్ట్ర ప్రభుత్వానికి భారీ జరిమానా విధిస్తూ గ్రీన్ ట్రిబ్యునల్ ఆదేశాలు ఇచ్చింది. దీనిపై తెలంగాణ సర్కారు సుప్రీం కోర్టును ఆశ్రయించింది. ఇటీవలే మనకు ఊరట లభించింది. మంచినీటి కోసం ఏడు టీఎంసీల నీటిని వాడుకునేందుకు… అందుకు తగ్గట్టు పనులు చేసుకోవచ్చని తీర్పునిచ్చింది. ఈ మేరకు ప్రభుత్వం ఆదేశాల మేరకు పనులు ముమ్మరంగా జరుగుతున్నాయి. ఈ నేపథ్యంలో కేంద్రం పర్యావరణ అనుమతులిస్తూ నిర్ణయం తీసుకున్నది. కేంద్ర అటవీ, పర్యావరణ శాఖ పనులకు గ్రీన్ సిగ్నల్ ఇస్తూ ఉత్తర్వులు జారీ చేసింది.
18 ప్యాకేజీల్లో పనులు
తెలంగాణ ప్రభుత్వం ఉమ్మడి మహబూబ్‌నగర్ జిల్లాతోపాటు రంగారెడ్డి జిల్లాలో 12.30 లక్షల ఎకరాలకు సాగు, తాగునీటిని అందించాలనే లక్ష్యంతో పాలమూరు-రంగారెడ్డి ఎత్తిపోతల పథకానికి (పీఆర్ఎల్ఐఎస్) రూ.35 వేల కోట్ల అంచనా వ్యయంతో 2015లో శ్రీకారం చుట్టింది. మొదటి దశలో తాగునీటికి సంబంధించిన పనులను, రెండో దశలో సాగునీటికి సంబంధించిన పనులను పూర్తి చేయాలని లక్ష్యంగా అడుగులు వేస్తున్నది. ఇప్పటికే మొదటి దశలో చేపట్టిన తాగునీటి సరఫరాకు సంబంధించిన పనులను నాగర్‌కర్నూల్ జిల్లా శ్రీశైలం బ్యాక్ వాటర్ నుంచి మొత్తం 21 ప్యాకేజీలుగా విభజించారు. కేపీ లక్ష్మీదేవిపల్లి మినహాయించి ప్రస్తుతం 18 ప్యాకేజీల పనులను ప్రభుత్వం చేపట్టింది. ఆ ఆయా ప్యాకేజీల పనులన్నీ దాదాపు తుదిదశకు చేరాయి. సీఎం కేసీఆర్ ఆదేశాల మేరకు నిర్దేశిత గడువులోగా మొదటి దశ పనులు పూర్తిచేసేందుకు అధికారులు శ్రమిస్తున్నారు. అప్రోచ్ చానళ్లు, పంప్‌హౌస్‌లు, సర్జ్‌పూల్స్, సొరంగాలు, రిజర్వాయర్లు, కాలువల నిర్మాణ పనులతోపాటు సబ్స్టేషన్ల నిర్మాణం చకచకా సాగుతున్నాయి.
