Nallamala | కొల్లాపూర్: నాగర్‌కర్నూలు జిల్లా కొల్లాపూర్ ఫారెస్ట్ రేంజ్ పరిధిలో దట్టమైన నల్లమల అటవీ ప్రాంతంలో గుప్త నిధుల తవ్వకాలు కలకలం సృష్టించాయి. ఆదివారం అర్ధరాత్రి దాటిన తర్వాత నల్లమల్లలో గుప్త నిధుల కోసం తవ్వకాలు జరిగినట్లు తెలుస్తోంది.
కొల్లాపూర్ ఫారెస్ట్ రేంజ్ పరిధిలోని ములచింతలపల్లి బీటు పరిధిలో మెదరబండ సమీపంలోని దేవుని బొక్క వద్ద గుప్తనిధుల కోసం కొంతమంది దుండగులు తవ్వకాలు జరుపుతుండగా ఫారెస్ట్ అధికారులు అదుపులోకి తీసుకొని కొల్లాపూర్ లోని ఫారెస్ట్ డిపోకు తరలించారు. గుప్త నిధుల తవ్వకాల కోసం వాడిన సామాగ్రితో పాటు ద్విచక్ర వాహనాలను సైతం ఫారెస్ట్ అధికారులు స్వాధీనం చేసుకున్నారు. గత కొద్ది వారాల నుంచి యథేచ్ఛగా దేవుని బొక్క వద్ద గుహలో గుప్త నిధుల కోసం తవ్వకాలు జరుగుతున్నా ఫారెస్ట్ అధికారులు గుర్తించలేకపోవడంపై పలువురు ఆశ్చర్యాన్ని వ్యక్తం చేస్తున్నారు. దేవుని బొక్క వద్ద ఉన్న పురాతనమైన రాత్రి విగ్రహాలను ధ్వంసం చేసినట్లు సమీప గ్రామ ప్రజలు పేర్కొంటున్నారు. గుప్తనిధులతో పట్టుబడిన దుండగులను అచ్చంపేట ఫారెస్ట్ డివిజనల్ ఆఫీసుకు ఫారెస్ట్ అధికారులు తరలించారు.