మాగనూరు, మార్చి 08: మాగనూరు మండలం కోల్పూర్ గ్రామ సబ్ స్టేషన్ పరిధిలో అడవి సత్యారం, కోల్పూర్, మంది పల్లి, పుంజనూరు గ్రామాల పరిధిలో ఇష్టానుసారంగా గంటల తరబడి కరెంటు కోతలు విధిస్తున్నారని రైతులు ఆవేదన వ్యక్తం చేశారు. దీనికి తోడు లోఓల్టేజ్ సమస్యలు తీవ్రంగా ఉందని అడవి సత్యారం గ్రామ రైతులు ఆరోపిస్తున్నారు. వేసంగి వరి పంటలు పొట్ట దశకు వచ్చాయని మరో45 రోజుల వరకు సాగునీరు పెట్టాల్సి ఉందని తెలిపారు. కానీ ఈ సమయంలో కరెంటు సమస్యలతో వరి పంటలకు సాగు నీరు పెట్టలేక నానా అవస్థలు పడుతున్నామని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
కరెంటు కోతలకు గురి చేయడమే కాకుండా లో వోల్టేజ్ సమస్యలతో ఉన్న బోర్ మోటార్లు, చివరికి ట్రాన్స్ఫార్మర్లు కూడా కాలిపోయి స్థితికి చేరుకున్నాయని రైతులు వాపోతున్నారు. ట్రాన్స్ఫార్మర్లు, బోర్ మోటార్లు కాలిపోవడంతో వేసుకున్న వరి పొలాలు సాగునీరు లేక పూర్తిగా ఎండిపోయి నాశనమవుతున్నాయని అడవి సత్యార గ్రామ రైతులు తెలిపారు. వేసవి రాక ముందే కరువు కాటకం చూడాల్సిన పరిస్థితి నెలకొందని చెబుతున్నారు. విద్యుత్ శాఖ లైన్మెన్ విధుల పట్ల నిర్లక్ష్యంగా వ్యవహరించడంతోపాటు తమ సమస్యలను పట్టించుకోవడం లేదని విమర్శించారు. ట్రాన్స్ఫార్మర్ కాలిపోవడంతో ఫోన్ ద్వారా సంప్రదిస్తే అందుబాటులోకి రాకపోవడంతో కొంతమంది రైతులు కలిసి సొంతంగా ఒక ట్రాక్టర్లో ట్రాన్స్ఫార్మర్లు బిగించి, మరో ట్రాక్టర్లో కాలిపోయిన ట్రాన్స్ఫార్మర్ను మక్తల్‌కు రిపేర్‌కు పంపాల్సి వస్తుందని తెలిపారు. రైతులే అన్నింటికి పూనుకోవాల్సి వస్తుందని అడవి సత్యారం గ్రామ రైతులు చెబుతున్నారు.
అడవి సత్యార గ్రామ రైతు నరసింహ గౌడ్ ఐదు ఎకరాల్లో వరి నాటు వేశాడు. ఎండాకాలం రాకముందే బోర్లు పూర్తిగా ఇంకిపోవడంతో సాగునీరు లేక దాదాపు మూడు ఎకరాలకు పైనే పొలం పూర్తిగా ఎండిపోయింది. దీంతో పొలాన్ని మేకలు, పశువులకు మేతకు వదిలేసినట్లు తెలిపారు. ఇలా సాగునీరు లేక నాన్న అవస్థలు పడుతుంటే ఇంకోపక్క కరెంటు కోతలకు గురి చేస్తూ రైతులను విద్యుత్ సిబ్బంది నానా ఇబ్బందుల పాల్జేస్తున్నట్లు రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటికైనా విద్యుత్ సమస్య తలెత్తకుండా సంబంధిత అధికారులు చర్యలు చేపట్టాలని రైతులు కోరారు.