శ్రీశైలం బ్యాక్ వాటర్‌తో
శ్రీశైలం ప్రాజెక్టు బ్యాక్ వాటర్‌ను 2 కిలోమీటర్ల అప్రోచ్ చానల్ ద్వారా తొలుత హెడ్ రెగ్యులేటర్‌కు, అక్కడి నుంచి 3 సొరంగాల ద్వారా నార్లాపూర్ సర్జ్పూల్కు తరలిస్తారు. అక్కడి నుంచి 8 పంపుల ద్వారా 104 మీటర్ల ఎత్తున ఉన్న అంజనగిరి రిజర్వాయర్‌లోకి ఎత్తిపోస్తారు. అక్కడి నుంచి ఓపెన్ కెనాల్, సొరంగ మార్గం ద్వారా ఏదుల పంప్‌హౌజ్ జలాలను తరలిస్తారు. అక్కడ 9 మోటార్ల ద్వారా 124 మీటర్ల ఎత్తున ఉన్న వీరాంజనేయ రిజర్వాయర్‌కు తరలిస్తారు. అక్కడి నుంచి ఓపెన్ సొరంగాలతో నీటిని వట్టెం పంప్‌హౌజ్‌కు తరలిస్తారు. అక్కడి నుంచి 9 మోటర్ల ద్వారా 121 మీటర్లపైకి వెంకటాద్రి రిజర్వాయర్‌లోకి జలాలను తరలిస్తారు. అటు నుంచి 14 కిలోమీటర్ల గ్రావిటీ కెనాల్ ద్వారా జలాలను కురుమూర్తి రిజర్వాయర్‌కు తీసుకెళ్తారు. కురుమూర్తి రిజర్వాయర్ నుంచి 8.5 కిలోమీటర్ల దూరం నిర్మించిన సొరంగాలతో జలాలను ఉదండాపూర్ సర్జ్పూల్కు తరలిస్తారు. అక్కడ 5 మోటర్లతో 122 మీటర్లపై జలాలను ఎత్తి ఉదండాపూర్ రిజర్వాయర్‌లోకి ప్రస్తుతానికి తరలిస్తారు.
బాహుబలిని మించిన మోటర్లు..
ప్రస్తుతం ప్రపంచంలోనే అత్యధిక సామర్థ్యం గల పంపులను కాళేశ్వరం ప్రాజెక్టులో వినియోగిస్తుండగా, ఆ రికార్డును పాలమూరు రంగారెడ్డి పథకం బద్ధలు కొట్టనున్నది. కాళేశ్వరం ప్రాజెక్టులో రామడుగు (గాయత్రి) పంప్‌హౌజ్‌లో 139 మెగావాట్ల కెపాసిటీ గల మోటర్లను వినియోగించడమే ఇప్పటివరకు అత్యధికం. వాటిని బాహుబలి మోటర్లుగా పిలుస్తున్నారు. పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్టులో అంతకు మించి ఏకంగా 145 మెగావాట్ల సామర్థ్యం గల మోటర్లను వినియోగిస్తుండటం విశేషం. నార్లాపూర్ నుంచి ఉద్దండాపూర్వరకు మొత్తంగా 34మోటర్లను బిగిస్తున్నారు. ఈ మోటర్లన్నింటినీ ప్రఖ్యాత ప్రభుత్వ రంగ సంస్థ బీహెచ్ఈఎల్ తయారుచేసింది. పంప్‌హౌజ్‌లకు విద్యుత్తును సరఫరా చేసేందుకు మూడు 400/11 కేవీ సబ్స్టేషన్లను నిర్మిస్తున్నారు. అందులో ఒకటి ఇప్పటికే పూర్తికాగా, మరో రెండు చోట్ల నిర్మాణ పనులు వేగం పుంజుకొన్నాయి.
సబ్స్టేషన్ల ట్రాన్స్మిషన్ చార్జ్ సక్సెస్
పాలమూరు-రంగారెడ్డి ఎత్తిపోతల పథకంలోని నార్ల్లాపూర్-వట్టెం సబ్స్టేషన్లకు విద్యుత్ ట్స్రాన్స్మిషన్ చార్జ్ ముగిసింది. ఏదుల నుంచి నార్ల్లాపూర్ వట్టెం పంపుహౌస్‌ల వద్ద విద్యుత్ అందించేందుకు నిర్వహించిన ట్రాన్స్మిషన్ చార్జ్ బుధవారం విజయవంతం చేశారు. ఇప్పటివరకు 166 కిలోమీటర్ల వరకు విద్యుత్ లైన్లు పూర్తికాగా, ఇందులో ఒక్కో విద్యుత్ సబ్‌స్టేషన్ 1,200 మెగావాట్ల సామర్థ్యం ఉండే కేంద్రాలను ఏర్పాటు చేశారు. 20 లేదా 25వ తేదీ మధ్య డ్రైరన్ నిర్వహించనున్నారు. ప్రాజెక్టుకు మూడు సబ్స్టేషన్ల లైన్లకు విద్యుత్ సరఫరా నిమిషం కూడా నిలిచిపోకుండా సర్వం సిద్ధం చేశారు. సీఎం కేసీఆర్ ఆదేశాల మేరకు పనులు శరవేంగా జరుగుతున్నాయి. అలాగే ఏదుల సబ్‌స్టేషన్‌ను జంక్షన్‌గా ఏర్పాటు చేసి మిగిలిన వాటికి విద్యుత్‌ను సరఫరా చేస్తున్నారు. ఏదుల సబ్‌స్టేషన్ నుంచి వెల్టూరుకు వరకు అదనంగా మరో విద్యుత్ లైన్‌ను పూర్తి చేసి కరెంటు అందించనున్నారు. పాలమూరు ప్రాజెక్టులో మొత్తం 3,600 మెగావాట్ల విద్యుత్ సబ్స్టేసన్ల లైన్లు, చార్జ్ విజయవంతమైంది.
