గద్వాల : పెండింగ్ కేసుల సత్వర పరిష్కారం కోసం ఈ నెల 13న నిర్వహించే జాతీయ లోక్ అదాలత్ ( Lok Adalat ) ను గద్వాల( Gadwal ) జిల్లా ప్రజలు సద్వినియోగం చేసుకోవాలని జిల్లా ప్రధాన న్యాయమూర్తి , జిల్లా న్యాయ సేవాధికార సంస్థ చైర్మన్ ఎన్.ప్రేమలత ( Judge Premalatha ) కోరారు. బుధవారం తన ఛాంబర్లో ప్రిన్సిపల్ సీనియర్ జడ్జి , జిల్లా న్యాయ సేవాధికార సంస్థ సెక్రటరీ వి.శ్రీనివాస్ తో కలిసి మీడియా సమావేశం నిర్వహించారు.
ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ లోక్ అదాలత్ ద్వారా కక్షిదారులు సత్వర న్యాయం పొందవచ్చని తెలిపారు. లోక్ అదాలత్ సేవలు ప్రజలకు పూర్తిగా ఉచితంగా అందుతాయని పేర్కొన్నారు. సెప్టెంబర్ 13న శనివారం,గద్వాల్‌లోని న్యాయస్థాన ప్రాంగణంలో లోక్‌అదాలత్ జరుగుతుందని తెలిపారు. రాజీ పద్దతిలో క్రిమినల్ కంపౌండబుల్ కేసులు, అన్నిరకాల సివిల్ కేసులు జాతీయ లోక్ అదాలత్‌లో పరిష్కరించుకునే అవకాశం ఉంటుందని వివరించారు.
లోక్ అదాలత్‌లో కేసులను పరిష్కరించుకుని తమ సమయాన్ని, డబ్బును ఆదా చేసుకోవాలని సూచించారు. రాజీ కుదిరితే, చెల్లించిన కోర్టు రుసుము, కోర్టు ఫీజు తిరిగి చెల్లిస్తామని పేర్కొన్నారు. క్రిమినల్ కంపౌండబుల్ కేసులు, సివిల్ తగాదా కేసులు, ఆస్తి విభజన కేసులు, కుటుంబపరమైన కేసులు, వైవాహిక జీవితం సంబంధిత కేసులు, బ్యాంకు రికవరీ, చెక్ బౌన్స్ కేసులు,రోడ్డు ప్రమాదాలు ఇతర కేసులపై సంబంధించిన కేసులను ఇరుపక్షాల సమ్మతితో రాజీతో పరిష్కారమయ్యే కేసులన్నింటినీ పరిష్కరిస్తామని తెలిపారు.
రాజీ మార్గం రాజమార్గమని, చిన్న చిన్న కేసులతో కక్షలు పెంచుకుని కోర్టుల చుట్టూ తిరుగుతూ సమయాన్ని, డబ్బులను వృథా చేసుకోవద్దని సూచించారు. గతంలో 8,195 కేసులు పరిష్కరించి గద్వాల జిల్లా రాష్ట్రంలో 11వ స్థానంలో నిలిచిందని తెలిపారు. ప్రజలు తమ సమస్యలను జిల్లా లీగల్ సర్వీసెస్ అథారిటీ ద్వారా సంప్రదించవచ్చని తెలిపారు.