ఊట్కూర్, మే 07: ప్రతి రైతు ఫార్మర్ రిజిస్ట్రీ చేయించుకోవాలని జిల్లా వ్యవసాయ శాఖ అధికారి జాన్ సుధాకర్ అన్నారు. బుధవారం నారాయణపేట జిల్లా ఊట్కూర్ మండల కేంద్రంలోని సింగిల్ విండో కార్యాలయంలో రైతులకు మండల వ్యవసాయ అధికారి(ఏవో) గణేష్ రెడ్డి అధ్యక్షతన ఫార్మర్ రిజిస్ట్రీ పై అవగాహన కల్పించారు. ఈ సందర్భంగా జాన్ సుధాకర్ మాట్లాడుతూ..ఆధార్ తో దేశంలోని ప్రతి పౌరునికి గుర్తింపు ఇచ్చినట్లుగానే ప్రతి రైతుకు 14 నెంబర్లతో విశిష్ట సంఖ్య (యూనికోడ్) ని కేటాయించాలని కేంద్రం నిర్ణయించిందన్నారు. వ్యవసాయ రంగాన్ని పూర్తిగా డిజిటలైజ్ చేయాలనే సంకల్పంతో కేంద్ర ప్రభుత్వ సహకారంతో ఫార్మర్ రిజిస్ట్రీ ప్రాజెక్టును ప్రారంభించినట్లు తెలిపారు.
వ్యవసాయ భూమి ఉన్న ప్రతి రైతు తనకు ఉన్న భూములకు సంబంధించిన వివరములతో కూడిన సమాచారంతో ఈ ఫార్మర్ రిజిస్ట్రీ నిర్మించబడుతుందన్నారు. రెవెన్యూ శాఖ ద్వారా సేకరించిన భూ యాజమాన్య వివరములను రైతు ఆధార్ సంఖ్యను అనుసంధానం చేయడం ద్వారా ఈ ఫార్మర్ ఐడి ని కేటాయించడం జరుగుతుందని తెలిపారు. ఫార్మర్ రిజిస్ట్రీలో నమోదు రైతులకు ఎలాంటి చట్టబద్ధ యాజమాన్య హక్కును కల్పించదని, కేవలం రెవెన్యూ శాఖ వద్ద ఉన్న భూ యాజమాన్య వివరాలను ప్రామాణికంగా తీసుకొని ఈ రైతులకు ఫార్మర్ ఐడి కేటాయిస్తారని వివరించారు.
కేంద్ర ప్రభుత్వ పథకాల అమలుకు ఫార్మర్ రిజిస్ట్రేషన్ అనుసంధానం చేయడం జరుగుతుందని, పీఎం కిసాన్ లబ్ధిదారులకు తదుపరి విడత లబ్ధి పొందుటకు ప్రామాణికంగా ఫార్మర్ రిజిస్ట్రీలో నమోదు తప్పనిసరి చేస్తూ కేంద్ర ప్రభుత్వం మార్గదర్శకాలు జారీ చేసిందన్నారు. రాష్ట్ర ప్రభుత్వ సంబంధిచిన పథకాలు అయిన రైతు భరోసా, రుణమాఫీ తదితర రాష్ట్ర ప్రభుత్వ పథకాలకు ఫార్మర్ రిజిస్ట్రీకి ఏ రకమైన సంబంధం ఉండదని తెలిపారు. రైతు విశిష్ట సంఖ్యను (ఫార్మర్ ఐడి) పొందుటకు రైతు ఆధార్ కార్డు, భూ యాజమాన్య పాస్ పుస్తకము, ఆధార్ కు లింక్ చేయబడిన మొబైల్ నెంబరు తీసుకొని సమీపంలో ఉన్న మీసేవ సెంటర్ లో ఫార్మర్ ఐడీకి ప్రతి రైతు రిజిస్ట్రేషన్ చేసుకోవాలని తెలిపారు. కార్యక్రమంలో సింగిల్ విండో చైర్మన్ బాల్ రెడ్డి, ఏఓ గణేష్ రెడ్డి, ఏఈఓ చరణ్, వివిధ గ్రామాల్లో రైతులు పాల్గొన్నారు.