నాగర్‌కర్నూల్, జూలై 22: వ్యవసాయ భూములకు సంబంధించి ధరణి పోర్టల్ ద్వారా వచ్చిన ఫిర్యాదులన్నింటినీ వీలైనంత త్వరగా పరిష్కరించాలని కలెక్టర్ ఉదయ్‌కుమార్ తాసిల్దార్లను ఆదేశించారు. శుక్రవారం ధరణి పోర్టల్‌లో వచ్చిన ఫిర్యాదుల పరిష్కారాలపై సంబంధిత రెవెన్యూ అధికారులతో కలెక్టరేట్ సమావేశ మందిరంలో సమీక్షించారు. ధరణి పోర్టల్ ద్వారా వచ్చిన ఫిర్యాదులు, వాటి పరిష్కారం, వివిధ మాడ్యూల్స్, పాస్‌బుక్, డేటా కరెక్షన్, ఇతర సమస్యలపై పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ద్వారా అవగాహన కల్పించాలన్నారు. తాసిల్దార్లు క్షేత్రస్థాయిలో పర్యటించి ప్రతిరోజూ పెండింగ్‌లో ఉన్న ఫిర్యాదుల స్థితిగతులను పర్యవేక్షించాలని రెవెన్యూ అధికారులకు కలెక్టర్ స్పష్టం చేశారు. ఇప్పటి వరకు వచ్చిన 2,897 ఫిర్యాదులను వెంటనే పరిష్కరించాలని ఆదేశించారు. తాసిల్దార్లు ధరణి మాడ్యూల్స్‌లో పేరు మార్పు, భూమి రకం మార్పు, భూమి, భూమి వర్గీకరణ మార్పు, ఏ భూమిని స్వాధీనం చేసుకున్నాయో దాని పద్ధతుల్లో మార్పు, విస్తరణ దిద్దుపాటు, మిస్సింగ్ సర్వేనెంబర్, సబ్ డివిజన్ నెంబర్, నోషనల్ ఖాతా(అన్ని రకాలు) నుంచి భూమిని బదిలీ చేయడం పట్టా, నాలా నుంచి వ్యవసాయానికి వినియోగాన్ని మార్చడం ఇలా 9అంశాలపై వచ్చిన ఫిర్యాదుల పరిష్కారాలపై అవగాహన కల్పించారు. మండలాల వారీగా తాసిల్దార్ల సమక్షంలోని కొన్ని పెండింగ్ ఫిర్యాదులను సమావేశంలోనే పరిష్కరించారు. సమావేశంలో అదనపు కలెక్టర్ రెవెన్యూ మోతీలాల్, ఆర్డీవోలు నాగలక్ష్మి, హనుమానాయక్, రాజేశ్‌కుమార్, పాండునాయక్, అన్ని మండలాల తాసిల్దార్లు పాల్గొన్నారు.