మాగనూరు : కార్మిక విధానాలకు వ్యతిరేకంగా లేబర్ కోడ్లను తీసుకొచ్చిన కేంద్రానికి నిరసన తెలియజేస్తూ చేపట్టనున్న జాతీయ సమ్మెను విజయవంతం చేయాలని సీఐటీయూ( CITU ) జిల్లా ఉపాధ్యక్షులు పుంజనూర్ ఆంజనేయులు కోరారు. ఈనెల 20న దేశవ్యాప్తంగా నిర్వహిస్తున్న జాతీయ సమ్మె నోటీసును ఎంపీడీవోకు ( Strike Notice ) అందజేశారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ శతాబ్ద కాలంగా కార్మికవర్గం పోరాడి అనేక త్యాగాలు చేసి సాధించుకున్న 29 కార్మిక చట్టాలను రద్దుచేయడం దుర్మార్గమని అన్నారు. మరికొన్ని చట్టాలను రద్దు చేసి యజమానులకు అనుకూలంగా 4 లేబర్ కోడ్లను కేంద్ర ప్రభుత్వం తీసుకొస్తుందని ఆరోపించారు. కార్మిక కోడ్స్ అమలు జరిగితే కార్మిక సంఘాల ఏర్పాటు కష్టతరమవుతుందని వివరించారు. మండల కేంద్రంలో జరిగే నిరసన ప్రదర్శనలో గ్రామ పంచాయతీ కార్మికులు పాల్గొని విజయవంతం చేయాలని కోరారు.