మరికల్, జూలై 17: మరికల్ మండలం వెంకటాపురం వద్ద కోయిల్ సాగర్ (Koilsagar) కాలువకు గండిపడింది. దీంతో పంట పొలాలను వరద ముంచెత్తడంతో రైతులు తీవ్రంగా నష్టపోయారు. రెండు రోజుల క్రితం కోయిల్ సాగర్ నీటిని అధికారులు విడుదల చేశారు. అయితే కాలువల పరిస్థితిని చూడకుండానే నీటిని విడుదల చేయడంతో డీ-19 నుంచి పంట పొలాలకు నీరు అందించే 5వ తూము దగ్గర గండిపడింది. దీంతో మరికల్ మండలంలోని వెంకటాపురం గ్రామానికి చెందిన వెంకటేశ్వర్‌రెడ్డి పొలంలోకి నీరుచేరింది. ఆయన తన ఎనిమిది ఎకరాల పొలంలో వడ్లను చల్లారు. వరద నీరు పొలంలో నిలివడంతో పూర్తిగా మునిగిపోయింది. దీంతో సుమారు లక్ష రూపాయలు నష్టపోయినట్లు ఆయన వాపోయారు.
కాలువకు గండి పడిన విషయమై నీటిపారుదల శాఖ అధికారులకు ఫోన్ చేసి తెలిపిన పట్టించుకోవడంలేదని ఆవేదన వ్యక్తం చేశారు. అధికారులు స్పందించి రైతుకు నష్టపరిహారం చెల్లించాలని గ్రామస్తులు డిమాండ్ చేస్తున్నారు. కాల్వలో పరిస్థితులను పర్యవేక్షించడంలో అధికారులు పూర్తిగా విఫలం చెందారని రైతులు తమ బాధను వ్యక్తం చేస్తున్నారు.