మరికల్, ఆగస్టు 18: నారాయణపేట జిల్లా మరికల్ మండలంలోని పస్పుల ప్రాథమిక పాఠశాల ఆవరణలో వర్షపు నీరు నిలిచి చదువులకు ఇబ్బంది ఏర్పడుతున్న అధికారులు పట్టించుకోవడంలేదని బీఆర్ఎస్ మండల పార్టీ అధ్యక్షుడు లంబడి తిరుపతయ్య, పస్పుల మాజీ ఉపసర్పంచ్ నరసింహారెడ్డి ఆవేదన వ్యక్తం చేశారు. సోమవారం పాఠశాల ఆవరణలో వరి నాట్లు(Rice planting) వేసి తమ నిరసనను వ్యక్తం చేశారు. పాఠశాలలో వర్షపు నీరు చేరి విద్యార్థులకు అవంతరాలు ఏర్పడుతున్న అధికారులు పట్టించుకోవడంలేదని ఆగ్రహం వ్యక్తం చేశారు.
ఎనిమిదిన్నర లక్షలతో పాఠశాల కాంపౌండ్ వాల్ నూతనంగా నిర్మించడంతో వర్షపు నీరు బయటకు వెళ్లే మార్గం లేకుండా పాఠశాలలోనే వర్షపు నీరు ఆగి నడుము లోతు నీళ్లలోనే విద్యార్థులు పాఠశాలకు వెళ్లే దుస్థితి ఏర్పడిందని విమర్శించారు. ఇప్పటికైనా సంబంధిత అధికారులు పాఠశాల ఆవరణను మరమ్మతులు చేసి చదువులు సక్రమంగా సాగే విధంగా చూడాలని డిమాండ్ చేశారు. లేదంటే బీఆర్ఎస్ ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున ఆందోళన కార్యక్రమాలు చేపడుతామని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో బీఆర్ఎస్ నాయకులు తిమ్మయ్య గౌడ్, రాజేందర్ రెడ్డి, మథిన్, పెంటమీద నర్సింలు, జోగు రామస్వామి పాల్గొన్నారు