జెన్కో డైరెక్టర్ వెంకటరాజం
ఆత్మకూరు, జూన్3: వర్షాలు మెండుగా కురుస్తున్న నేపథ్యంలో విద్యుదుత్పత్తికి సిద్ధంగా ఉండాలని జెన్కో డైరెక్టర్ వెంకటరాజం అధికారులకు సూచించారు. గురువారం దిగువ జూరాల జలవిద్యుత్ కేంద్రాన్ని సందర్శించిన ఆయన విలేకరులతో మాట్లాడారు. ప్రాజక్టులో వరద వచ్చి చేరుతున్న క్రమంలో విద్యుదుత్పత్తికి ఎలాంటి ఆటంకం లేకుండా సన్నాహకాలు చేసుకుంటున్నట్లు చెప్పారు. ఎగువ, దిగువ జూరాల ప్రాజక్టులన్నింటిలోనూ ఈ ఏడాది విద్యుదుత్పత్తిని మెరుగ్గా చేసేందుకు చర్యలు తీసుకుంటున్నట్లు పేర్కొన్నారు. రెండేండ్లుగా ఉత్పత్తిలో రికార్డులు సృష్టించినట్లు గుర్తుచేశారు. ఏడాదికేడాది ఉత్పత్తిని పెంచుకుంటూ చరిత్ర నెలకొల్పినట్లు తెలిపారు. ఈ ఏడాది కూడా వర్షాలు సమృద్ధిగా కురుస్తాయని భావించి, వరద వచ్చేసరికి అన్ని రకాలుగా యూనిట్లను సంసిద్ధం చేసేట్లుగా ఇప్పటికే సన్నాహక పరీక్షలు పూర్తిచేసినట్లు చెప్పారు. కార్యక్రమంలో ఎస్ఈలు జయరాం, వర్మ, డీఈలు విన్నూత్, ప్రభాకర్, వేణుగోపాల్, పవన్‌కుమార్, క్రిష్ణకిషోర్, రాజు, ఆనంద్ పాల్గొన్నారు.