అఖిల పక్ష సమావేశంలో వక్తల పిలుపు
కొల్లాపూర్, ఆగస్టు 19: కృష్ణానదీ జలాల్లో మన నీటి వాటా కోసం రాజకీయాలకతీతంగా అందరూ సంఘటితంగా పోరాడి సాధించుకోవాలని, అందుకు అందరూ సన్నద్ధం కావాలని గురువారం కొల్లాపూర్ మహబూబ్ ఫంక్షన్ హాల్లో కృష్ణానదీ జలాల్లో తెలంగాణ వాటా-నిర్వాసితుల అంశంపై, అఖిల పక్షం, వెల్టూర్-గొందిమల్ల బ్యారేజ్ సాధన సమితి ఆధ్వర్యంలో పెద్దమల్లయ్య అధ్యక్షతన ఏర్పాటు చేసిన రౌండ్‌టేబుల్ సమావేశం ముక్తకంఠంతో పిలుపునిచ్చింది. సమావేశానికి ముఖ్య అతిథిగా హాజరైన పాలమూరు అధ్యయన వేదిక జిల్లా కన్వీనర్ రాఘవాచారి మాట్లాడుతూ మన సమస్యలను సాధించుకోవాలంటే గళం పెంచి ప్రభుత్వాలపై ఒత్తిడి తెచ్చి సాధించుకోవాలన్నారు. పాలమూరు అధ్యయన వేదిక ద్వారా నాడు పాలక ప్రభుత్వాలు సూచించిన మేరకు రైతులకు ఉచిత విద్యుత్, నెట్టంపాడు, కల్వకుర్తి ఎత్తిపోతల పథకం, భీమా ప్రాజెక్టులను సాధించినట్లు ఆయన గుర్తు చేశారు. పోరాడితే తప్ప సమస్యలు పరిష్కారంకావన్నారు. ఏ ప్రాజెక్టులను నిర్మించినా భూములు కోల్పోయే రైతులకు పరిహారానికి బదులుగా భూమి, ఇండ్లు కోల్పోయినవారికి ఇండ్లు ఇవ్వాలని ఆయన కోరారు. వెల్టూరు-గొందిమల్ల బ్యారేజ్ నిర్మాణంతో కొల్లాపూర్ ప్రాంతానికి పూర్తి స్థాయిలో సాగునీరందుతుందని రాఘవాచారి పేర్కొన్నారు. బ్యారేజ్ సాధన కోసం అందరూ పోరాడాలన్నారు. కృష్ణా, గోదావరి జలాలపై కేంద్రప్రభుత్వం తీసుకొచ్చిన గెజిట్‌పై వక్తలు అభ్యంతరాలు వ్యక్తంచేశారు. సమావేశంలో కవి, అధ్యయనవేదిక నాయకులు ఎగ్బాల్, కొల్లాపూర్ మార్కెట్ కమిటీ చైర్మన్ నరేందర్‌రెడ్డి, డీటీఎఫ్ రాష్ట్ర నాయకులు శంకర్ప్రభాకర్, అధ్యయన వేదిక కన్వీనర్ బాలజంగయ్య, ప్రకాశ్‌గౌడ్, గద్వాల ఏజేసీ నాయకులు న్యాయవాది మధుసూదన్‌రావు, బ్లాక్‌కాంగ్రెస్ అధ్యక్షుడు రాముయాదవ్, బీజేపీ నాయకులు శ్రీధర్‌రెడ్డి, గొందిమల్ల బ్యారేజ్ సాధన రూపకర్త పెరు మాండ్ల శ్రీనివాసులు, కాశన్నయాదవ్,ఎత్తం కృష్ణయ్య, మాదాసి కురువ రాష్ట్ర నాయకుడు ధర్మయ్యతోపాటు వివిధ ప్రజాసంఘాలు, కులసంఘాలు, రాజకీయ పార్టీల నాయకులు పాల్గొన్నారు.