నాగర్‌కర్నూల్, ఏప్రిల్ 3 (నమస్తే తెలంగాణ): ‘మన ఊరు- మన బడి’కి అడుగులు వేగవంతమవుతున్నాయి. ప్రభుత్వ పాఠశాలలను బలోపేతం చేసేందుకు సీఎం కేసీఆర్ ప్రతిష్టాత్మకంగా ఈ పథకాన్ని అమలు చేస్తున్నారు. ఇందులో భాగంగా వచ్చే విద్యా సంవత్సరం నుంచి ఆంగ్లమాధ్యమంలోనే పాఠాలు బోధించేందుకు ఏర్పాట్లు చురుగ్గా సాగుతున్నాయి.
దీనికోసం ఇప్పటికే ఉపాధ్యాయులకు ఆంగ్ల మాధ్యమంపై శిక్షణ తరగతులు ప్రారంభమయ్యాయి. ప్రస్తుతం రెండో విడుత శిక్షణ పూర్తయింది. కాగా జిల్లాలో 825ప్రభుత్వ పాఠశాలలు ఉండగా తొలిదశలో 290పాఠశాలలను ఎంపిక చేశారు. ఈ పాఠశాలలను ఆధునికంగా తీర్చిదిద్దేందుకు, మౌలిక సదుపాయాలను కల్పించేందుకు చర్యలు చేపడుతున్నారు. దీనికోసం నిధులు కేటాయించడంతో పాటుగా ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీ నిధుల్లో 40శాతం బడుల బాగుకు కేటాయించనున్నారు. ఇలా నిధుల సమస్య లేకుండా సీఎం చర్యలు చేపట్టారు.
పాఠశాలలు సందర్శన
ఈ క్రమంలో ఎంపీడీవో, ఎంఈవో, ఏఈలతో కూడిన అధికారుల బృందం గురువారం నుంచి పాఠశాలలను సందర్శించనున్నాయి. ప్రతి ఏఈ ఐదు పాఠశాలల వివరాలను ఆన్లైన్లో నమోదు చేయాల్సి ఉంటుంది. ఆయా పాఠశాలల్లో ఎలాంటి అవసరాలు ఉన్నాయనేది ఏఈలు ఎంఈవోలకు నివేదిస్తారు. ప్రభుత్వం సూచించిన 12అంశాల్లో చేపట్టాల్సిన పనులను స్ప్రెడ్ షీట్లో ఎప్పటికప్పుడు నమోదు చేపడతారు. వారం రోజుల్లో ఈ ప్రక్రియ పూర్తి కానుంది. అదేవిధంగా పాఠశాలలకు ప్రత్యేక బ్యాంకు ఖాతాలను ప్రారంభించనున్నారు. దీనిపై కలెక్టర్ విద్యాధికారులను ఆదేశించారు.
ఉపాధ్యాయులకు శిక్షణ
జిల్లాలో 411వరకు ఉపాధ్యాయ పోస్టులు ఖాళీగా ఉన్నాయి. కాగా ఆంగ్లమాధ్యమ శిక్షణలో ప్రాథమిక స్థాయిలో రెండు విడుతల్లో 1350మంది ఉపాధ్యాయులకు ఆంగ్ల మాధ్యమంలో శిక్షణ ఇచ్చారు. మిగిలిన 400మంది ఉపాధ్యాయులకు ఏప్రిల్ 4నుంచి శిక్షణ ఉంటుంది. ఉన్నత పాఠశాలల్లోని 800మంది ఉపాధ్యాయులకుగానూ 470మందికి శిక్షణ పూర్తయ్యింది. త్వరలో మిగిలిన ఉపాధ్యాయులకు శిక్షణ ఉంటుంది.
పాఠశాలల వివరాలు సేకరిస్తున్నాం
జిల్లాలో తొలి విడుతలో మనఊరు-మన బడి పథకం కింద 290స్కూళ్లను గుర్తించాం. ఈ పాఠశాలల్లో చేపట్టాల్సిన పనుల గురించి అధికారులతో నివేదికలు తయారు చేస్తున్నాం. వారంలోపు ఈ ప్రక్రియ పూర్తవుతుంది. వచ్చే సంవత్సరం ఆంగ్ల బోధన కోసం ఉపాధ్యాయులకు విడుతల వారీగా శిక్షణలు జరుగుతున్నాయి. ప్రస్తుతం రెండో విడుత శిక్షణ పూర్తయింది. ప్రభుత్వ పాఠశాలల్లో నాణ్యమైన, ఉచితమైన బోధన చేపట్టే దిశగా ప్రభుత్వం చర్యలు తీసుకుంటున్నది.
– ఉదయ్‌కుమార్, కలెక్టర్, నాగర్‌కర్నూల్