కోయిలకొండ, జూలై 22 : కాంగ్రెస్‌కు రైతులంటే చులకన అని, వారిని ముంచే కుట్ర చేస్తే సహించేది లేదు.. ఖబడ్దార్ రేవంత్‌రెడ్డి అని నారాయణపేట ఎమ్మెల్యే రాజేందర్‌రెడ్డి తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. మండలంలోని శేరివెంకటాపూర్ రైతువేదికలో శనివారం ఏర్పాటు చేసిన సమావేశంలో పాల్గొని మాట్లాడారు. కాంగ్రెస్ పాలనలో చాలీచాలని కరెంటుతోపాటు ఎరువుల కోసం పోలీస్‌స్టేషన్‌లో లైన్లో నిలబడి లాఠీ దెబ్బలు తిన్న విషయాన్ని గుర్తు చేశారు. నేడు ఆ పరిస్థితి లేదని, 24 గంటల నాణ్యమైన కరెంటుతోపాటు సాగుకు సరిపడా ఎరువులు, విత్తనాలు అందుబాటులో ఉంచామన్నారు. సీఎం కేసీఆర్ ముందుచూపుతో మిషన్ కాకతీయ ద్వారా చెరువులను పునరుద్ధరించారన్నారు. కాంగ్రెసోళ్లు 3 గంటల విద్యుత్ అందిస్తామంటుంటే.. బీజేపోళ్లు మోటర్లకు మీటర్లు పెడతామంటున్నారని మండిపడ్డారు. రైతులకు ఉచితంగా విద్యుత్ అందించడం వల్లే 2కోట్ల 78లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యాన్ని పండించామని వివరించారు. రైతులకు పెట్టుబడి నుంచి ధాన్యం కొనే వరకు ఇబ్బందులు లేకుండా తెలంగాణలో 7వేల కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేశామన్నారు.
సాగునీటి కల సాకారం చేస్తా..
మండలంలో ప్రతి ఎకరాకూ సాగునీరు అందించే కలను సాకారం చేస్తానని ఎమ్మెల్యే తెలిపారు. మండలంలోని పెర్కివీడ్ గ్రామం నుంచి మండలానికి సాగునీరు ప్రారంభం అవుతుందని వెల్లడించారు. పాలమూరు ఎత్తిపోతల పథకం ద్వారా మండలంలోని ప్రతి చెరువులో నీరు ఎప్పటికీ ఉంటుందన్నారు. పెద్దవాగులో నిర్మించిన చెక్‌డ్యాంలు పొంగిపొర్లుతున్నాయన్నారు. దీంతో ఆ పరిసర గ్రామాల్లోని వ్యవసాయ బోర్లల్లో నీరు పెరిగిందన్నారు. సీఎం కేసీఆర్ కృషితో మరో 7 చెక్‌డ్యాంల నిర్మాణానికి రూ.50కోట్లు మంజూరయ్యాయని తెలిపారు. కార్యక్రమంలో పేట బీఆర్ఎస్ సమన్వయకర్త రవీందర్‌రెడ్డి, జెడ్పీటీసీ విజయభాస్కర్‌రెడ్డి, రైతుబంధు జిల్లా సభ్యుడు శ్రీనివాస్‌రెడ్డి, రైతుబంధు మండల కన్వీనర్ మల్లయ్య, బీఆర్ఎస్ మండలాధ్యక్షుడు కృష్ణయ్య, సింగిల్‌విండో చైర్మన్ శ్రీనివాస్‌రెడ్డి, సర్పంచ్ సుందరమ్మ, నాయకులు భీంరెడ్డి, రవి, బచ్చిరెడ్డి, సతీశ్, మోహన్‌రెడ్డి తదితరులు పాల్గొన్నారు.