గద్వాల పట్టణంలో 150సీసీ కెమెరాలు
జిల్లా వ్యాప్తంగా 470సీసీ కెమెరాలు
గద్వాల న్యూటౌన్, మే5: జోగుళాంబ గద్వాల జిల్లా కేంద్రంలో నిఘా నేత్రాలను అమర్చడంతో పలు కేసులకు ఆధారాలుగా మారుతున్నాయి. గద్వాల పట్టణంలోని పలు ప్రాంతాల్లో ప్రధాన కూడళ్లలో, వార్డుల్లో సీసీ కెమెరాలను ఏర్పాటు చేయడంతో పలు కేసుల పరిష్కారం లభిస్తుంది. ఎలాంటి ప్రమాదం జరిగినా వెంటనే అందుకు కారణమైన వాహనాలను గుర్తించే అవకాశం ఏర్పడింది. బాధితులకు సత్వర న్యాయం జరుగుతోంది. సీసీ కెమెరాల ఏర్పాటతో కలిగే ప్రయోజనాలను స్థానిక వ్యాపారులు, ప్రజాప్రతినిధులకు పోలీసులు వివరించడంతో వీటి ఏర్పాటుకు ముందుకు వస్తున్నారు. కొన్ని నెలల నుంచి సీసీ కెమెరాలను ఏర్పాటు చేస్తున్నారు. కెమెరాల ద్వారా నమోదైన దృశ్యాలను ఎప్పటికప్పుడు పరిశీలిస్తున్నారు. ప్రమాదాలకు కారణమైన వాహనాలను వెంటనే గుర్తించి పట్టుకోగలుతున్నారు. ప్రమాదాలను గుర్తించడమే కాకుండా చోరీలు, అనుమానిత వ్యక్తుల వివరాలు తెలుసుకునే అవకాశం ఉంటుంది.
ప్రజలకు దగ్గరవుతూ..
రాష్ట్ర ప్రభుత్వం స్నేహపూర్వక పోలీస్ విధానాన్ని కొనసాగిస్తున్న ప్రజలకు దగ్గరవుతూనే ప్రజల సహాయ సహకారాలతో సీసీ కెమెరాలు ఏర్పాటు చేస్తూ నేరాలను నిలువరిస్తున్నారు. శాంతిభద్రతల పరిరక్షణకు పోలీసులు ముందుకుసాగుతున్నారు. ఇటీవల కాలంలో ప్రధానంగా రోడ్డు ప్రమాదాలు పెరుగుతున్నాయి. నిందితులను సత్వరమే గుర్తించి న్యాయం చేయడానికి పోలీసులు జిల్లా, పట్టణ, మండల కేంద్రాల్లో నిఘా నేత్రాలను ఏర్పాటు చేశారు. సీసీ కెమెరాల ఏర్పాటు వాటి ఆవశ్యకతపై ప్రజలకు ఎస్పీ రంజన్త్రన్కుమార్ అవగాహన కార్యక్రమాలు ఏర్పాటు చేస్తున్నారు. ప్రతి దుకాణం వ్యాపారులు, స్థానికులు భాగస్వామ్యం కావాలని చెబుతున్నారు.
పోలీసులు ఆధ్వర్యంలో గద్వాల పట్టణంలోని గాంధీచౌక్, పాతబస్టాండు, కొత్తబస్టాండు, కృష్ణవేణి చౌరస్తా, అంబేద్కర్ చౌక్, రాజీవ్మార్గ్, నదిఅగ్రహారం రోడ్డు, రాయిచూర్ రోడ్డు తదితర ప్రాంతాల్లో సీసీ కెమెరాలను ఏర్పాటు చేశారు. పట్టణంలో 150సీసీ కెమెరాలు ఏర్పాటు చేయగా మొత్తం జిల్లాలో ఇప్పటి వరకు 470 ఏర్పాటు చేశారు.
కేసుల ఆధారాలు లభ్యం
నిఘా నేత్రాలతో ఎంతో ఉపయోగం ఉంటుంది. వీటితో కేసులకు ఆధారాలు లభ్యమవుతున్నాయి. ఇటీవల జరిగిన రోడ్డు ప్రమాదాలు కారకులైన వాహనదారులను, నిందితులను సీసీ కెమెరాల ఆధారంగా పట్టుకోగలిగాం. జిల్లాలో మరిన్ని ప్రాంతాల్లో సీసీ కెమెరాలు ఏర్పాటు చేసి శాంతిభద్రతల పరంగా జిల్లాను కట్టుదిట్టంగా చేసేందుకు కృషి చేస్తాం.