మరికల్, జనవరి 02 : నారాయణపేట జిల్లా మరికల్ మండలం జిన్నారంలోని మన్యవాగు నుంచి ఇందిరమ్మ ఇండ్ల నిర్మాణానికి ఇసుక తరలింపునకు శుక్రవారం తహసీల్దార్ రామకోటి ట్రాక్టర్లకు అనుమతులు ఇచ్చారు. ఇసుక తరలించేందుకు ట్రాక్టర్లు వెళ్లగా గ్రామస్తులు అడ్డుకున్నారు. ఇక్కడ నుండి ఇసుక తరలిస్తే భూగర్భ జలాలు అడుగంటుతాయని గ్రామస్తులు ఆరోపించారు. ప్రభుత్వ అధికారులు అనుమతిచ్చారని ఇసుకను తరలించేందుకు ప్రయత్నించగ అనుమతుల పత్రాన్ని గ్రామానికి చెందిన యువకుడు చించి వేశారు.
దీంతో రెండు వర్గాల మధ్య ఘర్షణ ఏర్పడింది. అనుమతుల పత్రాలను చించి వేసిన వ్యక్తిపై మరికల్ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు. ఇసుక రవాణా విషయమై తహసీల్దార్ రామకోటిని వివరణ కోరగా ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణానికి 10 ట్రిప్పులకు అనుమతి ఇచ్చామన్నారు. గ్రామస్తులు అడ్డుకోవడంతో శుక్రవారం ఇసుక రవాణాలను నిలిపివేసినట్లు తెలిపారు. అధికార పార్టీకి చెందిన వ్యక్తులు పది ట్రిప్పుల అనుమతితో అధిక మొత్తంలో ఇసుకను తరలించేందుకు ప్రయత్నించగా అడ్డుకున్నట్లు బీఆర్ఎస్ నాయకులు తెలిపారు.