అచ్చంపేట : కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం కార్మిక వ్యతిరేక విధానాలకు పాల్పడుతూ తీసుకొస్తున్న నాలుగు లేబర్ కోడ్లను ( Labor Codes ) వెంటనే రద్దు చేయాలని సీఐటీయూ ( CITU ) జిల్లా సహాయ కార్యదర్శి ఎం శంకర్ నాయక్ డిమాండ్ చేశారు. జూలై 9 న జరగబోయే దేశవ్యాప్త సార్వత్రిక సమ్మెను ( Strike ) మున్సిపల్ కార్మికులు పాల్గొని విజయవంతం చేయాలని కార్మికులను కోరారు.
అచ్చంపేట మున్సిపల్ కార్యాలయ సిబ్బంది సానిటరీ ఇన్స్పెక్టర్ గణేష్‌కు సమ్మె నోటీసును అందజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ లేబర్ కోడ్స్ కు వ్యతిరేకంగా మే 20న తలపెట్టిన దేశవ్యాప్త సమ్మె ను పహల్గాం ఉగ్రవాదుల దాడుల కారణంగా వాయిదా పడిందని అన్నారు. దేశవ్యాప్తంగా ఉన్న కార్మిక సంఘాలు జూలై 9న సమ్మెకు పిలుపునివ్వడంతో కార్మికులు సమ్మెకు సిద్ధమవుతున్నారని అన్నారు.
కార్మిక వర్గం సమరశీల పోరాటాల ద్వారా సాధించుకున్న 29 కార్మిక చట్టాలను రద్దు చేయడం అత్యంత దుర్మార్గమైన విషయమని అన్నారు. కార్మికులకు ఈఎస్ఐ, పీఎఫ్ పెన్షన్ సౌకర్యాలు కల్పించడంతో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు పూర్తిగా విఫలమయ్యాయని గుర్తు చేశారు. మున్సిపల్ కార్మికులు రూ. 26 వేలు కనీస వేతనం ఇవ్వాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో రైతు సంఘం జిల్లా అధ్యక్షులు ఎల్. దేశ నాయక్, మున్సిపల్ కార్మికులు వెంకటమ్మ బాలమ్మ, సుభద్రమ్మ, గంగయ్య, రాములు, శివ, ఆలీ, హనుమంతు, భాస్కర్, తదితరులు ఉన్నారు.