నల్లగొండ, జూన్ 20 : జిల్లా కేంద్రంలోని గిరిజన విద్యార్థి వసతి గృహంలో ప్రవేశాల కోసం శుక్రవారం స్థానిక గిరిజన వసతి గృహం ఆవరణలో స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ నారాయణ అమిత్, జిల్లా గిరిజన అభివృద్ధి శాఖ అధికారి చత్రునాయక్ సమక్షంలో డ్రా తీశారు. మొత్తం 34 సీట్లలో బాలురు, బాలికలకు రిజర్వేషన్ ప్రకారం లాటరీ తీసి వసతి గృహంలో అడ్మిషన్ ఇచ్చారు. అయితే గత సంవత్సరం గిరిజన వసతి గృహంకి 100 సీట్లు ఉండగా ప్రస్తుతం కేవలం 34 సీట్లు మాత్రమే కేటాయించడంతో సీట్ల కోసం దరఖాస్తు చేసుకున్న విద్యార్థుల తల్లిదండ్రులు కలెక్టర్‌ను, గిరిజన అధికారులను సీట్లు ఎందుకు తగ్గించారని ప్రశ్నించారు.
కేవలం 34 సీట్లు మాత్రమే కేటాయించడం అన్యాయమన్నారు. 184 దరఖాస్తులు వస్తే 34 సీట్లు ఇవ్వడం వల్ల సీటు రానివారు ఎటు పోవాలని అన్నారు. అదనపు కలెక్టర్ స్పందిస్తూ ప్రభుత్వానికి నివేదిక పంపుతామని హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో ఏఎల్ఎం, డి వి నాయక్, ఏఓ పార్థసారథి, ఏ టి డి వో శ్రీనివాస్, వార్డెన్ రామకృష్ణ, సూపరింటెండెంట్ అతిక్, ఆల్ ఇండియా బంజారా సేవా సంఘం జిల్లా అధ్యక్షుడు ప్రవీణ్ నాయక్, లంబాడి హక్కుల పోరాట సమితి నాయకుడు సక్రునాయక్ పాల్గొన్నారు.
Nalgonda : బెస్ట్ అవైలబుల్ స్కీమ్ ద్వారా గిరిజన వసతి గృహా ప్రవేశాలకు విద్యార్థుల ఎంపిక