బండి సంజయ్ చేపట్టిన నిరుద్యోగ మార్చ్.. నిరుద్యోగులకు భరోసానివ్వడంలో విఫలమైంది. మూడ్రోజుల కిందట మహబూబ్‌నగర్‌లో నిర్వహించిన కార్యక్రమం జనం లేక బోసి పోయింది. టార్చ్ వేసి వెతికినా నిరుద్యోగులు కనిపించలేదు. ఇది తమ కోసం ఏర్పాటు చేసిన షో కాదని స్వయానా నిరుద్యోగులే ఛలోక్తులు విసిరారు. దీంతో బీజేపీ నాయకులు ఖంగుతిన్నారు. పేరుకే నిరుద్యోగుల జపమంటూ ఆర్భాటం చేసినా.. సభలో కేంద్రం గొప్పలు చెప్పడానికి.. రాష్ట్ర ప్రభుత్వంపై విమర్శలకే టైం సరిపోలేదు. ముఖ్యమైన నిరుద్యోగ అంశంపై స్పష్టతే ఇవ్వలేదు. మరోవైపు జన సమీకరణలో ఉమ్మడి జిల్లా ముఖ్య నేతల వైఫల్యం కొట్టొచ్చినట్లు కనిపించింది. డీకే అరుణ, జితేందర్‌రెడ్డి, ఆచారి మధ్య విభేదాలు పొడసూపాయి. వీరంతా ఫ్లెక్సీలపై వారి వారి ఫొటోల ఏర్పాటుపైనే దృష్టి సారించారు. అందుకే జన సమీకరణ గాలికొదిలారని సొంత పార్టీ శ్రేణులే విమర్శిస్తున్నారు. కాగా పార్టీ స్టేట్ చీఫ్ వస్తే ఇంత తక్కువ జనసమీకరణ చేస్తారా? అని జిల్లా శ్రేణులను రాష్ట్ర నేతలు క్లాస్ తీసుకున్నారట. ఏది ఏమైనా నిరుద్యోగ మార్చ్ పేరుతో మరోసారి ఆ పార్టీలో వర్గ విభేదాలు బట్టబయలయ్యాయి.
మహబూబ్‌నగర్, ఏప్రిల్ 27 (నమస్తే తెలంగాణ ప్రతినిధి) : మహబూబ్‌నగర్ జిల్లాలో బీజేపీ చేపట్టిన నిరుద్యోగ మార్చ్ అట్టర్‌ఫ్లాప్ కావడంతో కమలనాథులు ఖంగుతింటున్నారు. పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు ‘బండి’ చేపట్టిన మార్చ్‌కు టార్చ్‌లైట్ వేసి వెతికినా నిరుద్యోగులు కనిపించకపోవడం ఇందుకు నిదర్శనం. నిరుద్యోగుల సమస్యలపై పోరాటం అని ఆర్భాటంగా ప్రచారం చేసిన పార్టీ నేతలు సమస్యలను ప్రస్తావించకుండా కేంద్రం గొప్పలు చెప్పడానికి.. విమర్శలకే పరిమితమయ్యారు. కేంద్రంలో అధికారంలో ఉండి ఈ ఎన్నిమిదిన్నరేండ్లలో ఇచ్చిన ఉద్యోగాల ఊసే లేదు. ఎంతసేపూ విమర్శలకే పరిమితమై నిరుద్యోగులను గాలికి వదిలేశారు. బీజేపీ నేతల వ్యవహారం చూసిన నిరుద్యోగులు ఇది తమ కోసం చేసిన మార్చ్ కాదని అర్థమైపోయింది. నాలుగున్నరేండ్లుగా పదవులు లేక అల్లాడుతున్న పార్టీలు రాజకీయ నిరుద్యోగులుగా మారారని.. ఇది వాళ్ల కోసం వాళ్లు నిర్వహించుకున్న మార్చ్‌గా మారిందన్న విమర్శలు వస్తున్నాయి. నిరుద్యోగ మార్చ్ బదులు రాజకీయ నిరుద్యోగ మార్చ్ అని పెడితే బాగుండేదని సూచిస్తున్నారు.
