Nagarkurnool | నాగర్ కర్నూల్: నాగర్ కర్నూల్ మండలం గగ్గలపల్లి గ్రామంలో మంగళవారం డాక్టర్ శరణప్ప ఆధ్వర్యంలో జాతీయ నాణ్యత ప్రమాణాల బృందం పల్లె దవఖానను ఆకస్మికంగా తనిఖీ చేసింది. గగ్గలపల్లి దవాఖానలో క్షేత్రస్థాయిలో ప్రజలకు అందిస్తున్న సేవలు గురించి ఫిబ్రవరి నెలలో జాతీయ నాణ్యత ప్రమాణాల బృందం వర్చువల్గా పరిశీలించింది.
ఈమేరకు మంగళవారం ఆకస్మికంగా జాతీయ నాణ్యత ప్రమాణాల బృందం డాక్టర్ శరణప్ప, డాక్టర్ విపిన్ కార్తీక్, పి గనిగేరు సంయుక్తంగా తనిఖీ చేశారు. ఫిబ్రవరి నెలలో అంచనా వేసిన జాతీయ నాణ్యత ప్రమాణాల ప్రకారం సేవలను, రికార్డులను పరిశీలించి, క్షేత్రస్థాయిలో అందుతున్నాయా అని ఆరా తీశారు. ముఖ్యంగా మాతా శిశు సంరక్షణ, అధిక రక్తపోటు, మధుమేహ వ్యాధిగ్రస్తులకు ప్రతినెలా అందిస్తున్న మందుల గురించి గగ్గలపల్లి గ్రామ ప్రజలను అడిగి తెలుసుకున్నారు. ఎంఎల్హెచ్పీ, ఏఎన్ఎం, ఆశా కార్యకర్తలు నిర్వహిస్తున్న రికార్డులను, ఆన్లైన్ పోర్టల్లో నమోదు చేసిన డేటాను పరిశీలించారు.
కాలానుగుణంగా వచ్చే దోమ కాటు వ్యాధులు డెంగ్యూ, మలేరియా, కలుషితమైన నీరు ఆహారం ద్వారా వ్యాప్తి చెందే టైఫాయిడ్ , నీళ్ల విరేచనాలు తదితర వ్యాధుల నివారణ గురించి అవగాహన కలిగించాలని వైద్య సిబ్బందికి సూచించారు. ఈ కార్యక్రమంలో ఆయుష్మాన్ ఆరోగ్య మందిర్ ప్రోగ్రామ్ అధికారి డాక్టర్ మంజుల వాణి, పెద్దముద్దునూరు ప్రాథమిక ఆరోగ్య కేంద్రం వైద్యాధికారి డాక్టర్ వాణి, డిపిఓ రేనయ్య, ఏవో అనంత చారి, క్వాలిటీ మేనేజర్ సంతోష్ కుమార్, ఎంఎల్హెచ్పీలు ప్రీతి, డాక్టర్ నీరజ్, ఎంపీహెచ్ఈవో ఫసియుద్దీన్, పర్యవేక్షకురాలు జ్యోతి, ఆరోగ్య కార్యకర్త రాజవర్ధన్ రెడ్డి, ఆశా కార్యకర్తలు పాల్గొన్నారు.