నాగర్ కర్నూల్: ఊర్కొండ మండలం ఊర్కొండపేట దేవాలయం దగ్గర శనివారం రాత్రి కామాంధులు తప్ప తాగి ఒక మహిళపై అత్యాచారం చేసి తీవ్రమైన చిత్రహింసలకు గురిచేసి గాయపరచడం జరిగిందని, ఇలాంటి సంఘటనలు జరగడం ప్రజాస్వామ్యంలో చాలా దుర్మార్గమైన చర్య అని ఇటువంటి సంఘటనలు ప్రజలందరూ ఖండించాలని సిపిఎం జిల్లా కార్యదర్శి వర్థం పర్వతాలు విజ్ఞప్తి చేశారు. నిందితులను కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేస్తూ నాగర్ కర్నూల్
జిల్లా కేంద్రంలో అంబేద్కర్ విగ్రహం దగ్గర సిపిఎం పార్టీ ఆధ్వర్యంలో నిరసన వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ గ్యాంగ్ రేప్ కి పాల్పడిన నిందితులను ఫాస్ట్ ట్రాక్కోర్టు ఏర్పాటు చేసి విచారణ పూర్తిచేసి కఠినమైన శిక్షలు పడే విధంగా ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని,
అదేవిధంగా వారితో మహిళలకు వైద్య చికిత్సలు అందించి పునరావాసం కల్పించాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. దేవాలయం దగ్గర పోలీసు బందోబస్తు ఏర్పాటు చేసి భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కాకుండా చర్యలు చేపట్టాలని మహిళలకు భరోసా కల్పించే విధంగా ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో సిపిఎం జిల్లా కార్యదర్శి వర్గ సభ్యులు ఆర్ శ్రీనివాస్, కందికొండ గీత, జిల్లా నాయకులు పొదిలి రామయ్య, అంతటి కాశన్న, మల్లయ్య, వెంకటేష్, కాశయ్య తదితరులు పాల్గొన్నారు.