కొల్లాపూర్, మార్చి 20: వివాహితను వేధిస్తున్న ఆకతాయిని షీ టీమ్ (She Team) పోలీసులు అరెస్టు చేశారు. ఈ ఘటన నాగర్ కర్నూల్ జిల్లా పెద్దకొత్తపల్లి మండలంలో చోటుచేసుకున్నది. గత కొద్దిరోజులుగా ఫోన్లో వేధింపులకు గురి చేస్తున్నాడని, ఎన్నిసార్లు చెప్పిన నంబర్లు మారుస్తూ ఫోన్ చేస్తున్నాడని ఓ వివాహిత షీ టీమ్‌ను ఆశ్రయించారు. దీంతో అతనిపై నిఘావేసిన షీ టీమ్ పోలీసులు… మూడు రోజుల క్రితం చాకచక్యంగా అదుపులోకి తీసుకున్నారు. అతడి నుంచి సెల్ ఫోన్ స్వాధీనం చేసుకున్నారు. అదేవిధంగా నిందితుడికి కౌన్సిలింగ్ ఇచ్చి కేసు కూడా నమోదు చేసినట్లు షీ టీమ్ జిల్లా అధికారి విజయలక్ష్మి గురువారం నమస్తే తెలంగాణతో తెలిపారు.
మహిళల పట్ల, వివాహితల పట్ల అసభ్యంగా ప్రవర్తించినా, వారిని వేధింపులకు గురిచేసినా కఠినమైన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. ప్రధాన చౌరస్తాలలో షీ టీమ్ నిఘా పెట్టినట్లు వెల్లడించారు. వేధింపులకు గురవుతున్న మహిళలు తమను సంప్రదిస్తే వారి వివరాలను గోప్యంగా ఉంచడంతో పాటు బాధితులకు న్యాయం జరుగుతుందన్నారు. అలాగే వేధింపులకు గురిచేసే ఆకతాయిలకు బీఎన్ఎస్ సెక్షన్ల కింద కఠినమైన శిక్షలు పడతాయని హెచ్చరించారు.