గద్వాల, ఆగస్టు 11 : రైతుల సంక్షేమాన్ని దృష్టిలో పెట్టుకొని తెలంగాణ తొలిముఖ్యమంత్రి కేసీఆర్ రైతు కుటుంబాలకు కోసం ప్రవేశపెట్టిన రైతు బీమా పథకం రైతుల దరి చేరకపోవడంతో రైతులు అవస్థలు పడుతున్నారు. భూమిని సాగు చేసే ప్రతి రైతుకు సెంటు భూమి ఉన్నా అతను ఏ కారణం చేతనైన మృతి చెందినా వారి కుటుంబం రోడ్డున పడకూడదనే మంచి ఆలోచనతో కేసీఆర్ రైతు బీమా పథకం ప్రవేశ పెడితే కొందరి వ్యవసాయవిస్తరణ అధికారుల నిర్లక్ష్యం కారణంగా రైతు మరణించిన రైతు బీమా రాకపోవడంతో ఆ కుటుంబం రోడ్డున పడాల్సిన పరిస్థితి నెలకొంది. తమకు రైతు బీమా ఇప్పించి ఆదుకోవాలని కోరుతూ సోమవారం భర్త పోయిన దుఃఖంలో ఉన్న ఓ మహిళ తన ముగ్గురు ఆడపిల్లలను వెంట తీసుకొని తమకు న్యా యం చేయాలంటూ కలెక్టర్ సంతోష్‌ను వేడుకుంది.
వివరాల్లోకి వెళితే అయి జ మండలం తూంకుంట గ్రామానికి చెందిన కుర్వ డోలు పరశు రాము డు(31) వ్యవసాయం చేస్తూ జీవనం కొనసాగిస్తున్నాడు. గత నెల 20వ తేదీన అనారోగ్య కారణాల రీత్యా ఆయన కర్నూల్ ప్రభుత్వ దవాఖానలో చికిత్స పొందుతూ మృతి చెందాడు. దహన సంస్కారాలు పూర్తైనా తర్వాత అయిజ మండల వ్యవసాయవిస్తరణ అధికారికి బీమా పొందడం కోసం సమాచారం అందించారు.
అయితే అధికారి విచారణ చేస్తామని చెప్పినట్లు బాధిత కుటుంబం చెప్పారు. కొన్ని రోజుల తర్వాత వ్యవసాయ విస్తరణ అధికారి, రైతు భార్య శారదమ్మకు మీ భర్తకు బీమా వర్తించదు అని చెప్పడంతో ఆ కుటుంబం షాక్‌కు గురయ్యారు. రైతు భార్య నా భర్త పట్టాదార్ పాస్‌బుక్ (T02050070216, ఖాతా నెంబర్ 357)నుంచి రైతు బంధు లబ్ధిపొందుతున్నట్లు చెప్పారు. రైతు బంధు కోసం బ్యాంక్‌ఖాతా ఇచ్చినప్పుడు, రైతు బీమాకు కూడా తన భర్త దరఖాస్తు చేశాడని ఆమె చెబుతున్నారు. అయితే వ్యవసాయ విస్తరణ అధికారి మాత్రం రైతు, రైతు బీమాకు దరఖాస్తు చేయలేదని చెబుతున్నాడని బాధిత కుటుంబం వాపోతుంది. ప్రస్తుతం ఉన్న వ్యవసాయ విస్తరణ అధికారి మీరు రైతు బీమాకు దరఖాస్తు చేయలేదు కాబట్టి రైతు బీమ రావడం లేదని చెబుతున్నట్లు కుటుంబ సభ్యులు వాపోయారు.
ఈ విషయం రైతు కుటుంబం జిల్లా వ్యవసాయశాఖ అధికారి దృష్టికి తీసుకెళ్లారు. వెబ్సైట్ చూసిన అధికారులు మీ భర్త ఇన్‌ఎలిజిబుల్‌గా నమోదు చేశామని ఎందుకంటే మీరు గ్రామంలో నివసించడం లేదని విస్తరణ అధికారి సమాచారం ఇచ్చారని అధికారులు చెబుతున్నారు. అయితే రైతు కుటుంబం మాత్రం మేము తూంకుంట గ్రామంలోనే ఉంటూ వ్యవసాయం చేస్తూ జీవిస్తున్నామని వారు అంటున్నారు. అధికారులు తమ తప్పును కప్పి పుచ్చుకోవడానికి తప్పుడు సమాచారం నమోదు చేసి మా కుటుంబానికి ప్రభు త్వం ప్రవేశ పెట్టిన రైతు బీమా కోల్పోయేలా చేశారని ఆవేదన చెందుతున్నా రు. తమకు రైతు బీమా రాకుండా నిర్లక్ష్యం వహించిన అధికారులపై చర్యలు తీసుకోవాలని రైతు భార్య శారదమ్మ కలెక్టర్‌కు వినతి పత్రం అందజేసింది.