తిమ్మాజిపేట, ఫిబ్రవరి 22 : గర్భిణులు, బాలింతల్లో సంభవించే అనిమీయా (రక్తహీనత)పై సమన్వయంతో పనిచేయాలని జిల్లా అదనపు వైద్యాధికారి వెంకటదాసు అన్నారు. మంగళవారం మండలకేంద్రంలోని రైతువేదికలో ఏఎన్ఎంలు, అంగన్వాడీ,ఆశ కార్యకర్తలతో అనిమీయా ముక్తిభారత్ సమావేశాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ గ్రామాల్లో వైద్యశాఖ, అంగన్వాడీలు సేకరించే అంశాల్లో తేడాలు ఉంటున్నాయని, దీని కారణంగా ఇబ్బందులు తలేత్తుతున్నాయన్నారు. దీనిని నివారించేందుకు అందరూ కలసి పనిచేయాలన్నారు. గర్భం దాల్చిన మహిళలను 12 వారాల్లో గుర్తించి, వారికి వైద్యం అందించాలన్నారు. బిడ్డ పుట్టిన నాటి నుంచి 16 ఏండ్లు వయస్సు వచ్చే వరకు వారికి పలు రకాల టీకాలు ఇప్పించే బాధ్యత ఏఎన్ఎంలు, అంగన్వాడీ,ఆశ కార్యకర్తలపై ఉందన్నారు. సమావేశంలో వైద్యాధికారులు మంజుల, రాజు, అంగన్వాడీ సూపర్వైజర్ లక్ష్మి, హెల్త్ సూపర్వైజర్లు బంగారయ్య, మోహినోద్దీన్, గౌస్, సురేందర్‌రెడ్డి సిబ్బంది పాల్గొన్నారు.
లోపరహిత సమాజాన్ని నిర్మిద్దాం
గ్రామాల్లో వైద్య సేవలందించే ఏఎన్ఎంలు, ఆశాలు, అంగన్వాడీ కార్యకర్తలు సమిష్టిగా పనిచేస్తూ లోప రహిత సమాజాన్ని నిర్మించుకుందామని వైద్య సిబ్బంది కోరారు. మంగళవారం పట్టణంలోని ఈజీఎస్ కార్యాలయ సమావేశ మందిరంలో ఏఎన్ఎం, ఆశ, అంగన్వాడీ కార్యకర్తలకు రఘుపతిపేట పీహెచ్సీ ఆధ్వర్యంలో సమావేశం నిర్వహించారు. ఈసందర్భంగా వైద్య సిబ్బంది మాట్లాడుతూ గ్రామాల్లో చాలా మంది మహిళలు ఐరన్‌లోపంతో ప్రసవ సమయంలో చాలా ఇబ్బందులు పడుతున్నారని వారు సుఖంగా ప్రసవించే విధంగా చేయాలంటే గర్భిణులకు ఐరన్ మాత్రలను అందించాలని సూచించారు. అదేవిధంగా ఐదేండ్ల లోపు చిన్నారుల్లో పౌష్టికాహార లోపం వల్ల సరైన ఎదుగుదల ఉండడం లేదని, చిన్నారుల తల్లిదండ్రులకు పౌష్టికాహారంపై అవగాహన కల్పించి అందజేయాలని సూచించారు. కార్యక్రమంలో వైద్యురాలు శ్వేత, వైద్య సిబ్బంది నటరాజ్, రా జేందర్సింగ్, వెంకట్రాములుగౌడ్, పుష్పలత, సుమిత్ర, శ్రీనివాసులు, యశో ద, ఏఎన్ఎం, ఆశ, అంగన్వాడీ కార్యకర్తలు తదితరులు ఉన్నారు.
ఆరోగ్య భారత్‌లో భాగమవుదాం
ఆరోగ్య భారత్‌లో భాగమవుదామని డాక్టర్ అక్బర్ పిలుపునిచ్చారు. మండలకేంద్రలోని యోగా భవనంలో మంగళవారం నిర్వహించిన అనేమియా ముక్తా భారత్ కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ ఆశ వర్కర్లు పిల్లలో రక్తహీనత లేకుండా తీసుకోవాల్సిన జాగ్రత్తలను వివరించారు. పౌష్టికాహారం తీసుకునేలా పిల్లలు, తల్లిదండ్రులకు అవగాహన కల్పించాలని సూచించారు. ఇమ్యూనిటీ పెంచే ఆహారం ఏ విధంగా తీసుకోవాలో వివరించాలని సూచించారు. కార్యక్రమంలో డాక్టర్లు ప్రదీప్, మౌనిక పాల్గొన్నారు.