మాగనూరు మార్చ్ 28: మాగనూర్, కృష్ణ మండలాల్లోని పలు గ్రామాలలో పారిశుద్ధ్యం అస్తవ్యస్తంగా తయారైంది. మురుగు కాలువలు పూడకపోయి దుర్వాసన వెదజల్లుతున్నాయి. వీధుల్లో చెత్తాచెదారం పేరుకపోయింది. పాలకవర్గాలు లేకపోవడంతో గ్రామాలలో పరిశుభ్రత లోటు కొట్టొచ్చినట్టుగా కనిపిస్తోంది. గ్రామాలలో దోమల నివారణ కనీసం నెలకు రెండు సార్లు అయినా ఫాగింగ్ చేయాల్సి ఉన్నా పట్టించుకునే వారు కరువయ్యారని స్థానికులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
మాగనూరు, కృష్ణ ఉమ్మడి మండల కేంద్రాలతో పాటు మండలాలలోని నేరడగం దొడ్డి, తాళం కేరి, ఓబులాపూర్ పెగడబండ హిందూపూర్ , చేగుంట గుడెబల్లూర్ మూడుమాల్, మురాల్ దొడ్డి, తంగిడిగి గ్రామాలతో పాటు పలు గ్రామాలలో డ్రైనేజీ వ్యవస్థ సరిగ్గా లేక నీరు వీధుల్లో ప్రవహిస్తున్నది. గ్రామ, మండల స్థాయి ప్రత్యేక అధికారుల పర్యవేక్షణ లేక గ్రామాల్లో అభివృద్ధి పనులు నిలిచిపోయాయి.
గ్రామాల్లో పంచాయతీ కార్యదర్శులు, గ్రామస్థాయి అధికారులు విధులకు హాజరై మధ్యాహ్నం వరకే ఇంటి ముఖం పడుతున్నారనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. తాగునీటి క్లోరినేషన్, బ్లీచింగ్ పౌడర్ చల్లే నాథుడే కరువయ్యారు. ప్రత్యేక అధికారులు గ్రామాల వైపే చూడడం లేదని వివిధ గ్రామాల ప్రజలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటికైనా ప్రత్యేక అధికారుల గ్రామాలలో పర్యటించి సమస్యల పరిష్కారానికి కృషి చేయాలని ప్రజలు కోరుతున్నారు.