గట్టు, ఆగస్టు 11 : ఇక నుంచి వ్యవసాయ రంగానికి 24గంటల విద్యుత్ సరఫరా అంటే మీరు పప్పులో కాలువేసినట్లే. విద్యుత్ శాఖాధికారులు వ్యవసాయానికి ప్రతి రోజూ 9 గంటలపాటు విద్యుత్ సరఫరా చేసి చేతులు దులుపుకొంటున్నారు. ఇక విషయానికొస్తే.. గత వారం, పది రోజులగా వ్యవసాయానికి ప్రతి రోజూ వ్యవసాయానికి 9 గంటలపాటు మాత్రమే విద్యుత్ సరఫరా అవుతోంది. దీంతో రైతులు ఇబ్బందులు పడుతున్నారు. పొలాలకు నీరు పారించుకోలేక తిప్పలు పడుతున్నారు. ఇదేం పరిస్థితి అని రైతులు వాపోతున్నారు. చాలిచాలని 9గంటల విద్యుత్ సరఫరాతో ఈ వానకాలంలో తాము ఎలా గట్టెక్కెదని వారు వాపోతుతున్నారు. విద్యుత్ సరఫరా ఇలాగే కొనసాగితే తమ పరిస్థితి ఏమిటని రైతులు ప్రశ్నిస్తున్నారు. వర్షాలు సమృద్ధిగా కురిసి ప్రాజ్టెక్లు నిండి జల విద్యుత్ ఉత్పత్తి నిరాటంకంగా కొనసాగే వరకు ఇదే పరిస్థితి కొనసాగవచ్చనే అభిప్రాయం వ్యక్తమవుతోంది. ఇదిలావుండగా 9గంటల విద్యుత్ సరఫరాతో తమకు ఇబ్బందులు తప్పవనే అభిప్రాయం రైతుల్లో వ్యక్తమవుతోంది.
ఇదిలావుండగా ఈ పరిస్థితిని విద్యుత్‌శాఖ అయిజ ఏడీఈ ఎన్ గోవింద్ వద్ద ప్రస్తావించగా వారం రోజులగా వ్యవసాయానికి తొమ్మిది గంటల పాటే విద్యుత్ సరఫరా చేస్తున్నది నిజమేనని ఒప్పుకున్నారు. భూగర్భ జలమట్టం పూర్తిగా తగ్గిపోవడంతో విద్యుత్ వినియోగం పూర్తిగా పెరిగిపోయిందన్నారు. దీనికితోడు ప్రాజెక్ట్‌లు పూర్తిస్థాయిలో నిండకపోవడంతో విద్యుత్ ఉత్పత్తి కూడా పడిపోవడంతో విద్యుత్ సరఫరాను కుదించాల్సి వచ్చిందన్నారు. తాజాగా విద్యుత్ వినియోగానికి సంబంధించి సోలార్ ప్రాజెక్ట్‌లపై ఆధారపడాల్సి వస్తోందన్నారు. ఈ పరిస్థితి వల్ల మధ్యాహ్నం వేళల్లో మాత్రమే తొమ్మిది గంటలపాటు విద్యుత్ సరఫరాను చేస్తున్నామన్నారు. ఉన్నతాధికారుల ఆదేశాల మేరకే తాము వ్యవసాయానికి 9 గంటలపాటు మాత్రమే విద్యుత్ సరఫరాను చేస్తున్నామన్నారు. దీంట్లో తాము చేసేది ఏమిలేదని ఏడీఈ గోవింద్ స్పష్టం చేశారు.