అచ్చంపేట : దోమలపెంట ఎస్ఎల్బీసీ టన్నెల్ ప్రమాదంలో చిక్కుకున్న మిగిలిన ఆరుగురి ఆచూకీ నేటికీ లభ్యం కాలేదు. 38 రోజులుగా రెస్క్యూ ఆపరేషన్ కొనసాగుతున్నది. ఎనిమిది మంది జీవ సమాధి కాగా వారిలో ఇద్దరు మృతదేహాలు బయటపడిన విషయం తెలిసిందే. మిగిలిన ఆరుగురి మృతదేహాల అన్వేషణ కోసం సహాయక బృందాలు అన్వేషణ చేస్తున్నాయి. కానీ వాటి ఆచూకీ ఇంకా లభించలేదు. టన్నెల్లోపల స్టీల్ తొలగింపు, కన్వేయర్ బెల్ట్ పునరుద్ధరణ పనులు వేగంగా కొనసాగుతున్నాయి. ఎస్ ఎల్ బి సి టన్నెల్ ప్రత్యేక అధికారి శివశంకర్ మంగళవారం ఎస్ ఎల్ బి సి, టన్నెల్ ఆఫీస్ వద్ద సొరంగం ప్రమాద ప్రదేశంలో జరుగుతున్న సహాయక చర్యలపై సమీక్ష నిర్వహించారు.
ఈ సమీక్షలో సహాయక బృందాలు చేపడుతున్న పనులపై వివరాలను అడిగి తెలుసుకున్నారు. సహాయక చర్యల పురోగతి గురించి వివరణాత్మకంగా చర్చించారు. ఈ సందర్భంగా శివశంకర్ మాట్లాడుతూ టన్నెల్ లోపల కొనసాగుతున్న సహాయక చర్యలకు ఆటంకంగా ఉన్న స్టీల్, ఇనుము పదార్థాలను టన్నెల్ బయటకు తరలిస్తున్నట్లు తెలిపారు. అలాగే, టీబీఎం (టన్నెల్ బోరింగ్ మెషీన్) చివరిభాగాలను కత్తిరించి, మట్టి తవ్వకాలు చేపడుతున్నట్లు, సహాయక పనులకు అడ్డంకిగా ఉన్న టీబీఎం భాగాలను బయటకు తరలిస్తున్నట్లు, ఊట నీటిని బయటకు తరలించే ప్రక్రియ కొనసాగిస్తున్నట్లు పేర్కొన్నారు. కేంద్ర, రాష్ట్ర సహాయక బృందాలు సమన్వయంతో సహాయక చర్యలను వేగవంతం చేస్తున్నట్లు, కన్వేయర్ బెల్టు పునరుద్ధరణ పనులు కూడా పూర్తిస్థాయిలో కొనసాగుతున్నట్లు తెలిపారు.
ఈ సమావేశంలో నాగర్ కర్నూల్ జిల్లా అదనపు కలెక్టర్, లోకల్ బాడీస్ దేవ, ఆర్మీ అధికారులు వికాస్ సింగ్, విజయ్ కుమార్, సింగరేణి అధికారి మాధవరావు, ఎన్డిఆర్ఎఫ్ అధికారులు మన్మోహన్ యాదవ్, సత్యనారాయణ, ఎస్డిఆర్ఎఫ్ అధికారి గిరిధర్ రెడ్డి, హైడ్రా అధికారి జయ ప్రకాష్, దక్షిణ మధ్య రైల్వే అధికారి నేత చంద్ర, రవీంద్రనాథ్, ర్యాట్ హోల్ మైనర్స్ ప్రతినిధి ఫిరోజ్ ఖురేషి, కేరళ కడవర్ డాగ్స్ ప్రతినిధి ప్రభాత్, జేపీ కంపెనీ ప్రతినిధులు పాల్గొన్నారు.