Narayanpet : నారాయణపేట జిల్లా మాగనూరు మండల కేంద్రంలో 15 నిమిషాల వ్యవధిలోనే వేరువేరు ప్రమాదాలు చోటు చేసుకున్నాయి. ఇండియన్ ఆయిల్ పెట్రోల్ బంక్, అభిషేక్ దాబా సమీపంలో శుక్రవారం సాయంత్రం జరిగిన ప్రమాదాల్లో ఒకరు మరణించగా.. ఆరుగురు గాయపడ్డారు. స్థానికులు తెలిపిన వివరాల మేరకు.. కర్ణాటకలోని కడేచూర్ ఇండస్ట్రియల్ ఏరియా నుంచి ఖాళీ సిలిండర్లతో హైదరాబాద్ వెళుతున్న బొలెరో, మక్తల్ నుండి రాయచూర్ వైపు వెళ్తున్న కారు ఇండియన్ ఆయిల్ పెట్రోల్ బంక్, అభిషేక్ దాబా సమీపంలో ఢీకొన్నాయి.
సిలిండర్ లోడుతో ఉన్న బొలెరో వాహనం.. కారుపై పడడంతో అందులో ప్రయాణిస్తున్న వరలక్ష్మి అనే 60 ఏళ్ల మహిళ అక్కడికక్కడే మృతి చెందింది. కారులో ప్రయాణిస్తున్న విష్ణు, వినోద్ కుమార్, రాజేష్ తలకు, కాళ్లకు తీవ్ర గాయాలు కావడంతో.. వాళ్లను హుటాహుటిన మక్తల్ ప్రభుత్వాసుపత్రికి తీసుకెళ్లారు. అనంతరం మెరుగైన చికిత్స నిమిత్తం రాయచూరుకు తరలించినట్లు పోలీసులు తెలిపారు. ఈ యాక్సిడెంట్ జరిగిన 15 నిమిషాల వ్యవధిలోనే మండల కేంద్రంలోని ఎమ్మార్వో కార్యాలయం సమీపంలో దేవసూర్ నుండి బూడిది లోడుతో వెళ్తున్న ట్రిప్పర్.. బైక్‌ను ఢీకొట్టింది.
కృష్ణా మండలం మురాల్ దొడ్డి గ్రామానికి చెందిన ముకుంద, భార్య నర్మద కొడుకు అక్షయ్ కుమార్.. ముగ్గురు ద్విచక్ర వాహనంపై వెళ్తుండగా ప్రమాదవశాత్తు ట్రిఫర్ డీ కొన్నది. ఈ ప్రమాదంలో ముకుందకు తీవ్ర గాయాలయ్యాయి. చెవిలో రక్తస్రావమైనట్టు పోలీసులు తెలిపారు. ఈ ముగ్గురుని మక్తల్ నుంచి మహబూబ్ నగర్‌కు మెరుగైన చికిత్స నిమిత్తం తరలించినట్లు పోలీసులు తెలిపారు. ప్రమాదానికి సంబంధించిన మిగతా వివరాలు సేకరించి కేసు నమోదు చేసి దర్యాప్తు చేపడతామని ఎస్సై అశోక్ బాబు తెలిపారు.