మాగనూరు కృష్ణ, ఏప్రిల్21: అంబేద్కర్ ఆశయాలతో బడుగు, బలహీన వర్గాలకు అండగా నిలిచేందుకు జనసేనను (Jana Sena) పవన్ కల్యాణ్ ప్రారంభించారని పార్టీ ఉమ్మడి మహబూబ్‌నగర్ జిల్లా యువజనవిభాగం అధ్యక్షుడు సాంబశివుడు అన్నారు. గ్రామ గ్రామాన పార్టీ బలోపేతం చేసేందుకు జనసైనికులు కృషి చేయాలని పిలుపునిచ్చారు. నారాయణపేట జిల్లా కృష్ణ మండలం హిందూపూర్‌లో డాక్టర్ మణికంఠ గౌడ్ అధ్యక్షతన జరిగిన మక్తల్ నియోజకవర్గ స్థాయి సమావేశానికి ఆయన హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పవన్ కల్యాణ్ ఆశయాలను గ్రామస్థాయిలోకి తీసుకువెళ్లి పార్టీ బలోపేతానికి ప్రతీ ఒక్కరు కృషి చేయాలన్నారు. నియోజకవర్గంలోని గ్రామాల్లో సమస్యలపై జనసైనికులు పోరాటం చేయాలని, ప్రజలకు అండగా నిలవాలని వెల్లడించారు. వివిధ పార్టీల నాయకులు రాజకీయంగా తమ ఎదుగుదలకు యువకులను ఉపయోగించుకుంటున్నారని, వారిని ముందడుగు వేయనీయడం లేదని విమర్శించారు.
కానీ పార్టీ ఆశయాలకు అనుగుణంగా ప్రజా సమస్యలపై పోరాడి ప్రజలకు అండగా నిలిచే యువకులకు రాజకీయ భవిష్యత్తు ఇవ్వడమే జనసేన ముఖ్య ఉద్దేశం అన్నారు. కష్టపడి పని చేసే ప్రతి ఒక్క కార్యకర్తను గుర్తిస్తామని, పార్టీలో సముచిత స్థానం కల్పిస్తామని వెల్లడించారు. తదనుగుణంగా జనసైనికులు రాబోయే స్థానిక ఎన్నికల్లో విజయానికి పాటుపడాలని సూచించారు. ఈ కార్యక్రమంలో ముకుంద నాయుడు, పీఆర్ రఘు, శరత్ గౌడ్, ఎండీ సోఫి, శ్యాంసుందర్, రామన్ గౌడ్, బాల్ రెడ్డి, డాక్టర్ మోహన్ బాబు, ఆది కేశవులు, చిట్యాల శ్రీను, భీమేష్, గౌడి రవీందర్ రెడ్డి, టేకులపల్లి భీమేష్, అలాగే వివిధ గ్రామాలకు చెందిన జన సైనికులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు.