మహబూబ్నగర్ కలెక్టరేట్/గద్వాల టౌన్, మే 4 : వైద్యవిద్యలో ఎంబీబీఎస్, బీడీఎస్ ప్రవేశాలకు దేశవ్యాప్తంగా ప్రతిష్టాత్మకంగా నిర్వహించే జాతీయ అర్హత ప్రవేశ పరీక్ష (నీట్ యూజీ-2025) ఆదివారం మహబూబ్నగర్ జిల్లాలో ప్రశాంతంగా ముగిసింది. జిల్లాలో 13 పరీక్షా కేంద్రాలను ఏర్పాటు చేశారు. నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ ఆధ్వర్యంలో మధ్యాహ్నం 2నుంచి సాయంత్రం 5:20గంటల వరకు పరీక్ష నిర్వహించారు. 4,454 మంది విద్యార్థులు హాజరు కావాల్సి ఉండగా, 4,338 మంది పరీక్ష రాశారు. 97.39శాతం హాజరు నమోదైందని నీట్ కోఆర్డినేటర్ సురేందర్ తెలిపారు. బయోమెట్రిక్ హాజరు నేపథ్యంలో పరీక్షకు ఉదయం 11గంటల నుంచే హాలులోకి విద్యార్థులను తనిఖీ చేసి అనుమతించారు.
ఎలక్ట్రానిక్ వస్తువులు, చేతిగడియారాలు, సెల్ఫోన్లు, ఆభరణాలు, బూట్లు అనుమతించలేదు. దూర ప్రాతాల నుంచి వచ్చే అభ్యర్థులు ఆలస్యంగా రావడం, కేంద్రాల చిరునామాలు దొరకకపోవడంతో చివరి నిమిషం వరకు ఉరుకులు, పరుగులు పెట్టారు.
మహబూబ్నగర్ కలెక్టర్ విజయేందిరబోయి ఆదివారం జిల్లా కేంద్రంలోని ఏనుగొండలోని పీఎం శ్రీకేంద్రీయ విద్యాలయం, ఎన్టీఆర్ ప్రభుత్వ మ హిళా డిగ్రీ కళాశాల, హన్వాడలోని బీసీ గురుకుల విద్యాలయం, జడ్చర్లలోని బీఆర్ఆర్ డిగ్రీ కళాశాల, క్రిస్టియన్పల్లిలోని ఎంవీఎస్ డిగ్రీ కళాశాల, ప్రభుత్వ మోడల్ బేసిక్ హైస్కూల్, ప్రభుత్వ బాయ్స్ జూనియర్ కాలేజ్లో ఏర్పా టు చేసిన నీట్ పరీక్షా కేంద్రాలను తనిఖీ చేశారు.
ఎస్పీ జానకి ఎంవీఎస్ ప్రభుత్వ డిగ్రీ కళాశాల, ఎన్టీఆర్ మహిళా డిగ్రీ కళాశాల పరీక్షా కేంద్రాల వద్ద బందోబస్తు ఏర్పాట్లను పరిశీలించారు. జిల్లా కోఆర్డినేటర్, పీఎంశ్రీ కేంద్రీయ విద్యాలయం ప్రిన్సిపాల్ సురేందర్ మాట్లాడుతూ కేంద్రాల వద్ద అన్ని రకాలైన మౌలిక సదుపాయాలు, వసతులు కల్పించడంతోపాటు సకాలంలో అభ్యర్థులు హాజరయ్యేలా అన్ని శాఖల అధికారులు సమన్వయంతో ముందుకు సాగడంతో పరీక్ష ప్రశాతంగా ముగిసిందని పేర్కొన్నారు. జోగుళాంబ గద్వాల జిల్లా కేంద్రంలోని మూడు కేంద్రాల్లో నీట్ పరీక్ష నిర్వహించారు. జిల్లాలో మొత్తం మూడు కేంద్రాల్లో 1,029మంది అభ్యర్థులు హాజరుకావాల్సి ఉండగా, 1,005 మంది హాజరు కాగా 24 మంది గైర్హాజరయ్యారు. పరీక్షా కేంద్రాలను జిల్లా కలెక్టర్ సంతోష్, ఎస్పీ శ్రీనివాసరావు తనిఖీ చేశారు.