లగచర్ల సమీపంలో ఏర్పాటు చేస్తున్న కంపెనీలు ఏవో తెలియడం లే దు. ఎవరికోసం, ఎందుకోసం భూసేకరణ చేపడుతున్నారనేది గిరిజనుల అభిప్రాయాలను బట్టి అర్థమవుతుందని జాతీయ ఎస్టీ కమిషన్ సభ్యుడు జలోతు హుస్సేన్ అన్నారు. రోటిబండతండాలో మీడియాతో మాట్లాడుతూ జరిగిన ఘటన దురదృష్టకరమే అయినప్పటికీ.. ఈ ఘటన వెనుక బయట వ్యక్తుల ప్రమేయం ఉండొచ్చని అనుమానం వ్యక్తం చేశారు.
భూసేకరణ చేసేటప్పుడు ఏ కంపెనీలు వస్తాయి? ఎందుకోసం పెడుతున్నాం? పూర్తిస్థాయిలో వివరించాల్సి ఉండగా ఇలాంటి ప్రయత్నం ఏమీ జరగడం లేదని తెలిసిందన్నారు. అందుకే గిరిజనులు భయంతో ఉ న్నారని.. వారు సమ్మతిస్తేనే భూములు తీసుకోవాలని సూ చించారు. జరిగిన ఘటనలపై పూర్తిస్థాయిలో విచారణ జ రిపి బాధ్యులపై చర్యలు తీసుకునేందుకు సిఫార్సు చేస్తామని వెల్లడించారు. డీజీపీ, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి నివేదిక కోరతానన్నారు. పోలీసులు భయభ్రాంతులకు గురి చేయడం వల్లే పల్లెలో జనం కనిపిస్తలేరని కమిషన్ బృందం వాపోయింది.
‘నా భర్త రాఘవేందర్ పంచాయతీ కార్యదర్శిగా పనిచేస్తున్నాడు. ఘటన జరిగిన రోజు ఇతర గ్రామంలో డ్యూటీ చేసి రాత్రికి ఇంటికి వచ్చాడు. అర్ధరాత్రి పోలీసులు వచ్చి తలుపులు బాది నా భర్తను అదుపులోకి తీసుకొని అరెస్టు చేసి రిమాండ్కు పంపించారు.. ఈ ఘటనలో నా భర్త అసలే లేడు. రెండు రోజుల కిందట అతడిని సస్పెండ్ చేస్తూ ఉత్తర్వులు ఇచ్చారు. ఇదేం అన్యాయం’.. అంటూ కమిషన్ బృందం ఎదుట రాఘవేందర్ భార్య కన్నీరుమున్నీరవుతూ విలపించింది. దీంతో కమిషన్ సభ్యుడు తాసీల్దార్, ఎస్పీని నిలదీశారు. అక్రమంగా అరెస్టు చేసిన పంచాయతీ కార్యదర్శిపై పూర్తిస్థాయి విచారణ జరిపి కేసు నుంచి తొలగించాలని సూచించారు. దీంతో ఎస్పీ నారాయణరెడ్డి విచారణ జరిపి చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు.