తిమ్మాజిపేట, జూన్ 27: రాష్ట్ర ప్రభుత్వం పేదలకు సంక్షేమ పథకాలు అమలు చేస్తూ, వారికి అండగా నిలుస్తుండటం ప్రతిపక్షాలకు కంటగింపుగా మారిందని, ప్రభుత్వంపై దుష్ప్రచారం చేస్తూ రాక్షసానందం పొందుతున్నారని ఎమ్మెల్యే మర్రి జనార్దన్‌రెడ్డి మండిపడ్డారు. మండల కేంద్రంలోని తాసిల్దార్ కార్యాలయంలో కల్యాణలక్ష్మి చెక్కులను సోమవారం లబ్ధిదారులకు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ గతంలో ఏప్రభుత్వం అమలు చేయని పథకాలను రాష్ట్రంలో సీఎం కేసీఆర్ అమలు చేస్తున్నారన్నారు. కల్యాణలక్ష్మి, కేసీఆర్ కిట్, ఆసరా పింఛన్లు, ఉచిత విద్యుత్, రైతుబంధు, రైతు బీమా లాంటి పథకాలు దేశంలో ఎక్కడా లేవన్నారు. తెలంగాణ ప్రజల కోసం ఇన్ని చేస్తుంటే ఓర్వలేని ప్రతిపక్షాలు ప్రభుత్వంపై విషం చిమ్ము తూ సోషల్‌మీడియాలో ఇష్టానుసారంగా పోస్టులు పెడుతూ ఆనందం పొందుతున్నారన్నారు. టీఆర్ఎస్ కార్యకర్తలు, ప్రజాప్రతినిధులు గ్రామస్థాయిలో ప్రజలను కలిసి వాస్తవాలను వివరించి, దుష్ప్రచారాన్ని తిప్పికొట్టాలన్నారు.
రాష్ట్రంలో పేదల అభ్యున్నతి కోసం ముందుచూపుతో పథకాలను అమలు చేస్తూ సీఎం కేసీఆర్ పాలన సాగిస్తున్నారన్నారు. గత పాలనకు, ఇప్పటి పాలనను బేరిజూ వేసుకోవాలని విజ్ఞప్తి చేశారు. కల్యాణలక్ష్మి ద్వారా ఆడపిల్లల తల్లిదండ్రులకు భారం తగ్గిందన్నారు. మీరు ఆశీర్వదిస్తే భవిష్యత్‌లో మరింత ఉత్సాహంతో పనిచేస్తామన్నారు. అంతకు ముందు స్థానిక యూబీఐ అధికారులతో సమావేశమై రైతులకు సహకరించాలని కోరారు. కార్యక్రమంలో ఎంపీపీ రవీంద్రనాథ్‌రెడ్డి, జెడ్పీటీసీ దయాకర్‌రెడ్డి, మండల ప్రత్యేక అధికారి గోవిందరాజులు, డీటీ రాజేశ్వర్‌రెడ్డి, వైస్‌ఎంపీపీ శ్రీనివాస్‌యాదవ్, ఇన్చార్జి ఎంపీడీవో భాస్కర్, సర్పంచ్ వేణగోపాల్గౌడ్, సత్యం యాదవ్, టీఆర్ఎస్ మండల అధ్యక్షుడు జోగు ప్రదీప్, మార్కెట్ డైరెక్టర్ హుస్సేని పాల్గొన్నారు.
అప్పాజిపల్లి పాఠశాల పనులు ప్రారంభం
మండలంలోని అప్పాజిపల్లి గ్రామంలో మనఊరు-మనబడి కార్యక్రమంలో భాగంగా నూతనంగా నిర్మిస్తున్న పాఠశాల భవన పనులను సోమవారం ఎమ్మెల్యే మర్రి జనార్దన్‌రెడ్డి ప్రారంభించారు. ఈ సందర్భంగా హెచ్ఎంతో పాఠశాల వివరాలను అడిగి తెలుసుకున్నారు. పనులను త్వరగా పూర్తి చేయాలన్నారు. అనంతరం నిర్మాణంలో ఉన్న ఎదిరేపల్లి పాఠశాల పనులను పరిశీలించారు. తర్వాత ఇప్పలపల్లి యూపీఎస్‌ను సందర్శించి పాఠశాల సమస్యలను తెలుసుకున్నారు. ఆయన వెంట ఎంపీపీ రవీంద్రనాథ్‌రెడ్డి, జెడ్పీటీసీ దయాకర్‌రెడ్డి, వైస్‌ఎంపీపీ శ్రీనివాసులు, విండో వైస్‌చైర్మన్ రాందేవ్‌రెడ్డి, హెచ్ఎంలు అశోక్, వేణుగోపాల్‌రెడ్డి, నాయకులు శ్రీనివాస్‌రెడ్డి, పాండురంగారెడ్డి, రవీందర్‌రెడ్డి, రమేశ్, శ్యాంయాదవ్, రాములు, శేఖర్‌రెడ్డి, సురేందర్, ఎల్లారెడ్డి పాల్గొన్నారు.