మక్తల్ : రాష్ట్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన బడ్జెట్ ( Budget ) అంకెల గారడి, తప్పుల తడకగా ఉందని మక్తల్ మాజీ ఎమ్మెల్యే చిట్టెం రామ్మోహన్ రెడ్డి ( Chittem Rammohan Reddy ) ఆరోపించారు. ప్రజా సంక్షేమం కంటే మంత్రుల సంక్షేమానికే అధిక ప్రాధాన్యత ఇచ్చారని ఆదివారం మక్తల్లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో విమర్శించారు.
బడ్జెట్ను చూస్తుంటే కాంగ్రెస్ ( Congress ) పార్టీకి ముడుపులు చెల్లించే విధంగా ఉందని పేర్కొన్నారు. పార్టీ మారిన ఎమ్మెల్యేల విషయంలో స్పీకర్ తప్పుడు నిర్ణయం తీసుకున్నారని ఆరోపించారు. వ్యవసాయ రుణమాఫీ ప్రస్తావన లేదని, రైతుబంధు , రైతు భరోసా ఎకరాకు 12 వేల రూపాయలు ఎక్కడికి పోయాయని ప్రశ్నించారు.
కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చినప్పటినుండి, ఇప్పటివరకు రెండు దఫాలుగా రైతులకు రైతు భరోసా నిధులను జమ చేయలేదని ఆరోపించారు. ముఖ్యమంత్రి నియోజకవర్గానికి తీసుకువెళ్తున్న కొడంగల్ నారాయణపేట ఎత్తిపోతల పథకానికి సీడబ్ల్యూసీ అనుమతులు ఉన్నాయా వెల్లడించాని మంత్రి ఉత్తమ్ కుమార్ను ప్రశ్నించారు.
కేవలం ముఖ్యమంత్రి కమిషన్ల కోసమే ప్రాజెక్టు పనులు ఆగమేఘాల మీద ప్రారంభించారని ఆరోపించారు. మక్తల్ నారాయణపేట రోడ్డు పనులు ఎప్పుడు ప్రారంభిస్తారని తెలిపారు. కేసీఆర్ ప్రభుత్వ హాయంలో రాష్ట్రవ్యాప్తంగా 101 గురుకులాల పాఠశాలలను ప్రారంభించి పేద, మధ్యతరగతి పిల్లలకు పౌష్టికాహారాన్ని అందిస్తే కాంగ్రెస్ ప్రభుత్వం విషపూరిత ఆహారాన్ని అందిస్తూ విద్యార్థుల జీవితాలతో చెలగాటమాడుతుందని ఆరోపించారు.
స్థానిక మంత్రి వాకిటి శ్రీహరికి నియోజకవర్గ అభివృద్ధికి ఏమాత్రం శ్రద్ధ చూపడం లేదన్నారు. అసెంబ్లీలో ప్రవేశపెట్టనున్న ప్రైవేట్ బిల్లుకు ప్రతిపక్ష పార్టీలన్నీ సహకరించాలని కోరారు. విలేకరుల సమావేశంలో పట్టణ అధ్యక్షులు చిన్న హనుమంతు, నాయకులు అన్వర్ హుస్సేన్, మన్నన్, జట్ల సాగర్, గవినోల నరసింహారెడ్డి, అమ్రేష్, అశోక్, ఈశ్వర్ యాదవ్, సుదర్శన్ గౌడ్, సాదిక్, వినోద్, అభి గౌడ్, అశోక్ గౌడ్, మారెప్ప, తదితరులు పాల్గొన్నారు.