నాగర్‌కర్నూల్, జూన్ 3: గ్రామాల్లో నిర్వహించే పల్లె ప్రగతి కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని జెడ్పీ చైర్పర్సన్ పద్మావతి పేర్కొన్నారు. ఈనెల 18వ తేదీ వరకు నిర్వహించే పల్లె, పట్టణ ప్రగతి కార్యక్రమాలను విజయవంతంగా నిర్వహించేందుకు సమిష్టి కృషి అవసరమన్నారు. పల్లె, పట్టణ ప్రగతి కార్యక్రమాలపై శుక్రవారం కలెక్టర్ ఉదయ్‌కుమార్ ఆధ్వర్యంలో రూబీగార్డెన్స్లో సన్నాహక సమావేశం నిర్వహించారు. దేశంలో ఎక్కడా లేని విధంగా సీఎం కేసీఆర్ పల్లె, పట్టణ ప్రగతి కార్యక్రమాలు నిర్వహించి పల్లెల రూపురేఖలను మారుస్తున్నారని, అందుకు తగ్గట్టుగానే సర్పంచులు అధికారులు కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని కోరారు. అనంతరం కలెక్టర్ మాట్లాడుతూ పల్లెప్రగతిలో రాష్ట్రంలోనే జిల్లాను ముందుంచాలన్నారు. ఆయా మండలాలకు ఇచ్చిన లక్ష్యాలను ఖచ్చితంగా పూర్తి చేయాలని ఆదేశించారు. ప్రతి గ్రామంలో కమిటీలను ఏర్పాటు చేశామని, అందరూ సమన్వయంతో ఏ సమస్య మీదృష్టికి వచ్చినా పరిష్కరించాలని సూచించారు. అనంతరం ఎమ్మెల్యే మర్రి జనార్దన్‌రెడ్డి మాట్లాడుతూ పల్లెల అభివృద్ధికి సర్పంచులు ఎనలేని కృషి చేస్తున్నారని, వారి కృషికి నిదర్శనమే ఇటీవల కేంద్ర ప్రభుత్వం ప్రకటించిన స్వచ్ఛగ్రామాల్లో తొలి 10, 20 పల్లెలు మన రాష్ర్టానివే కావడం గర్వకారణమన్నారు. అంతకుముందు గత పల్లెప్రగతిలో గ్రామాలను అభివృద్ధి పరిచిన 55 గ్రామాల సర్పంచులు, కార్యదర్శులను జెడ్పీచైర్‌పర్సన్, కలెక్టర్ శాలువా, మెమోంటోలతో సత్కరించారు. కార్యక్రమంలో నాలుగు మున్సిపాలిటీల చైర్మన్లు, గ్రంథాలయ చైర్మన్ హన్మంత్‌రావు, ఈపీవో కృష్ణ, సీఈవో ఉష, జెడ్పీటీసీలు, ఎంపీపీలు తదితరులు పాల్గొన్నారు.
టెట్, గ్రూప్ మెటీరియల్ పంపిణీ
నాగర్‌కర్నూల్‌లో ఎంజేఆర్ ట్రస్టు ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న ఉచిత కోచింగ్ సెంటర్లో కోచింగ్ తీసుకుంటున్న అభ్యర్థులకు శుక్రవారం మెటీరియల్‌ను అందజేశారు. ముఖ్యంగా ముస్లిం, మైనార్టీ వారికి స్పెషల్‌గా ఉర్దూ మీడియం స్టడీ మెటీరియల్‌ను పంపిణీ చేశారు. కార్యక్రమంలో ముస్లిం మైనార్టీ పెద్దలు పాల్గొన్నారు.
ఆధ్యాత్మికతతో ఆనందజీవితం
ఆధ్యాత్మికతతో ఆనందమైన జీవితం సిద్ధిస్తుందని ఎమ్మెల్యే మర్రిజనార్దన్‌రెడ్డి అన్నారు. మండల పరిధిలోని గడ్డంపల్లిలో శుక్రవారం సగర ఉప్పర కులస్తులు నిర్మిస్తున్న చెన్నకేశవస్వామి విగ్రహ ప్రతిష్ఠ కోసం నిర్వహిస్తున్న పూజా కార్యక్రమంలో ఎమ్మెల్యే పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ తెలంగాణ ప్రభుత్వం సంస్కృతీసంప్రదాయాలకు పెద్దపీట వేసినట్లు తెలిపారు. సగర కులస్తులు నిర్మిస్తున్న ఈ ఆలయ నిర్మాణానికి తన వంతు సహకారం అందిస్తామని తెలిపారు. కార్యక్రమంలో ఎంపీపీ మధు, సర్పంచ్ లక్ష్మయ్య, రైతుబంధు అధ్యక్షుడు మాధవరెడ్డి, టీఆర్ఎస్ నాయకులు మధు, రాములు, సత్యనారాయణ, శ్రీను పాల్గొన్నారు.