అచ్చంపేట రూరల్, జూలై 21 : విధుల్లో అలసత్వం వహిస్తే శాఖాపరమైన చర్యలు తప్పవని ఎమ్మెల్యే చిక్కుడు వంశీకృష్ణ వైద్య సిబ్బందిని హెచ్చరించారు. సోమవారం అచ్చంపేట వంద పడకల దవాఖానను ఆయన అకస్మికంగా తనిఖీ చేశారు. రోగులకు వైద్యులు నిరంతరం అందుబాటులో ఉండాలని ఆదేశించారు. సీజనల్ వ్యాధులు వ్యాపిస్తున్న వేళ వైద్యులు, స్టాప్ నర్సులు, సిబ్బంది రోగులకు అందుబాటులో ఉండి వైద్య సేవలు అందించాలని సూచించారు.
అచ్చంపేట ఏరియా హాస్పిటల్‌ను ఎమ్మెల్యే ఆకస్మికంగా తనిఖీ చేసి వార్డులో ఉన్నటువంటి రోగులను పరామర్శించారు. రోగులకు అందుతున్న వైద్య సేవల వివరాలను అడిగి తెలుసుకున్నారు. అచ్చంపేట ఏరియా హాస్పిటల్లో ఆగస్టు 6వ తేదీ నుండి మెగా సర్జికల్ క్యాంప్ నిర్వహించడం జరుగుతుందని తెలిపారు. అచ్చంపేట నియోజకవర్గ పరిసర ప్రాంత ప్రజలు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని కోరారు. వివరాలకు డాక్టర్ మహేశ్ 95539 96060, నర్సింగ్ ఆఫీసర్ ఆంటోని 86399 71676 నంబర్లకు సంప్రదించాలని దవాఖాన సూపరింటెండెంట్ డాక్టర్ ప్రభు తెలిపారు.