Organ Donation : బ్రెయిన్ డెడ్ అయిన తమ కుమారుడి అవయవాలను దానం(Organ Donation) చేసి ఆదర్శంగా నిలిచిందో కుటుంబం. తమ బిడ్డ ఇకలేడు, తిరిగిరాడనే దుఃఖాన్ని దిగమింగి.. పలువురి ప్రాణాలు నిలిపింది కొనింటి కిరణ్ కుమార్(24) ఫ్యామిలీ. మానవత్వం ఇంకా బతికే ఉందని నిరూపిస్తూ కిరాణ్ కుటుంబ సభ్యులు తీసుకున్న అవయవదానం నిర్ణయం పలువురికి కొత్త జీవితాన్ని ప్రసాదించింది.
కృష్ణ మండల పరిధిలోని అనంపల్లి గ్రామానికి చెందిన కొనింటి కిరణ్ కుమార్ (24) హైద్రాబాద్లోని సిటీ కాలేజీలో ఎం, ఏ తెలుగు చదువుతున్నాడు. కొద్ది రోజుల కిందట బైక్ యాక్సిడెంట్ కావడంతో అతడి తలకు బలమైన గాయలయ్యాయి. నిమ్స్ అసుపత్రిలో చికిత్స పొందుతూ కిరణ్ సోమవారం చనిపోయాడు. కిరణ్ బ్రెయిన్ డెడ్ అయ్యాడని వైద్యులు చెప్పడంతో.. అతడి కుటుంబం తీవ్ర విషాదంలో మునిగిపోయారు. పుట్టెడు దుఃఖంలోనూ కిరణ్ కుటుంబ సభ్యులు ధైర్యంగా అవయవదానం చేయడానికి అంగికరించారు.
కుటుంబ సభ్యుల ఆమోదంతో వైద్యులు కిరణ్ కుమార్ గుండె, కాలేయం, మూత్రపిండాలు, కంటి కార్నియా.. తదితర అవయవాలను తొలగించారు. అనంతరం వాటిని అవసరమైన రోగులకు విజవంతంగా మార్పిడి చేశారు. తద్వారా పలువురికి కొత్త జీవితం లభించింది. కిరణ్ కుమార్ కుటుంబం తీసుకున్న ఈ నిర్ణయంతో మరణానంతరం కూడా మనిషి ఇతరుల్లో జీవించి ఉండే మార్గం అవయవదానమేనని నిరూపితమైంది. అందుకని కిరణ్ ఫ్యామిలీ నిర్ణయాన్ని వైద్యులు, కృష్ణ మండల ప్రజాప్రతినిధులు, సామాజిక సేవా సంస్థలు, ప్రజలు అభినందించారు.
ప్రతి ఒక్కరూ అవయవదానంపై అవగహన పెంచుకొని.. ప్రాణదాతగా నిలిచేందుకు ముందుకు రావాలని వైద్య నిపుణులు సూచిస్తున్నారు. అవయవదాతగా కిరణ్ కుమార్ ఇకపై పలువురి జీవితాల్లో ఆశాకిరణంగా చిరస్థాయిగా నిలిచిపోతాడని పలువురు అభిప్రాయపడ్డారు. కిరణ్ కుమార్ మృతదేహానికి మంగళవారం స్వగ్రామంలో అంత్యక్రియలు నిర్వహించగా.. గ్రామస్తులు పెద్ద సంఖ్యలో పాల్గొని ఘనంగా నివాళులర్పించారు.