మరోవైపు ఉమ్మడి జిల్లా నుంచి భారీగా నిరుద్యోగులను తరలించాలనుకున్నా.. చాలా తక్కువ మంది హాజరయ్యారు. జన సమీకరణలో జిల్లాకు చెందిన బీజేపీ నేతలు ఆచారి, డీకే అరుణ, జితేందర్‌రెడ్డి విఫలమయ్యారని ఆ పార్టీ నాయకులే విమర్శలు గుప్పిస్తున్నారు. బండి సంజయ్ ఎదుట ఆధిపత్య పోరు ప్రదర్శించారని కార్యకర్తలు మండిపడుతున్నారు. ఇక నియోజకవర్గాల్లోని నేతలు కూడా ఆయా లీడర్ల వర్గాలుగా విడిపోయారు. అందరూ కలిసి ఆందోళనను పక్కదారి పట్టించారని భగ్గుమంటున్నారు. ఆ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడే వస్తే ఇంత తక్కువ జనసమీకరణ చేస్తారా? అని జిల్లా నేతలను రాష్ట్ర నాయకులు క్లాస్ పీకారు. దీంతో నిరుద్యోగ మార్చ్ పార్టీలోని వర్గ విభేధాలను బయటపడేలా చేసింది. ఎన్నికలు సమీపిస్తున్న తరుణంలో నేతలు ‘ఎవరికి వారే యమునా తీరు’ అన్నట్లు వ్యవహరిస్తే ఇక పార్టీ గతి ఏంటని కార్యకర్తలు వాపోతున్నారు. ఉమ్మడి జిల్లాను గుప్పిట్లో పెట్టుకొని వర్గాలకు బీజం వేస్తున్న డీకే అరుణ, ఆచారి, జితేందర్రెడ్డిలపై రాష్ట్ర నేతలు ఆగ్రహం వ్యక్తం చేసినట్లు వినికిడి. నిరుద్యోగ మార్చ్‌కు కొంతమంది నేతలు తమకు అనుకూలమైన నేతల ఫొటోలు పెట్టి ఫ్లెక్సీలు వేయించుకున్నారు. వీటికి అయిన ఖర్చు నిరుద్యోగులకు అందిస్తే పేరన్న వచ్చేదని కార్యకర్తలే పెదవి విరుస్తున్నారు.
అందరూ జంప్ జిలానీలే..
ఉమ్మడి జిల్లాలో ప్రస్తుతం ఉన్న బీజేపీ నేతల్లో ఒక్కరిద్దరు మినహాయిస్తే అందరూ ఇతర పార్టీల నుంచి వచ్చిన వారే. అలాంటి వారినే గుర్తించి పదవులు ఇచ్చారని ఎప్ప టి నుంచో బీజేపీలో పాతుకుపోయిన నేతలు మండిపడుతున్నారు. మరోవైపు ఆయా నియోజకవర్గాల్లో గ్రూపుల ను ప్రోత్సహిస్తుండడంతో తమ పార్టీ కూడా అధికారం కో సం తపించే కాంగ్రెస్‌ను మించిపోయిందని నేతలు వ్యా ఖ్యానించారు. కల్వకుర్తికి చెందిన కేంద్ర బీసీ కమీషన్ సభ్యుడు తల్లోజు ఆచారి పాత కార్యకర్తలు, నాయకులను కలుపుకొని తన వర్గాన్ని పెంచుకుంటున్నారు. కాంగ్రెస్‌లో పదవులు అనుభవిం చి.. ఆ పా ర్టీకే సున్నం పెట్టి.. కేం ద్రంలో చ క్రం తిప్పాలన్న పగటి కలలతో బీజేపీలో చేరిన డీకే అరుణకు ఏకంగా జాతీయ ఉపాధ్యక్ష పదవి ఇచ్చారు. వచ్చీ రాగానే మహబూబ్‌నగర్ పార్లమెంట్ టికెట్ ఇచ్చినా.. బీఆర్ఎస్ అభ్యర్థి చేతిలో చిత్తుగా ఓడిపోయిం ది. బీజేపీలో తనకంటూ ఒక వర్గాన్ని పెంచి పోషిస్తుండడంతో పాత నేతలకు రుచించడం లేదు. ఇక బీఆర్ఎస్కు వెన్నుపోడవడానికి భారీ స్కెచ్‌వేసి అడ్డంగా దొరికిపోయిన జితేందర్‌రెడ్డి గత ఎన్నికల టైంలో బీజేపీలో చేరారు. ఇతడిని జాతీయ కార్యవర్గ సభ్యుడిగా చేసింది. డీకే అరుణకు దీటుగా తన వర్గాన్ని పెంచి పోషిస్తుండడంతో పార్టీ మూడుముక్కలైంది. ఈ ముగ్గురు నేతల వ్యవహార శైలితో నిరుద్యోగ మార్చ్ కాస్తా అధికారం కోసం చేసిన మార్చ్‌గా మారిందన్న విమర్శలు గుప్పుమంటున్నాయి.
2018 రిపీట్ అవుతుందనని ఆందోళన..
ఎన్నికలు సమీపిస్తున్న తరుణంలో కాంగ్రెస్ కాదు.. తా మే ప్రత్యామ్నయం అని చాటి చెప్పుకొనేందుకు చేపట్టిన నిరుద్యోగ మార్చ్ అట్టర్‌ఫ్లాప్ కావడంతో పార్టీ నేతలకు నిద్ర పట్టడం లేదు. ఇలా అయితే వచ్చే ఎన్నికల్లో తమ పరిస్థితి ఏంటని నేతలు లోలోపల మదనపడుతున్నారు. 2018 ఎన్నికల సీన్ రిపీట్ అవుతుందేమో అని నేతలు ఇప్పటినుంచే ఆందోళనలో ఉన్నారు. సింగిల్‌గా పోటీ చేసినా ఉమ్మడి జిల్లాలోని 12 నియోజకవర్గాల్లో ఆ పార్టీ ఏకంగా తొమ్మిది చోట్ల డిపాజిట్ కోల్పోయింది. ఆ స్థానాల్లో రెండు నుంచి మూడు వేల ఓట్లే రావడం గమనార్హం. ఉమ్మడి జి ల్లాలో ఇప్పటికిప్పుడు ఎన్నికలు జరిగి నా.. బీఆర్ఎస్ను ఢీకొనే సత్తా బీజేపీకి లేదని విశ్లేషకులు అంటున్నారు. వచ్చే ఎ న్నికల్లో బడా నేతలు వర్గాలుగా విడిపోవడంతో ఎవరికి టికెట్ ఇస్తారో తెలియక అయోమయానికి గురవుతున్నారు. డీకే అరుణ, ఆచారి, జితేందర్‌రెడ్డి తమ వర్గానికి ఎక్కువ సీట్లు వచ్చేలా ప్లాన్ వేస్తున్నారు. ఇప్పటినుంచే తమ వర్గం నేతలకు సపోర్టు ఇస్తున్నారు. దీంతో పా త బీజేపీ నేతలు పార్టీ కార్యక్రమాలకు దూరం అవుతున్నారు.
పెదవి విరుస్తున్న నేతలు..
బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడి మెప్పు పొందేందుకు స్థానిక నేతలు భారీగా ఫ్లెక్సీలు కట్టారు.మహబూబ్‌నగర్ జిల్లా కేంద్రంలో ఒక్క రోజు కార్యక్రమానికి రూ.లక్షల్లో ఖర్చుపెట్టినా.. ప్రోగ్రాం అట్టర్‌ఫ్లాప్ అయింది. రాష్ట్ర ప్రభుత్వం ఐదు నోటిఫికేషన్లు వేయడం.. వందలాది మంది ప్రిపేర్ అవుతున్న వేళ ఈ ఖర్చును ఉద్యోగార్థుల ప్రయోజనం కోసం వెచ్చించినా బాగుండేదని సెటైర్లు వేస్తున్నారు. నిరుద్యోగులకు, ఉద్యోగార్థులకు భరోసా ఇవ్వలేకపోయామని, ప్రోగ్రాం చేసి దండగ అయిందని పార్టీ నేతలే అనుకుంటున్నారు. ఎవరికి వారు జై కొట్టించుకోవడం తప్పా ప్రయోజనం లేదని పార్టీ కార్యకర్తలే పెదవి విరుస్తున్నారు.