మంత్రులు, ఎమ్మెల్యే హర్షం
పాలమూరు ఎత్తిపోతలకు కేంద్రం అనుమతులు ఇవ్వటంపై మంత్రులు శ్రీనివాస్‌గౌడ్, నిరంజన్‌రెడ్డి, జడ్చర్ల ఎమ్మెల్యే డాక్టర్ లక్ష్మారెడ్డి హర్షం వ్యక్తం చేశారు. ఎట్టకేలకు ఉమ్మడి జిల్లా ప్రజల చిరకాల వాంఛ నెరవేరిందని.. కల నెరవేరుస్తున్న సీఎం కేసీఆర్‌కు వారు కృతజ్ఞతలు తెలిపారు. పర్యావరణ అనుమతులు రావడంతో ఇక లిఫ్ట్ పనులకు అడ్డంకులన్నీ తీరినట్లే అన్నారు.
సీఎం కేసీఆర్ పట్టుబట్టి సాధించారు
పాలమూరు-రంగారెడ్డి ఎత్తిపోతల పథకానికి పర్యావరణ అనుమతులు రావడంతో ఇక్కడి ప్రజల చిరకాల స్వప్నం నెరవేరిందని జడ్చర్ల ఎమ్మెల్యే లక్ష్మారెడ్డి అన్నారు. గురువారం ‘నమస్తే తెలంగాణ ప్రతినిధి’తో ఆయన మాట్లాడారు. సీఎం కేసీఆర్ పట్టుబట్టి అనుమతులు సాధించారని అన్నారు. ప్రత్యేక రాష్ట్రం నీళ్లు, నిధుల కోసమే జరిగిందని… కేసీఆర్ చావు నోట్లో తలపెట్టడంతో ప్రత్యేక తెలంగాణ సాకారమైందన్నారు. పాలమూరు కరువు, వలసలను పోగ్గట్టాలనే ఉద్దేశంతో పాలమూరు ఎత్తిపోతల పథకానికి శ్రీకారం చుట్టారని తెలిపారు. కానీ ఉమ్మడి జిల్లాకు చెందిన కొందరు కాంగ్రెస్, బీజేపీ నేతలు కేసులు వేసి అడ్డుకున్నారని ధ్వజమెత్తారు. అయినా ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రాజెక్టు పనులు కంప్లీట్ చేస్తే ఎక్కడ తమ రాజకీయ భవిష్యత్ సమాధి అవుతుందోనన్న భయంతో ఇలాంటి పనులకు పాల్పడుతున్నారని చెప్పారు. తెలుగు రాష్ర్టాలు విడిపోయాక కేంద్రం, తెలంగాణపై వివక్ష ప్రదర్శించి కృష్ణా నదీ జలాల్లో వాటా తేల్చాలని నిలదీయడంతోపాటు సుప్రీం కోర్టు వరకు వెళ్లి అనుమతులు సాధించామన్నారు. ఎత్తిపోతలకు పర్యావరణ అనుమతులు మంజూరు చేయాలని వత్తిడి తెచ్చి సాధించామన్నారు. ఇక జెట్ స్పీడ్‌తో పనులు కంప్లీట్ చేసి పాలమూరును సస్యశ్యామలం చేస్తామని అన్నారు.
– డాక్టర్ లక్ష్మారెడ్డి , ఎమ్మెల్యే జడ్చర్ల