గిరిజనులను అవమానించిన కాంగ్రెస్ కౌన్సిలర్లు
విలేకరుల సమావేశంలో కౌన్సిలర్ల ఆవేదన
అచ్చంపేట, ఆగస్టు 19: అభివృద్ధి పనులకు నిధులు కేటాయిస్తే కాంగ్రెస్ కౌన్సిలర్లు అడ్డుకునేవిధంగా వ్యవహరిస్తున్నారని టీఆర్ఎస్ కౌన్సిలర్లు ఆవేదన వ్యక్తం చేశారు. గురువారం అచ్చంపేట మున్సిపల్ కార్యాలయంలో ఏర్పా టు చేసిన విలేకరుల సమావేశంలో మున్సిపల్ వైస్ చైర్మన్ శైలజావిష్ణువర్ధన్రెడ్డి కౌన్సిలర్లు సోమ్లానాయక్, సుగుణమ్మ, అంతటి శివ మాట్లాడారు. అచ్చంపేటలో ఈ నెల 21నుంచి తీజ్ ఉత్సవాల ప్రారంభం కానున్నందున కలెక్టర్ ఆదేశాల మేరకు గిరిజన భవనం మరమ్మతుల కోసం రూ. 2.50 లక్షల నిధులు కేటాయించారన్నారు. గురువారం మున్సిపల్ కౌన్సిల్ సమావేశంలో గిరిజన భవనానికి నిధులు కేటాయించడాన్ని తప్పుపడుతూ కాంగ్రెస్ కౌన్సిలర్లు వాకౌట్ చేయడం బాధాకరమన్నారు. కౌన్సిలర్ గౌరీశంకర్ ఎజెండా కాపీలను విసిరేయడం సరైందికాదన్నారు. గిరిజనులు, దళితులను అవమానించేవిధంగా వ్యవహరించడం బాధాకరమన్నారు. గిరిజన భవనం అభివృద్ధి కోసం నిధులు కేటాయించడం తప్పెలా అవుతుందని ప్రశ్నించారు. గిరిజనులపై వివక్ష చూపేలా వ్యవహరించడం కాంగ్రెస్ కౌన్సిలర్లకు తగదన్నారు. కలెక్టర్ ఆదేశాల మేరకు మున్సిపల్ చైర్మన్ నర్సింహాగౌడ్, కమిషనర్ శ్రీహరిరాజు కౌన్సిల్లో తీర్మానం కోసం చర్చపెట్టారన్నారు. అభివృద్ధి పనులను సహకరించాల్సిందిపోయి బంజారాల పండుగను, గిరిజనులను అవమానించడం మంచి పద్ధతి కాదన్నారు. సమావేశంలో కౌన్సిలర్లు గడ్డం రమేశ్, అప్పశివ తదితరులు పాల్గొన్నారు.
వాకౌట్ చేసిన కాంగ్రెస్ కౌన్సిలర్లు
అచ్చంపేట, ఆగస్టు 19: అచ్చంపేట మున్సిపల్ కౌన్సిల్ సమావేశాన్ని కాంగ్రెస్ కౌన్సిలర్లు వాకౌట్ చేశారు. గురువారం మున్సిపల్ కౌన్సిల్ సమావేశం నిర్వహించారు. మున్సిపల్ సిబ్బంది కౌన్సిల్లో ఎజెండా చదువు తుండగా వాగ్వివాదం మొదలైంది. అచ్చంపేటలోని గిరిజన భవనం మరమ్మతులకు రూ. 2.50 లక్షలు ఎలా కేటాయిస్తారని కౌన్సిలర్ గౌరీశంకర్ ప్రశ్నించారు. అట్టి నిధులు వాపస్ తీసుకోవాలన్నారు. పెడితే పట్టణంలో ఉన్న అన్ని భవనాలకు నిధులు కేటాయించాలన్నారు. దీంతో కౌన్సిలర్ల మధ్య వాగ్వివాదం పెరిగింది. కౌన్సిలర్ గౌరీశంకర్ ఎజెండా కాపీని నేలపై విసిరి బయటకు వెళ్లిపోయారు. తర్వాత కాంగ్రెస్ కౌన్సిలర్లు ఒక్కొక్కరూ బయటకు వెళ్లిపోయారు. కౌన్సిల్ సమావేశం టీఆర్ఎస్ కౌన్సిలర్లతో కొనసాగింది. రెండు నెలల కాలంలో చేపట్టిన అభివృద్ధ్ది పనులు వివరించారు. చేపట్టాల్సిన అభివృద్ధి పనులకు తీర్మానం చేశారు. కార్యక్రమంలో మున్సిపల్ చైర్మన్ నర్సింహాగౌడ్, కమిషనర్ శ్రీహరిరాజు, కౌన్సిలర్లు పాల్గొన్నారు.